మీటర్ రీడింగ్ కష్టాలు.. డిజిటల్ పేమెంట్స్ వర్కౌట్ అయ్యేనా..?

by  |
మీటర్ రీడింగ్ కష్టాలు.. డిజిటల్ పేమెంట్స్ వర్కౌట్ అయ్యేనా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనాతో మీటర్ రీడింగ్ తీసేందుకు విద్యుత్ ఉద్యోగులు రారు.. టీఎస్ ఎన్పీడీసీఎల్ సెల్ప్ మీటర్ రీడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది.. దీంతో వినియోగదారులే బిల్లు ఎంత వచ్చిందో యాప్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు.. వచ్చిన బిల్లును పేటీఎం, ఫోన్ ఫే, యాప్, బిల్లు డెస్క్ ద్వారా చెల్లించాలని ఈనెల 5 విద్యుత్ భవన్‌లో ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్ ప్రకటించారు.

కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తుంది. ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఇంటి పరిసరాల్లోకి బయటి వ్యక్తి వస్తే అనుమానంగా చూస్తున్న పరిస్థితి దాపురించింది. ఇటువంటి సందర్భంలో తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్‌) ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రతినెలా విద్యుత్‌ మీటర్ల బిల్లులు నమోదు చేయడం కష్టంగా మారడం, ఇప్పటికే విద్యుత్‌ మీటర్‌ రీడింగ్‌ చూసే సిబ్బంది కొందరు కరోనా బారినపడ్డారు. దాంతో వారు తీయబోమని స్పష్టం చేయడంతో పాటు రీడింగ్‌ కోసం వచ్చే వారికి కోవిడ్ ఉంటే ఇంటి పట్టు ఉంటున్న వినియోగదారులకు సోకే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో వినియోగదారులే రీడింగ్‌ తీసి బిల్లులు ఆన్‌లైన్లో చెల్లించాలని అధికారులు కోరారు.

రీడింగ్‌పై అవగాహణేది..?

వినియోగదారులకు మీటర్లపై అవగాహన ఉండదు. ఇప్పటి వరకు అధికారులు కల్పించిన దాఖలాలు లేవు. మీటర్ రీడింగ్‌లో కేవీఏహెచ్, కేడబ్ల్యూహెచ్ అనేవి వస్తూ పోతుంటాయి. అయితే ఒకసారి ఎక్కవు… తక్కువ చూపుతుంటాయి. ఇది సామాన్యుల అర్ధం కాదు. కేవలం విద్యుత్ శాఖ అధికారులకు, సిబ్బందికి మాత్రమే అవగాహణ ఉంటుంది. అంతేగాకుండా పీహెచ్ వాల్యూ, ఎంఎఫ్, కాంట్రాక్టు లోడ్, కలెక్టెడ్ లోడ్, ఎంఎన్ వాల్యూస్ అని మీటర్ లో వచ్చి పోతుంటాయి. అయితే ఎన్ని యూనిట్లు వచ్చిందో తెలుసుకోవడం కష్టమే. ఒక వేళ కేవీఏహెచ్ బదులుగా, కేడబ్ల్యూహెచ్ను చూసి బిల్లు చెల్లిస్తే అదనంగా భారం పడినట్లే. మళ్లీ చెల్లించిన బిల్లులను తిరిగి తీసుకోవాలంటే కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిందే. గతంలోని మీటర్లలో స్పష్టంగా రీడింగ్ కనిపించేది. అయితే పాత మీటర్ల స్థానంలో చైనా, తైవాన్ టెక్నాలజీతో వచ్చిన మీటర్లను అమర్చినప్పటి నుంచి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఆ మీటర్ రీడింగ్ ను తీసేటప్పుడు విధ్యుత్ సిబ్బంది చిప్‌ తీసుకొచ్చి లెక్కిస్తారు.

మీటర్లలో రెండు పద్ధతులు..

