మాకే దిక్కులేదు.. ఇగ వాళ్ల పరిస్థితేందీ..?

by Anukaran |
మాకే దిక్కులేదు.. ఇగ వాళ్ల పరిస్థితేందీ..?
X

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ సగటున 30 వేల కంటే ఎక్కువే నమోదవుతున్నాయి. సామాజిక వ్యాప్తి మొదలైందని, డాక్టర్లంతా అప్రమత్తంగా ఉండాలని, స్వీయ రక్షణ తీసుకోవాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా ఉన్న వైద్య సిబ్బందికి ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. దీంతో డాక్టర్లలో వణుకు పుడుతోంది. ఇప్పటికే పేషెంట్లను స్వయంగా చూడడానికి ముఖం చాటేస్తున్న చాలామంది డాక్టర్లు ఇకపైన వార్డుల్లోకి కూడా రారేమో! డాక్టర్లకు ‘రెడ్ అలర్ట్’ సర్క్యులర్ గురించి తెలుసుకున్న నర్సుల్లో ఇప్పుడు భయాందోళనలు పెరిగిపోతున్నాయి. డ్యూటీకి వెళ్ళడానికి భయపడుతున్నారు. ఫ్రంట్‌లైన్ వారియర్లుగా ఉన్న వీరిలోనే ఇంత ఆందోళన పుడితే ఇక సామాన్యుల గురించి చెప్పాల్సిన పనిలేదు. ప్రతిరోజూ దేశంలో సుమారు ఐదారు వందల మంది కరోనా కారణంగా చనిపోతూ ఉన్నారు. తెలంగాణలో పది మంది చొప్పున, ఆంధ్రప్రదేశ్‌లో యాభై మంది చొప్పున చనిపోతున్నారు.

వైరస్ వ్యాప్తిని అదుపుచేసే సంగతేమోగానీ ‘కరోనాతో సహజీవనం తప్పదు’ అని ప్రధాని, ముఖ్యమంత్రులు వ్యాఖ్యానించడం ప్రజలను గందరగోళంలో పడేసింది. ప్రభుత్వాలు ఏదో చేస్తాయనే నమ్మకం పెట్టుకునేకన్నా సొంత జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమం అనే అభిప్రాయానికి వచ్చేశారు. కరోనా సోకిన తర్వాత ప్రభుత్వాసుపత్రుల్లో ఏం జరుగుతూ ఉందో, ఎలా చనిపోతూ ఉన్నారో కళ్ళారా చూస్తున్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో పేషెంట్ల అత్యవసర పరిస్థితిని ఆసరాగా చేసుకుని యాజమాన్యాలు ఎలా దోచుకుంటున్నాయో కూడా గమనిస్తూ ఉన్నారు. వైరస్ బారిన పడిన తర్వాత ఆసుపత్రుల్లో బెడ్‌లు దొరక్క, ఆక్సిజన్ సౌకర్యం లేక, పట్టించుకునే వైద్య సిబ్బంది లేక, మంత్రులతో పైరవీలు చేసుకుంటే తప్ప చికిత్స అందదనే సంఘటనలను చూసిన తర్వాత ప్రజలు హడలి పోతున్నారు.

ఈ సహజీవనం ఇంకెన్నాళ్లో..?

ప్రస్తుత కరోనా పరిస్థితి ఎంతకాలం ఉంటుందో తెలియదు. పెరుగుతున్నకేసుల సంఖ్య తగ్గుతుందనే నమ్మకం లేదు. టెస్టులు చేయించుకుంటే పాజిటివ్ ఉందో లేదో తేలిపోతుందని అనుకునేవారు కొందరు. పాజిటివ్ అని తెలిస్తే అద్దె ఇల్లు ఖాళీ చేయక తప్పదేమో, చుట్టుపక్కల వారితో ఎలాంటి ఇబ్బందులు వస్తాయో అని భయపడేవారు మరికొందరు. ఒకవేళ ఆసుపత్రిలో చేరాల్సి వస్తే డాక్టర్లు చేయి కూడా పట్టుకుంటలేరు అనే సందేహంతో సరైన చికిత్స లభిస్తుందా? అనే అనుమానం మరోవైపు ప్రజల్ని ఆలోచనల్లో పడేస్తోంది. కరోనాకు మందే లేదని ప్రభుత్వాలు మొత్తుకుంటున్నా రకరకాల పేర్లతో లక్షలాది రూపాయలు ‘ఫార్మసీ’ కోసం అంటూ కార్పొరేట్ ఆసుపత్రులు బిల్లులు వేస్తున్నాయి. ”కేవలం ఇళ్ళకు మాత్రమే పరిమితమవుతున్న మంత్రులకూ, ఎమ్మెల్యేలకూ వైరస్ సోకుతోంది. పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కు వేసుకున్న వైద్య సిబ్బందికీ సోకుతోంది. అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్న డాక్టర్లకూ అంటుకుంటోంది. ఇక మనమెంత? ” అనే ప్రశ్నలు వేసుకుని సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. సర్కారు ఆసుపత్రుల్లో ఎదురయ్యే చేదు అనుభవాలను చూసి, కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీని చూసి హోమ్ ఐసోలేషన్‌లో ఉండిపోదామనుకుంటే ప్రజారోగ్య విభాగం, జీహెచ్ఎంసీ సిబ్బంది నుంచి సహకారం లేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్ళదీస్తున్నారు.

