ఐదేండ్లలో చేయలేని ‘స్వచ్ఛ భారత్’.. కరోనా దెబ్బతో పూటల్లోనే!

by  |
ఐదేండ్లలో చేయలేని ‘స్వచ్ఛ భారత్’.. కరోనా దెబ్బతో పూటల్లోనే!
X

మన చేత ‘కరోనా’ అర్జెంటుగా ఎన్నెన్ని చేయిస్తున్నదో! ఐదేండ్లలో జరుగని ‘స్వచ్ఛ భారత్’.. జెస్ట్ పూటల్లో క్లీనవుతున్నది! కడగడాలు, తుడవడాలు, ఊడ్వడాలు, ఫాగింగులు.. హబ్బో ఒక్కటేమిటీ సకులం సర్దేస్తున్నారు చకచకా! ఇల్లూ, వాకిలీ, ఊరూ వాడా సమస్తం పరిశుభ్రంగా ఉండాలనే తలంపుతో స్వచ్ఛ్ భారత్ అభియాన్ (SBA)ను పీఎం మోడీ ఏరికోరి ఇండియాకు పరిచయం చేశారు. ఒకటీ, రెండూ యాడపడితే ఆడ వద్దనీ, ఎంచక్కా టాయ్‌లెట్లు కట్టుకోవాలనీ, పల్లెలు, పట్టణాలు, నగరాలూ కళకళలాడాలంటూ ఎస్‌బీఏను మోడీ సర్కార్ డిజైన్ చేసింది. దానికి ఫైవ్ ఇయర్సు సుదీర్ఘ గడువు నిర్దేశించింది. బాపూజీ జయంతి నాడు అంటే, 2014 అక్టోబరు 2న శ్రీకారం చుట్టి, సరిగ్గా 2019 అక్టోబరు 2న చేతులు దులిపేసుకున్నారు! రాష్ట్రంసహా దేశమంతటా ఆ మధ్యలో అపుడపుడూ వీధులు ఊడ్చే ఫొటోలు, చెత్త ఏరివేసే సన్ని‘వేషాల’ చిత్రాలూ నిక్షేపంగా రికార్డుల్లోకి ఎక్కాయే కానీ, స్థితిగతులు మాత్రం దాదాపుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే! ఆ పబ్లిసిటీ గట్రాలకు బోలెడంత ప్రజాధనం ఖర్చు. ఇపుడా లెక్కా పత్రాలెందుకుగానీ, పాంచ్ సాల్ స్వచ్ఛ్ భారత్‌లో చేయలేనివన్నీ ఇపుడు రోజుల్లో చేసి చూపిస్తున్నారు. హైదరాబాద్ మెట్రోరైళ్లు, స్టేషన్లుసహా అనేక చోట్ల రెక్కలకు పని చెప్పారు. లిక్విడ్‌లు, మాపులతో క్లీన్నెస్‌కు నడుం కట్టారు. వీఐపీల కాలనీల్లో, ఇతర ప్రదేశాల్లో ఫోకస్ పెట్టారు. తన దాకా వస్తే కానీ.. సోయి రాదన్నట్టుగా ఫుల్లుగా అలర్ట్ అవుతున్నారు. ఇంకా కొంచెం ఉంది. అదీ చెప్పుకొందాం! ప్రయాణాల్లో కనీస జాగ్రత్తలు పాటించని ఫలితంగా లక్షలాది ప్రాణాలు రహదారులకు నైవేద్యం అవుతున్నాయి. మినిమమ్ తలకు హెల్మెట్ ధరించండని నెత్తీ నోరూ బాదుకున్నా లెక్క చేయరు. (రోడ్లు అత్యంత వరెస్టుగా ఉన్నాయన్నది కాదనలేనిదే) కానీ, కరోనా ఎక్కడ చప్పరిస్తుందోననీ, మాస్కులు, గ్లౌజులు మాత్రం ఎగబడి కొంటున్నారు. అవి లక్షల్లో అమ్ముడవుతున్నాయి. డిమాండ్‌ను బట్టి, రేటు ఎంత ఫిక్స్ చేసినా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. పైగా వాటి కొరతా ఏర్పడుతోంది. కంపల్సరీ ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. కానీ, మనం ఆలోచించుకోడానికి, స్వీయ విమర్శ కోసమే ఈ ప్రయత్నం!

Tags : corona effect, cleanliness, five years swachh bharat poor, now in days efforts, hyderabad, metro trains, stations, colonies.



Next Story

Most Viewed