లంచం ఇస్తేనే నెలనెలా జీతం.. లేకపోతే అంతే!

by  |
Lancham-1
X

దిశ, మియాపూర్: జీహెచ్ ఎంసీలోని అన్ని విభాగాల్లో కెల్లా ఎంటమాలజీ విభాగానిది ప్రత్యేకం. ప్రజారోగ్యం విషయంలో కీలక పాత్ర పోషించే వాటిలో ఇది ఒకటి. అలాంటి ఈ విభాగంలో అవినీతి రాజ్యమేలుతున్నదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా సిబ్బంది హాజరు మొదలుకొని దోమల నివారణ చర్యలకు ఉపయోగించే డీజిల్, పెట్రోల్ తోపాటు ఎన్నో విషయాల్లో వెలుగుచూసిన నిజాలే ఈ ఆరోపణలకు ఊతం చేకూరుస్తున్నాయి. చందానగర్ సర్కిల్ 21లో 4 డివిజన్లకు గాను ఒక్కో డివిజన్ కు 18 మంది చొప్పున 72 మంది ఉన్నారు. కానీ రోజువారీ విధుల్లో మాత్రం ప్రతి రోజు 20-25 మధ్యలోనే హాజరు అవుతున్నట్లు సమాచారం. కారణం మిగతావారు యూనియన్ సభ్యులమనే నెపంతో విధులకు డుమ్మా కొడుతుండగా, మరికొంతమంది అందులో ఎంతోకొంత ముట్టజెప్పి ఏదోరకంగా విధులకు హాజరు అయినట్టు మేనేజ్ చేస్తున్నట్లు వాదనలు ఉన్నాయి.

రోజువారీ ఫాగింగ్ ఖర్చుల్లోనూ గోల్ మాల్…

దోమల నివారణ చర్యలలో భాగంగా ప్రతిరోజూ ఒక్కో సిబ్బందికి 5 లీటర్ల డీజిల్, రెండున్నర లీటర్ల పెట్రోల్ ఇవ్వాల్సిఉంటుందని సమాచారం. కానీ అక్కడ ఉన్న యంత్రాలు మాత్రం కేవలం నాలుగంటే నాలుగే. ఈ లెక్కన ఎంతమంది వాటిని వినియోగిస్తున్నారు అనేది అంతు పట్టని విషయం. పైగా ఒక్కో వ్యక్తిపై సుమారు రూ.700 ఖర్చు చేస్తున్నట్లు చూపిస్తున్నారు(అందులోనుంచి అర లీటర్ పెట్రోల్ మాత్రం సిబ్బంది వాహనానికి) ఇస్తున్నారు. ఇలా రోజుకు, నెలకు చూసుకుంటే ఈ వ్యయం చూస్తే కండ్లు బైర్లు గమ్మాల్సిందే. ఇవే కాకుండా డ్రోన్, ఇతర వాటిల్లోనూ ఇలాగే జరుగుతున్నట్లు వాదనలు గుప్పుమంటున్నాయి. ఉన్నతాధికారుల అజమాయిషీ లేకపోవడంతో ఈ వ్యవహారంలో ఎన్నో రోజులుగా వారి లీలలు అడ్డు అదుపు లేకుండా జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి.

లంచమిస్తేనే నెలవారీ జీతం…

అరకొర జీతంతో నెట్టుకొస్తున్న సిబ్బందికి జీతం కాడికి వచ్చేసరికి కాంట్రాక్టర్లు జలగల్లా పీడిస్తున్నారు. ఒక్కో సిబ్బంది నుంచి 600 రూపాయలు నెల నెలా వసూలు చేస్తున్నారు. 40 వేల రూపాయలను వీరి జీతం మీదనే సంపాదిస్తుండడం గమనార్హం. ఇదేంటని ప్రశ్నిస్తే ఆ మాత్రం ముడుపులు ఇచ్చుకోవాల్సిందే అంటూ తెగేసి చెప్పేస్తున్నారని సిబ్బంది వాపోతున్నారు.

అన్ని విభాగాల్లో తలదూర్చడంతో అటకెక్కిన దోమ నివారణ చర్యలు

జీఎచ్ఎంసీ ఏ కొత్త కార్యక్రమం చేపట్టినా వారికి మొదటగా గుర్తుకువచ్చేది ఎంటమాలజీ సిబ్బందే. దీంతో దోమల నివారణ చర్యలకు అంతంత ప్రాధాన్యం ఇస్తూనే ఇతర కార్యక్రమాల్లో వారి సేవల్ని వినియోగించుకోవడంతో ఎంటమాలజీ సిబ్బంది తమ విధులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేక పోతున్నారనే అపవాదు ఉన్నది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఎంటమాలజీ విభాగంపై దృష్టి సారించి అవినీతిని నిర్మూలించి ప్రక్షాళించడమే గాకుండా సిబ్బందిని పూర్తిస్థాయిలో తమ విభాగానికి సేవలందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.



Next Story

Most Viewed