కరోనా వ్యాక్సిన్ అందరికీ ఫ్రీ : ఈటల

by  |
కరోనా వ్యాక్సిన్ అందరికీ ఫ్రీ : ఈటల
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ ఎప్పుడు వచ్చినా రాష్ట్ర ప్రజలందరికీ ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని, ప్రజలపై ఆర్థిక భారం పడకుండా చూసుకుంటుందని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. పోలియో తరహాలో దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ను అందించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అయినా అది బాధ్యతల నుంచి తప్పుకుని బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు మాత్రమే ఉచితంగా ఇవ్వనున్నట్టు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందని, కానీ అది సహేతుకం కాదని వెల్లడించారు. కేంద్రం తన బాధ్యతను విస్మరించినా తెలంగాణ మాత్రం ఇప్పటికే స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకుందని, తొలుత డాక్టర్ల మొదలు వైద్య సిబ్బందికి ఇచ్చి ఆ తర్వాత ప్రజలకు అందజేస్తామని స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం మీడియా ప్రతినిధులతో మంత్రి ముచ్చటిస్తూ పై వ్యాఖ్యలు చేశారు.

ఏయే సెక్షన్ల ప్రజలకు ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సిన్ ఇవ్వాలో వైద్యశాఖ ఇప్పటికే ముసాయిదాను తయారుచేసిందని, అన్ని జిల్లాల వైద్యాధికారులకు లేఖలు రాసి వైద్య సిబ్బంది వివరాలను పంపాల్సిందిగా ఈ నెల 31వ తేదీన డెడ్‌లైన్‌గా విధించిందని మంత్రి గుర్తుచేశారు. తొలుత డాక్టర్లు, వైద్య సిబ్బంది, పారా మెడికల్ స్టాఫ్ తదితరులకు వ్యాక్సిన్ ఇస్తామని, ఆ తర్వాత పారిశుద్య కార్మికులకు ఇస్తామని, ఆ తర్వాతనే పేదలు, వైరస్ బారినపడే ప్రమాదం ఉన్న సెక్షన్ల ప్రజలు తదితరులకు అందిస్తామని వివరించారు. రోజువారీ కూలీలు, పౌష్టికాహారం లేకుండా వ్యాధులకు గురయ్యేవారికి కూడా ప్రాధాన్యత ఉంటుందన్నారు. టీకాల విషయంలో ఆర్థిక అంశాన్ని చూడరాదని, ఉదారంగా వ్యవహరించి ప్రతిఒక్కరికీ అందించడమే లక్ష్యంగా ఉండాలన్నారు.



Next Story

Most Viewed