రాష్ట్రంలో 11 ప్రాంతాల్లో కరోనా థర్డ్ వేవ్!

by  |
Corona
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా థర్డ్ వేవ్‌పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమవుతుంది. సరిహద్దు జిల్లాలోని 11 ప్రాంతాల్లో థర్డ్ వేవ్ కేసులు నమోదవుతున్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. హెలికాప్టర్‌లో పర్యటనలు చేపట్టిన వైద్యశాఖ ఉన్నతాధికారులు పరిస్థితులపై నివేదికలు తయారు చేసిన కేబినెట్ కమిటీకి నివేదికలు సమర్పించారు. వైరస్ ప్రబలకముందే తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

సెకండ్ వేవ్ పూర్తిగా ముగిసిపోయింది… రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని ఊపిరి పీల్చుకుంటున్న క్రమంలో థర్డ్ వేవ్ కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలోని సరిహద్దు జిల్లాలో వైరస్ ప్రబలుతుండటంతో ప్రభుత్వం కారణాలను పరిశీలిస్తోంది. కరోనా వ్యాప్తి ఉన్న ప్రాంతాల్లో పర్యటనలు చేపట్టి నివేదికలు సమర్పించాల్సిందిగా వైద్యశాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

హెలికాప్టర్ పర్యటన

ప్రభుత్వ ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాస రావు, డీఎంఈ రమేష్ రెడ్డి, సీఎం ఓఎస్డీ గంగాధర్ రాష్ట్రంలో మూడు రోజుల పాటు హెలికాప్టర్ పర్యటనలు చేపట్టారు. గతంలో సరిహద్దు జిల్లాలో ప్రబలుతున్న వైరస్ ను కట్టడి చేసేందుకు చేపట్టిన చర్యలు ఫలితాలివ్వడంతో ఇదే ప్రక్రియను చేపట్టారు. వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో పరిశీలన చేపట్టి వైరస్ వ్యాప్తికి కారణాలేమిటనే అంశాలను సేకరించారు.

11 ప్రాంతాల్లో థర్డ్ వేవ్ గుర్తింపు

సరిహద్దు జిల్లాలోని 11 ప్రాంతాల్లో కరోనా థర్డ్ వేవ్ వైరస్ ప్రబలుతున్నట్టుగా వైద్యారోగ్యశాఖ అధికారులు గుర్తించారు. ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలు అధికంగా జరగడం, కొవిడ్ నిబంధనలను ప్రజలు గాలికి వదిలేయడం, సభలు, సమావేశాలు, పెళ్లిళ్లు, శుభకార్యాలయాలు అధికంగా నిర్వహించడం వలన వైరస్ వ్యాప్తి పెరుగుతున్నట్టుగా గుర్తించారు. పరిస్థితులను చక్కదిద్దేందుకు స్థానిక అధికారులతో రివ్యూ మీటింగ్‌లు ఏర్పాటు చేసి వ్యాధి ప్రబలకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

హుజురాబాద్‌లో కేసులు అధికం

హుజురాబాద్ నియోజవర్గంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదువుతున్నట్టుగా అధికారులు గుర్తించారు. ఉపఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గానికి నిత్యం వేలాదిగా నాయకులు, ప్రజలు వచ్చిపోతుండడం, సభలు, సమావేశాలు నిర్విరామంగా కొనసాగుతుండంతో నియోజకవర్గం వ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తోంది. రెండు వారాల నుంచి హుజూరాబాద్ నియోజకవర్గంలో 374 కేసులు నమోదుకావడం కలకలం సృష్టిస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయకముందే ఈ స్థాయిలో కేసులు నమోదవుతుంటే ఎన్నికల ప్రక్రియ మొదలైతే ఎన్ని కేసులు నమోదవుతాయనే ఆందోళన కలుగుతోంది.

కేబినెట్‌కు నివేదికలు

రాష్ట్రంలో 3 రోజుల పాటు పర్యటనలు చేపట్టిన వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు థర్డ్ వేవ్ పై నివేదికలు క్యాబినెట్ కు సమర్పించారు. వైరస్ వ్యాప్తి తీవ్రతను వెల్లడిస్తూ వైరస్ ప్రబలేందుకు గల కారణాలను వివరించారు. థర్డ్ వేవ్ వ్యాప్తి పెరగకముందే ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టి చికిత్సలు అందించనున్నారు.

Next Story

Most Viewed