ఏపీలోని గ్రీన్ జోన్‌కు కూడా సోకిన కరోనా

by  |
ఏపీలోని గ్రీన్ జోన్‌కు కూడా సోకిన కరోనా
X

దిశ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్ జోన్ విజయనగరం జిల్లాకు కూడా కరోనా పాకడం కలకలం రేపుతోంది. కరోనా వైరస్ భారత్‌లో ప్రవేశించినప్పటికీ ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు సోకలేదు. రెండు వారాల క్రితం ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తి ద్వారా శ్రీకాకుళం జిల్లాకు కరోనా పాజిటివ్ సోకింది.

అయినప్పటికీ విజయనగరం జిల్లాను మాత్రం తాకలేదు. లాక్‌డౌన్ విధించిన 45 రోజుల తరువాత విజయనగరం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసు నమోదవడం సంచలనం రేపింది. మే4వ తేదీన మూడవ దశ లాక్‌డౌన్ విధింపు నేపథ్యంలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో 5వ తేదీ నుంచి గ్రీన్ జోన్‌లో కొన్ని సడలింపులు అమలవుతున్నాయి. అంతే కాకుండా మద్యం విక్రయాలు కూడా అప్పటి నుంచే ప్రారంభమయ్యాయి.

ఈ క్రమంలో ఇచ్చిన రెండు రోజులకే ఇంత వరకు గ్రీన్ జోన్‌గా ఉన్న విజయనగరం జిల్లా ఆ హోదాను పొగొట్టుకుని ఆరెంజ్ జోన్‌లో నమోదైంది. విజయనగరం జిల్లా బలిజిపేట మండలం చిలకపల్లి గ్రామానికి చెందిన మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో జిల్లాలో తొలి కరోనా కేసుగా నమోదైంది. ఆమె కిడ్నీ సమస్యతో బాధపడుతూ విశాఖపట్టణం వెళ్లింది.

అక్కడ ఆమెకు వైద్య పరీక్షలు చేయగా ఆమెకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. ఆమె కొడుకుల ద్వారా ఆమెకి కరోనా సోకినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులందర్నీ విజయనగరంలోని ప్రభుత్వ కేంద్ర ఆస్పత్రికి తీసుకొచ్చి పరీక్షలు చేస్తున్నారు. అయితే వీరి ట్రావెల్ రికార్డు పరిశీలించిన పోలీసులు షాకయ్యారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వీరు తిరిగినట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అనుమానాస్పద లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. కాగా, ఏపీలో 1777 కేసులున్నాయి. అందులో 1097 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, 589 మంది కరోనా బారిన పడి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మరో 36 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు.

tags: corona positive, vizianagaram district, green zone, balijipeta mandal, chilakalapalli,



Next Story

Most Viewed