గతేడాది కంటే మహమ్మారి తీవ్రరూపం :మోడీ

by  |
PM Modi
X

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి గతేడాది కంటే తీవ్రరూపం దాల్చిందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. ఎట్టిపరిస్థితుల్లో గ్రామాలకు ఈ వైరస్ ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. పంచాయతీరాజ్ దివస్ సందర్భంగా ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గతేడాది కరోనా మహమ్మారి గ్రామాలకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోగలిగామని అన్నారు. ఈ సారి కూడా గ్రామాలను మహమ్మారి నుంచి కాపాడుకోవాలని తెలిపారు. గ్రామాల్లోని స్థానిక నాయకులు గతేడాది కంటే ఇప్పుడు మహమ్మారిపట్ల అనుభవంతో ఉన్నారని, కచ్చితంగా దాని వ్యాప్తిని అరికట్టడంలో సఫలమవుతారని వివరించారు.

కరోనాపై మహమ్మారిపై విజయం సాధించేవి గ్రామాలేనన్న విశ్వాసం తనకున్నదని అన్నారు. కరోనాపై పోరులో గ్రామాలు దేశానికే కాదు, యావత్ ప్రపంచానికే మార్గనిర్దేశం చేస్తాయని తెలిపారు. ఇప్పుడు పంచాయతీల మంత్రం ‘మందులు, ముందుజాగ్రత్తలూ’ కావాలని సూచించారు. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను గ్రామీణ ప్రజలు ఆచరించాలని, వ్యాక్సిన్ వేసుకోవాలని అన్నారు. స్వామిత్వా పథకం కింద ప్రాపర్టీ కార్డులను ప్రధాని లాంచ్ చేసిన ఈ కార్యక్రమంలో ఎనిమిది రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పాల్గొన్నారు.



Next Story