ఎస్సారెస్పీ పనుల్లో అవినీతి.. రికార్డులు మాయం..!

by  |
ఎస్సారెస్పీ పనుల్లో అవినీతి.. రికార్డులు మాయం..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : జల వనరుల శాఖ ఎస్సారెస్పీ విభాగంలో అవినీతి బట్టబయలైంది. చేయని పనులకు బిల్లులు చెల్లించినట్లు రూఢీ అవుతోంది. కోట్ల రూపాయలను అంతా కలిసి పంచుకున్నారు. దీనిలో అధికార పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా భాగస్వాములై ఉన్నారు. ఓ ఇద్దరు మంత్రులకు కూడా ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంబీ రికార్డుల అంశాన్ని కప్పిపుచ్చేందుకు సదరు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేసినా.. సాధ్యం కావడం లేదు. ఎట్టకేలకు ఎంబీ రికార్డులు కనిపించడం లేదని ఎస్సారెస్పీ అధికారులు వెల్లడించారు. మొత్తం 136 ఎంబీ రికార్డులు మూడేండ్ల నుంచి కనిపించడం లేదని, వాటిలో 74 ఎంబీలు ఇటీవల దొరకబట్టామని, ఇంకా 62 ఎంబీలు దొరకాల్సి ఉందని వెల్లడించారు. దీనికి సంబంధించి అధికారులకు నోటీసులు కూడా జారీ చేశారు.

నిధులు మాయం చేయడంతోనే..

ఎస్సారెస్పీ ప్రధాన కాల్వ, ఉప కాల్వల మరమ్మతు పనుల్లో అవినీతి జరిగినట్లు అనుమానాలున్నాయి. ఈ పనులకు సంబంధించిన ఎంబీ రికార్డులు మాయమయ్యాయి. ఇంజినీర్ల దగ్గర ఉండాల్సిన ఎంబీలు కనిపించకుండా పోయాయి. దీనిపై ‘దిశ’ వరుస కథనాలతో అధికారులు విచారణకు దిగారు. ఈ నేపథ్యంలో ఎంబీ రికార్డుల మిస్సింగ్ తేటతెల్లమైంది. ముందుగా ఈ విషయాన్ని కొట్టి పారేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేశారు. కానీ ఎంబీలు కనిపించక పోవడంతో శాఖాపరమైన విచారణకు ఆదేశాలిచ్చారు. ఎస్సారెస్పీలోని సర్కిల్-1లోని డివిజన్ 5లో ఈ వ్యవహారం బయట పడింది. దీనిపై ముందుగా ఒక సూపరింటెండెంట్, ఓ సీనియర్ అసిస్టెంట్‌కు నోటీసులు జారీ చేశారు. కానీ ఎంబీ రికార్డులు వారి నుంచి మాయం కాలేదని ప్రాథమికంగా గుర్తించారు. ఇంజినీర్లే వాటిని మాయం చేశారని తేలింది. పనులు చేయకుండానే చేసినట్లు కోట్ల బిల్లులు మాయం చేసినట్లు భావిస్తున్నారు.

ప్రైవేట్ కాంట్రాక్టర్ చేతిలో..

ఎట్టకేలకు దీనిపై విచారణ చేయగా.. అధికారులు ఎంబీ రికార్డుల కోసం వేట మొదలుపెట్టారు. దీంతో ఎస్సారెస్పీలో అంతా తానై చక్రం తిప్పిన ఓ ఇంజినీర్​దగ్గర కొన్ని రికార్డులు లభించాయి. ఓ కాంట్రాక్టర్​ దగ్గర ఈ రికార్డులు దొరికినట్లు తెలుస్తోంది. అయితే ప్రైవేట్ కాంట్రాక్టర్ దగ్గర ఎంబీలు ఎలా ఉన్నాయో అధికారులకు అంతు చిక్కడం లేదు. బిల్లులు చెల్లింపులు పూర్తి అయిన తర్వాత ఈ ఎంబీలు ఎలా బయటకు వెళ్లాయో శోధించే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టర్‌కు ఎంబీలు ఎవరు ఇచ్చారో తేలాల్సి ఉంది.

మనం మాట్లాడుదాం..

కాగా జల వనరుల శాఖలో ఈ అవినీతి వ్యవహారంలో ఇద్దరు మంత్రులు రంగ ప్రవేశం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఓ మంత్రి బంధువుకు సంబంధించిన కాంట్రాక్ట్ సంస్థ పనులు చేయడం, ఇంకో మంత్రి బినామీ సంస్థ ఈ పనులు చేయడంతో సదరు మంత్రులిద్దరు దీన్ని సముదాయించే పనిని భుజానేసుకున్నారు. ముందుగానే దీన్ని తొక్కిపెట్టేందుకు ప్రయత్నాలు చేసినా.. ఒకదశలో మంత్రి కేటీఆర్​సీరియస్ కావడంతో విచారణ తప్పలేదు. అయితే ఈ విచారణను కూడా నిర్వీర్యం చేసేందుకు సదరు మంత్రులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కరీంనగర్, వరంగల్​ఉమ్మడి జిల్లాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలకు కూడా ఇందులో ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్సారెస్పీ పనులు చేస్తుండటంతో.. వారికి కూడా ఈ అవినీతిలో వాటా ఉన్నట్లు భావిస్తున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed