దేశంలో రికార్డు కేసులు.. ఒక్కరోజే 7,466 పాజిటివ్

by  |
దేశంలో రికార్డు కేసులు.. ఒక్కరోజే 7,466 పాజిటివ్
X

దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తీవ్రత రోజురోజుకూ ఎక్కువవుతోంది. శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ బులిటిన్ విడుదల చేసేటప్పటికే దేశవ్యాప్తంగా 24 గంటల్లో 7466 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకూ దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 165799కి చేరింది. ఒక్కరోజే 175 మంది కరోనాతో మరణించగా.. వ్యాధితో ఇప్పటివరకూ చనిపోయిన వారి సంఖ్య 4706కి చేరింది. దీంతో కరోనా మరణాల్లో దేశం చైనాను దాటేసింది. అధికారికంగా వెల్లడించిన లెక్కల ప్రకారం చైనాలో ఇప్పటివరకూ కరోనాతో చనిపోయినవారి సంఖ్య 4634గా ఉంది. మొత్తం కేసుల్లో దేశం ప్రపంచంలోనే 13వ స్థానంలో ఉండగా మరణాల్లో 9వ స్థానంలో ఉంది. కేసులు చైనాతో పోలిస్తే రెట్టింపవడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. దేశంలో ఇప్పటివరకు 71105 మంది కరోనా నుంచి కోలుకోగా ప్రస్తుతం 89987 యాక్టివ్ కేసులున్నాయి. శుక్రవారం కేసుల వివరాలు వెల్లడించేసరికి దేశంలో వ్యాధి సోకిన వారిలో కోలుకునే వారి శాతం 42.89గా ఉంది. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి తీవ్రత ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటివరకూ ఎక్కువగా కేసులు నమోదైన మహారాష్ట్రలో మంగళవారం ఒక్కరోజే 2682 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా రికార్డైన కేసులతో కలిపి మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 62228కి చేరింది. రాష్ట్రంలో గడిచిన 13 రోజులుగా 2వేలకు పైనే కొత్త కేసులు రికార్డవుతున్నాయి. ఇక్కడ ఒక్కరోజులోనే 116 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 2098కి చేరింది. రాజధాని ముంబైలో 1437 కొత్త కేసులు నమోదవడంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 36710కు చేరింది. నగరంలో ఒక్కరోజే 38 మంది కరోనాతో మరణించడం ముంబై వాసుల్లో కలవరం కలిగిస్తోంది. తమిళనాడులో ఒక్కరోజే 874 కొత్త కేసులు నమోదవడంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 20246కి చేరింది. రాష్ట్రంలో కరోనాతో ఒక్కరోజే 9 మంది మరణించడంతో ఇప్పటివరకూ చనిపోయిన వారి సంఖ్య 154కి చేరింది. రాజధాని చెన్నైలోనే 13362 కేసులు నమోదవడం నగర వాసుల్లో ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో ఒక్కరోజులో నమోదైనా 874 కేసుల్లో చెన్నైలోనే 618 ఉండడం గమనార్హం. గుజరాత్‌లో ఒక్కరోజే 372 కొత్త కేసులు నమోదు కాగా రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య15944కి చేరింది. రాష్ట్రంలో ఒక్కరోజే 20 మంది కరోనాతో చనిపోవడంతో ఇప్పటివరకూ ఇక్కడ వ్యాధి సోకి మరణించిన వారి సంఖ్య 980కి చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కరోజే కొత్తగా 85 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 3330కి చేరింది. ఇక్కడ ఇప్పటివరకు కరోనాతో 60 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 777 యాక్టివ్ కేసులున్నాయి.



Next Story

Most Viewed