బిక్కుబిక్కుమంటున్న వేళ.. పిడుగు లాంటి వార్త

by  |
బిక్కుబిక్కుమంటున్న వేళ.. పిడుగు లాంటి వార్త
X

దిశ, నల్లగొండ: లాక్‌డౌన్‌తో ప్రైవేట్‌ ఉద్యోగుల భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికే కొందరి ఉద్యోగాలు తొలగించగా, మరికొందరిని తప్పించే పనిలో ప్రైవేట్‌ సంస్థలు ఉన్నాయి. దీంతో ఉద్యోగం ఉంటుందో పోతుందో అనే టెన్షన్ రోజురోజుకు పెరుగుతోన్నది. గత నెల జీతంలో కోతలు పెట్టగా, ఈ నెల జీతాలపై ఇంకా క్లారిటీ లేదు. ఇప్పటికే నెల రోజులకు పైగా ఇంటికే పరిమితమయ్యారు. చేతిలో డబ్బుల్లేక, పూట గడవక బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.

ఉద్యోగుల తగ్గింపు..

రాష్ట్రంలో చిన్నా, పెద్ద షాపింగ్‌ మాల్స్, గోల్డ్‌ షాపులు, వ్యాపార సంస్థలు, హాస్పిటల్స్‌, రెస్టారెంట్లు, హోటళ్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వీటిలో లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరంతా రూ. 8 వేల నుంచి 15 వేలకే పనిచేస్తున్నారు. లాక్‌డౌన్‌తో మార్చి 23 నుంచి ఇవి పూర్తిగా బంద్‌ అయ్యాయి. మరికొన్ని రోజులు లాక్‌డౌన్‌ పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత కూడా ఆంక్షలతో ఎత్తేసినా పెద్దగా గిరాకీ ఉండే అవకాశం లేదని వ్యాపారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆయా వ్యాపారులకు పెద్ద మొత్తంలో నష్టాలు వాటిల్లుతున్నాయి. అంతే కాకుండా మెయింటనెన్స్‌, ట్యాక్స్‌ చెల్లించక తప్పదు. దీంతో ఖర్చు, నష్టాలను తగ్గించుకునే పనిలో ఉన్నాయి. దీంతో వీలైనంత వరకు స్టాఫ్‌ను తగ్గించే పనిలో ఉంది. భవిష్యత్‌లో పరిస్థితి మంచిగా ఉంటే తామే కాల్‌ చేసి, రిక్రూట్‌ చేస్తామని చేతులు దులుపుకొంటున్నారు. హైదరాబాద్‌లోని ఓ హాస్పిటల్‌లో ఈ నెలలో సుమారు 200 మందికి పైగా స్టాఫ్‌ను తొలగించినట్లు బాధితులు చెబుతున్నారు.

ఈ నెల జీతంలోనూ కోతలేనా..?

లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు కోత విధించింది. 50శాతం వేతనాలనే ఇచ్చింది. దీన్ని ఆసరాగా చేసుకుని అనేక వ్యాపార సంస్థలు, కంపెనీలు సైతం జీతాల్లో కోత విధించాయి. ప్రైవేట్‌ ఉద్యోగులకు ఉండేది రూ. 20వేల లోపు జీతాలు. అందులోనూ సగం కోత విధించాయి. ఇక ఇప్పుడొచ్చే నెల జీతాలపై అందరిలో టెన్షన్‌ నెలకొన్నది. ఈసారి కనీసం సగం జీతాలైనా వస్తాయా.. లేక అది కూడా కోత పెడతారా అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. కొంత మంది అయితే కోత పెట్టినా, కొలువుంటే చాలని వాపోతుండటం విశేషం.

ఆర్థిక ఇబ్బందులు..

అసలే అరకొర జీతాలతో జీవితాలను నెట్టుకొస్తున్న తమకు కరోనా మహమ్మారి మరింత కష్టాల పాలుజేసిందని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారం లేక యాజమాన్యాలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తాము జీతాలు అడగలేని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. దీంతో ఉద్యోగులు అష్ట కష్టాలు పడుతున్నారు. పూర్తి జీతం వస్తనే పూట గడవడం కష్టంగా ఉందని, ఇప్పుడు జీతంలో కోతలు పెట్టడంతో మరింత దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నామని పలువురు వాపోతున్నారు. ఇంటి రెంట్‌, నిత్యావసరాలకు కూడా డబ్బుల్లేక తిప్పలు తప్పడంలేదంటున్నారు. అందరి పరిస్థితీ ఇదే విధంగా ఉండటంతో అప్పులు ఇచ్చేవారు కూడా లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్‌ మలక్‌పేటలోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో పనిచేస్తున్న వాణి అనే నర్సును మేనేజ్‌మెంట్‌ జాబ్‌ నుంచి తొలగించింది. లాక్‌డౌన్‌ ప్రారంభంలో పేషెంట్లు లేరనే చెబుతూ లీవ్‌ తీసుకోవాలని సంబంధిత హెచ్‌వోడీ తెలిపారు. తీరా గత వారం క్రితం హెచ్‌వోడీ ఫోన్‌ చేసి డ్యూటీకి రావాల్సిన అవసరంలేదని చెప్పి షాక్‌ ఇచ్చారు. అదేవిధంగా హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో సతీష్‌ అనే వ్యక్తి సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నాడు. వారం క్రితం హెచ్‌ఆర్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి కాల్‌ చేసి మీ సేవలు ఇక చాలు అని, అవసరం ఉంటే మళ్లీ రిక్రూట్‌ చేసుకుంటామని స్పష్టం చేశారు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు అనేక సంస్థల్లో ఇదే పరిస్థితి. అయితే కొంత మందిని మాత్రమే తొలగించగా, భవిష్యత్‌లో మరింత మంది రిమూవ్‌ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.

Tags: nalgonda, private employees, salary, cutting, hyderabad, corona effect



Next Story