ధాన్యం కొనుగోలు కేంద్రాలకు కరోనా ముప్పు..

by  |
ధాన్యం కొనుగోలు కేంద్రాలకు కరోనా ముప్పు..
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కరోనా ముప్పు పొంచి ఉంది. గ్రామాల్లో భయం భయంగా కొనుగోళ్లు మొదలుపెట్టారు. గ్రామాల్లో సైతం కరోనా పాజిటివ్​ కేసులు నమోదవుతుండటంతో నిర్వాహకుల్లో ఆందోళన నెలకొంటోంది. కానీ ధాన్యం కొనుగోళ్లు కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో చేపట్టుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నా.. భయం మాత్రం వెంటాడుతూనే ఉంది.

వచ్చేవారితోనే ప్రమాదం

కొనుగోలు కేంద్రాల్లో సొంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శానిటైజర్, మాస్కులను వినియోగిస్తున్నారు. కానీ రైతులు, హామాలీల నుంచి కరోనా సోకే ప్రమాదముందని భయపడుతున్నారు. హమాలీలు కచ్చితంగా కొనుగోలు కేంద్రాల్లోనే ఉండాల్సి వస్తోంది. ధాన్యం తీసుకురావడం, వాహనాల్లోకి ఎక్కించడం కోసం హమాలీలు అక్కడే ఉండగా.. వాహనాలు ఇతర ప్రాంతాల నుంచి వస్తుండటంతో కరోనా వ్యాప్తిపై ఆందోళన చెందుతున్నారు.

టోకెన్ల వారిగా కొనుగోళ్లు

మరోవైపు కొనుగోళ్లపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేంద్రాల దగ్గరకు రైతులను ఒకేసారి రానీయడం లేదు. ఒక్కరు, ఇద్దరు రైతులు మినహా… ఎక్కువ మంది వస్తే వెనక్కి పంపిస్తున్నారు. దీనికోసం ముందుగానే టోకెన్లు జారీ చేస్తున్నారు. ఒక రోజు దాదాపు 20 టోకెన్లను లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. ఈ 20 మంది రైతుల దగ్గర కళ్లాల్లో నుంచి ధాన్యాన్ని తీసుకుంటున్నారు. టోకెన్ల ప్రకారమే కొనుగోలు చేస్తామని కరాఖండిగా చెప్పుతున్నారు. దీంతో రైతులు కేంద్రాల వైపు వెళ్లడం లేదు. ఒకవేళ వెళ్లినా వారిని ఉండనీయడం లేదు.

సొసైటీల్లో కొంత ప్రమాదం

రాష్ట్రంలోని సహాకార సంఘాల నుంచి ధాన్యం కొనుగోళ్లు చేస్తుండగా..ఈ సొసైటీల్లో ఒక్కసారిగా రైతులు గుమిగూడి ఉంటున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో వైరస్​వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. సొసైటీల్లో కూడా టోకెన్లు జారీ చేస్తున్నా.. రైతులు, సొసైటీ పాలకవర్గాల పైరవీలతో ముందుగా తీసుకోవాలంటూ ధాన్యాన్ని తీసుకువస్తున్నారు. దీంతో ఒక్కోసారి ఐదాఆరుగురు రైతులు గుమిగూడుతున్నారు. దీంతో సొసైటీల పరిధిలోని కొనుగోలు కేంద్రాల్లో కొంత ప్రమాదం ఉన్నట్లు భావిస్తున్నారు.

Next Story

Most Viewed