నర్సులకు ప్రభుత్వ భరోసా కరువు

ప్రభుత్వం నుంచి భరోసా లేకపోవడం నర్సులు, పారామెడికల్, వైద్య సిబ్బందిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. డ్యూటీకి వెళ్ళడానికి నర్సులు వెనకాడుతున్నారు. పట్టణ కేంద్రాల్లో స్థానిక వ్యాప్తి జరిగినా అదుపు చేయవచ్చేమోగానీ కమ్యూనిటీ వ్యాప్తి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోకి వైరస్ వెళ్ళిన తర్వాత అదుపు చేయడం ప్రభుత్వ యంత్రాంగానికి సాధ్యం కాదని, అక్కడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు సమయానికి అనుగుణంగా సేవలందించడంలో అనేక సమస్యలు ఉంటాయన్నదే నర్సుల భయానికి కారణం. ఇంతకాలం అందించిన సేవలు ఒక ఎత్తయితే ఇకపైన నెట్టుకురావడమే అసలైన సవాలు అని వారు భావిస్తున్నారు. అసలైన పరీక్షా సమయం ఇప్పుడు మొదలైందనేది నర్సులను వేధిస్తున్న భయం.

మాకేదీ భరోసా? : రాజేశ్వరి, ట్రెయిన్డ్ నర్సుల సంఘం రాష్ట్ర యూనిట్ చైర్‌పర్సన్

ప్రభుత్వాసుపత్రుల్లోని కరోనా వార్డుల్లో పనిచేసే నర్సులకు కనీసం రూ.యాభై లక్షల ఇన్సూరెన్సు, వేతనంతో కూడిన క్వారంటైన్ సౌకర్యాలు ఉన్నాయి. కానీ ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేసే నర్సులకు అలాంటివి లేవు. చాలీచాలని జీతంతోనే కుటుంబాన్నినెట్టుకురావాల్సి వస్తోంది. ప్రభుత్వాసుపత్రుల్లోని కాంట్రాక్టు/ఔట్‌సోర్సింగ్ నర్సులకు నెలలు గడుస్తున్నాఅపాయింట్‌మెంట్ ఆర్డరు, ఐడీ కార్డులు రాలేదు. డిమాండ్ల సాధన కోసం ధర్నా చేస్తే మంత్రీ రాలేదు, కనీసం డీఎంఈ కూడా రాలేదు. కానీ జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తే ఏకంగా మంత్రే గాంధీ ఆసుపత్రికి వచ్చి చర్చలు జరిపారు. ఇది మమ్మల్ని చిన్నచూపు చూడడం కాదా? ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా పేషెంట్లకు చికిత్స అందించాలని అనుమతి ఇచ్చిన ప్రభుత్వం ఆ వార్డుల్లో పనిచేసే నర్సుల భద్రత గురించి ప్రభుత్వం ఎందుకు బాధ్యత తీసుకోలేదు? కనీసం వాష్‌రూమ్‌లు కూడా లేని పరిస్థితుల్లో పనిచేస్తున్న నర్సుల గురించి ఎందుకు పట్టించుకోవడం లేదు?

వంద మందికిపైగా చనిపోతే భయం ఉండదా? : డాక్టర్ నర్సింగ్ రెడ్డి, ఐఎంఏ జాతీయ ఉపాధ్యక్షుడు
నాలుగైదు నెలలుగా కరోనా వైద్య సేవలందించే క్రమంలో వంద మందికిపైగా డాక్టర్లు ఇన్‌ఫెక్షన్ సోకి చనిపోయారు. ఎంతగా పీపీఈ కిట్లు, మాస్కులు ఉన్నా వైరస్ బారిన పడుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా వైరస్ వ్యాప్తి కట్టడి కావడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. పైగా ఇప్పుడు కమ్యూనిటీ వ్యాప్తి దశలోకి చేరుకున్నాం. కరోనా ఫ్రంట్‌లైన్ వారియర్లుగా పేషెంట్లకు సకాలంలో వైద్య సేవలందించడం ఎంత ముఖ్యమో ఇప్పుడు డాక్టర్లు, వైద్య సిబ్బంది సైతం వారిని వారు రక్షించుకోవడం అంతే ప్రధానమైన అంశంగా ముందుకొచ్చింది. దేశవ్యాప్తంగా వైద్య సిబ్బంది చాలా ఒత్తిడి మధ్య పనిచేయాల్సి వస్తోంది. ప్రస్తుత పరిణామాలు ఏ దిశగా వెళ్తాయో ఊహించిన ఐఎంఏ మమ్మల్నిఅప్రమత్తం చేయడానికి రెడ్ అలర్ట్ నోటీసు జారీ చేసింది.

ప్రైవేటు నర్సులకు భద్రత కరువు : లక్ష్మణ్ రుడావత్, నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి
కరోనా ఫ్రంట్‌లైన్ వారియర్లు అనే గుర్తింపు సరే. కానీ అది వారికి భరోసా ఇవ్వడం లేదు. కార్పొరేటు, ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేస్తున్న నర్సులకు చాలా తక్కువ జీతాలు ఉన్నాయి. ఇన్‌ఫెక్షన్ సోకి క్వారంటైన్‌లోకి పోతే జీతం రాదు. ఒకవేళ కరోనాతో చనిపోతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.50 లక్షల బీమా పథకం వర్తించదు. ఇంటికి, కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ పేషెంట్ల వైద్య సేవలో మునిగిపోయే వీరికి ప్రభుత్వం నుంచి భరోసా కరువైంది. ఈ భయం కారణంగానే చాలా మంది నర్సులు పది వేల రూపాయల జీతం కంటే ప్రాణమే విలువైంది అనుకుని ఇళ్ళకు వెళ్ళిపోయారు. ఖాళీగా ఉన్న నర్సుల పోస్టులు భర్తీ కావట్లేదు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పేరుతో జరిగే రిక్రూట్‌మెంట్‌పై వారికి ఆసక్తి లేదు.

ఫ్రంట్‌లైన్ వారియర్లకే ఆందోళన ఉంటే మేమెంత? : వంశీకృష్ణ, కరీంనగర్

ప్రతిరోజూ కరోనా కేసులు ఎలా పెరుగుతూ ఉన్నాయో కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే భయమేస్తోంది. ఎన్నిజాగ్రత్తలు తీసుకున్నా ఏ రూపంలో కరోనా సోకుతుందో అర్థం కావడం లేదు. రోగులను రక్షించాల్సిన వైద్య యంత్రాంగమే ఆందోళన పడుతోంది. జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇక సామాన్యులుగా మేమెంత? సర్కారు ఆసుపత్రుల్లో పరిస్థితి ఎలా ఉందో తెలియంది కాదు. ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరేంత ఆర్థిక స్థోమత లేదు. ఇది మామూలు వైరస్ కాదు. ఒక్కరికి వస్తే ఇంటిల్లిపాదికీ అంటుకుంటుంది. కట్టడి చేస్తుందనుకున్న ప్రభుత్వం పరిస్థితిని ఎక్కడి దాకా తెచ్చిందో చూస్తున్నాం.

‘అన్‌లాక్‌’తో పరిస్థితి అస్తవ్యస్తం: వీరేంద్రనాధ్, కరీంనగర్

బయటకు వెళ్తే కరోనాను వెంటపెట్టుకుని రావాల్సి వస్తుందేమో అనే భయం పట్టుకుంది. లక్షణాలు బైటకు రాకపోవడంతో ఎవరు పాజిటివో కాదో తెలియడం లేదు. జిల్లా యంత్రాంగం మొదట్లో చేసిన కట్టడి చర్యలు ఇప్పుడు కనిపించట్లేదు. సహజీవనం చేయాలని ప్రభుత్వం చెబుతోంది. వైద్య సిబ్బందే కట్టుదిట్టమైన రక్షణ వలయాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. సామాన్యుని పరిస్థితి సంకటంగా మారింది. బతుకుకు గ్యారంటీ లేదు. ఈ పరిస్థితి నుంచి సామాన్యులకు భరోసా కల్పించాల్సిన అవసరం ప్రభుత్వం పైనే ఉంది.

Advertisement

Next Story