కరోనా బాధితుల కోసం గాంధీ భవన్‌లో కంట్రోల్ రూమ్

by  |
Gandhi Bhavan
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా బాధితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఏఐసీసీ ఇన్ చార్జి మనిక్కమ్ ఠాగూర్ స్పష్టం చేశారు. గాంధీ భవన్‌లో కరోనా బాధితులకు సహాయ, సహకారాలు అందించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, 040-24601254 నెంబర్ కు ఫోన్ చేయాలని కోరారు. సోమవారం వర్చువల్ విధానంలో కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు.

దేశంలోనూ, రాష్ట్రంలోనూ కరోనా పరిస్థితులు తీవ్ర స్థాయిలో ఉన్నాయని, అరికట్టడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయ్యాయని దుయ్యబట్టారు. ప్రజలు భయాందోళనకు గురవుతునందున రాజకీయాలకు అతీతంగా కరోనా బాధితులకు అండగా నిలబడాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు. కరోనా బాధితులతో మనో ధైర్యం నింపేందుకు కృషి చేయాలని పిలుపు నిచ్చారు. ప్రజలకు ఉచితంగా మాస్కులు, మందులు, శానిటైజర్లు అందించేందుకు కాంగ్రెస్ తో పాటు యూత్ కాంగ్రెస్, విద్యార్థి సంఘాలు కృషి చేయాలని సూచించారు.

సామాజిక మద్యమాల్లో ప్లాస్మా కేంద్రాలు, ఆక్సిజన్ వివరాలు, ఆసుపత్రుల సమాచారం ఇవ్వాలని, రోగులు ఫోన్ చేస్తే సమగ్ర సమాచారం ఇచ్చేలా చూడాలని ఆదేశించారు. జిల్లా కేంద్రాల్లో కూడా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసి ప్రజలకు అండగా ఉండాలని అన్నారు. సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం ఆక్సిజన్ అందించడంలో కూడా విఫలం అయ్యాయన్నారు. ముందుగానే కరోనా పరిస్థితులను వివరించినా తెలంగాణ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని ఆరోపించారు. సమావేశంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, శ్రీనివాస్ కృష్ణన్, మధు యాష్కీ, వంశీ చంద్ రెడ్డి, సంపత్ కుమార్, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు, మాజీ ఎల్పీ నాయకుడు షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed