ఒకే రోజు 27,114 మందికి కరోనా

by  |
ఒకే రోజు 27,114 మందికి కరోనా
X

దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు ఉద్ధృతమవుతోంది. శనివారం ఉదయం కేంద్ర ఆరోగ్యశాఖ బులెటిన్ వెల్లడించే సరికి గడిచిన 24గంటల్లో దేశంలో 27,114 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా వైరస్ ప్రవేశించినప్పటి నుంచి రోజువారి నమోదైన కేసుల గరిష్ట సంఖ్య ఇదే కావడం గమనార్హం. కొత్త కేసులతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 8,20,916కి చేరినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. వైరస్ బారిన పడి దేశంలో ఒక్కరోజే 519 మంది మరణించారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 22,123కి చేరింది. కరోనా సోకిన మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 5,15,386 మంది కోలుకోగా ప్రస్తుతం 2,83,407 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీలలో కరోనా వ్యాప్తి రోజురోజుకు తీవ్రమవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కరోజే 1781 కొత్త కేసులు నమోదై మొత్తం కేసుల సంఖ్య 1,10,921కి చేరింది. ఇక్కడ కొత్తగా 34కరోనా మరణాలు నమోదవడంతో మొత్తం 3,334 మంది వైరస్ బారిన పడి చనిపోయారు. మహారాష్ట్రలో ఒక్కరోజులోనే 8,139 పాజిటివ్ కేసులు నమోదై మొత్తం కేసుల సంఖ్య 2,46,600కి వెళ్లింది. రాష్ట్రంలో 24 గంటల్లో వైరస్ బారినపడి 223 మంది చనిపోగా మొత్తం మరణాలు 10,116కి చేరాయి. తమిళనాడులో 24గంటల్లో 3965పాజిటివ్‌లు నమోదై మొత్తం కేసుల సంఖ్య 1,34,226కి చేరింది. ఇక్కడ కొత్తగా కరోనాతో 69మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 1,898కి చేరింది. గుజరాత్‌లో ఇప్పటివరకు ఉన్న 41,027 కేసులకు గాను 2034 మంది మరణించడం రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 1813 కేసులు నమోదవడంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 27,235కు చేరింది. ఒక్కరోజే ఏపీలో కరోనాతో 17 మంది చనిపోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు వైరస్ సోకి 309 మంది మృత్యువాత పడ్డారు.

Next Story

Most Viewed