ప్రపంచదేశాల్లో కరోనా విలయం ఇలా..!

by  |
ప్రపంచదేశాల్లో కరోనా విలయం ఇలా..!
X

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా పలు దేశాలు విలవిల్లాడుతున్నాయి. చైనాలో పుట్టిన ఈ వైరస్‌ను అక్కడ కట్టడి చేయగలిగినా యూరోప్ దేశాలు, అమెరికా మాత్రం దీనికి దారుణంగా బలైపోయాయి. సరైన సమయంలో మేల్కొనకపోవడం, పాలకుల నిర్లక్ష్యం కారణంగా వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. అగ్రరాజ్యం అమెరికా కరోనాకు అతిపెద్ద బాధితురాలిగా మిగిలిపోయింది. అక్కడ ప్రస్తుతం 4,28,703 మంది కరోనా సోకి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే 16,679 మంది మరణించగా.. గురువారం ఒక్కరోజు 1,917 మంది మృత్యువాత పడటం అక్కడి దారుణ పరిస్థితికి అద్దం పడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ సోకిన వాళ్లు 16,01,018 మంది కాగా ఇప్పటి వరకు మృతి చెందిన వాళ్లు 95,718 మంది. అయితే కరోనా సోకి చికిత్స పొంది కోలుకున్న వాళ్లు 3,54,972 మంది ఉండటం కాస్త ఊరట కలిగించే విషయం. ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడిన వాళ్లలో 30 శాతం మంది అమెరికాలోనే ఉండగా.. మృతుల్లో 17 శాతం మంది అక్కడి వాళ్లే.

ఇక చైనాలో గురువారం 42 మందికి కొత్తగా వైరస్ సోకినట్లు గుర్తించారు. వీరిలో 38 మంది విదేశాల నుంచి తిరిగి వచ్చిన వాళ్లే. ఇప్పటి వరకు ఆ దేశంలో కరోనా కారణంగా మరణించిన వాళ్ల సంఖ్య 3336 మంది. మరోవైపు చైనాలో ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేకుండా కరోనా పాజిటివ్‌గా 47 మంది నిర్ధారించబడ్డారు. కరోనా నుంచి కోలుకున్న వాళ్లు 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలనే నిబంధన విధించారు.

కరోనాతో విలవిల్లాడిపోయిన స్పెయిన్ దేశంలో ప్రస్తుతం మరణాల రేటు తగ్గిపోయింది. అక్కడ గత 24 గంటల్లో 683 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. స్పెయిన్‌లో ఇప్పటి వరకు 1,53,222 మందికి వైరస్ సోకగా.. 15,447 మంది మృత్యువాత పడ్డారు.

ఫ్రాన్స్‌లో 1,12,950య మందికి కరోనా వైరస్ సోకింది. వీరిలో 12,210 మంది మరణించారు. ఐసీయూలో ఉన్న 82 మంది కోలుకొని ఇండ్లకు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఐసీయూల్లో చేరే వారి సంఖ్య తగ్గిపోవడం ఊరటనిచ్చే అంశమని అధికారులు చెబుతున్నారు.

దక్షిణాఫ్రికాలో ఇప్పటి వరకు 1,934 మంది కరోనా వైరస్ బారిన పడి పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కోవిడ్-19 కారణంగా అక్కడ 18 మంది మృతి చెందారు. ఆ దేశంలో 21 రోజుల లాక్‌డౌన్ గడువు పూర్తయినా.. కరోనా విజృంభించే అవకాశాలున్నాయని భావించిన అక్కడి ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడిగించింది.

గల్ఫ్ దేశమైన యెమెన్‌లో తొలి కరోనా కేసు గురువారం నమోదైంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ప్రజలందరికీ హెచ్చరికలు జారీ చేసింది. వైరస్ విజృంభిస్తే కట్టడి చేయడం కష్టం కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ.. భౌతిక దూరం, వ్యక్తిగత శుభ్రత పాటించాలని కోరింది.

యూరోప్‌లో కరోనా వైరస్ కారణంగా కోలుకోలేకుండా దెబ్బతిన్న ఇటలీ ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి వస్తోంది. ఆ దేశంలో ఇప్పటి వరకు 1,43,926 మంది కరోనా బారిన పడగా.. 18,279 మంది మృతి చెందారు. గత వారం రోజులుగా అక్కడ మరణాల రేటు తగ్గిపోయిందని.. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో చాలా మంది పరిస్థితి నిలకడగానే ఉందని అధికారులు తెలిపారు.

– బ్రెజిల్‌ దేశంలో 18,092 మంది కరోనా బారిన పడగా 950 మంది మరణించారు. కాగా, ఆ దేశానికి అవసరమైన హైడ్రాక్సీక్లోరోక్వీన్ మాత్రలను భారత దేశం పంపించడానికి ఒప్పుకోవడంతో అక్కడ చికిత్స విధానంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. దీంతో మరణాల సంఖ్య తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు.

Tags: coronavirus, pandemic, across, globe, world, countries, deaths, cases, surges, america, china, europe countries

Next Story

Most Viewed