విద్యుత్ శాఖ అమర్చిన మీటర్లలో రెండు రకాలు ఉంటాయి. గృహ వినియోగానికి డొమెస్టిక్ కనెక్షన్, పరిశ్రమలకు, ఇండస్ట్రియల్ కు కమర్షియల్ అని మీటర్లను అమర్చుతారు. అయితే డొమెస్టిక్ వినియోగానికి ప్రభుత్వం స్లాబుల పద్దతిని నిర్ణయించింది. 51-100 వరకూ యూనిట్‌కు రూ 2.60, 101-150 వరకూ యూనిట్‌కు రూ. 3.25, 151-200 వరకూ యూనిట్‌కు రూ. 4.85, 201- 250 వరకూ యూనిట్‌కు రూ. 6.50, 251-300 వరకూ యూనిట్‌కు రూ. 6.88, 301-400 వరకూ యూనిట్‌కు రూ. 7.88, 401-500 వరకూ యూనిట్‌కు రూ. 8.38 చొప్పున నిర్ణయించి వసూలు చేస్తుంది. అయితే పరిశ్రమలకు యూనిట్‌కు రూ.6.88 చెల్లించాల్సి ఉంటుంది. ఎన్ని యూనిట్లు అయినా సరే రూ.6.88 చెల్లించాల్సిందే. అయితే దీనికి ప్రభుత్వం 1హెచ్‌పీకి అదనంగా రూ.60 మినిమం చార్జీని వసూలు చేస్తుంది. అంటే సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు యూనిట్ కు రూ.9 చొప్పున, పెద్ద కంపెనీలురూ.11 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అయితే కేవీఏహెచ్, కేడబ్ల్యూహెచ్ అనేవి వస్తూ పోతుంటాయి. కన్ ప్యూజ్ అయి కేడబ్ల్యూహెచ్ ను పరిగణలోకి తీసుకుంటే వేల రూపాయాల్లో చెల్లించాల్సి ఉంటుంది. దీంతో కంపెనీ నిర్వహకులే కాదు గృహ వినియోగదారులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది.

గతేడాది నష్టపోయిన పరిశ్రమల నిర్వాహకులు..

గతేడాది కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ విధించి ప్రభుత్వం 2019 మార్చి నెల ముందు వచ్చిన బిల్లులను చెల్లించాలని విద్యుత్ శాఖ అధికారులు కోరడంతో డోమెస్టిక్, పరిశ్రమల వినియోగదారులు చెల్లించారు. కానీ ప్రస్తుతం వినియోగదారులే రీడింగ్ తీసి ఆన్ లైన్లో బిల్లలు చెల్లించాలని సూచించడంతో ఆందోళన నెలకొంది. గతేడాది పరిశ్రమల నిర్వహకులు అధిక బిల్లులు చెల్లించి తీవ్ర ఇబ్బందులు పడిన ఘటనలు ఉన్నాయి. ప్రతి నెలా సూక్ష్మ, మధ్య తరగతి పరిశ్రమలకు రూ.4 వేల నుంచి రూ.8వేల లోపు వస్తుంది. అయితే పరిశ్రమలు లాక్ డౌన్ కారణంగా మూతపడటంతో రీడింగ్ తెలియక పోవడంతో… ప్రభుత్వం సూచన మేరకు చెల్లించారు. అనంతరం రీడింగ్ తక్కువగా ఉండటంతో చెల్లించిన డబ్బులు తిరిగి తీసుకునేందుకు విద్యుత్ శాఖ ఏఓ, పీఓ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేశామని.. కొంత మంది సమయం వృథాతో పాటు కంపెనీ ఉత్పత్తులపై దృష్టి సారించలేకపోతున్నామని డబ్బులు వదిలివేసుకున్నారని పలువురు సూక్ష్మ, మధ్య తరగతి పరిశ్రమ నిర్వహాకులు తెలిపారు.

గతేడాదే తీవ్రంగా నష్టపోయాం

గతేడాది ఒక వైపు షాపు నడవకగా అద్దెలు.. మరోవైపు కరెంటు బిల్లు కట్టలేక తీవ్ర ఇబ్బంది పడ్డాం. ఎక్కువ చెల్లించిన బిల్లు ఇప్పటి వరకు రాలేదు. ఇప్పుడు మేమే తీసుకొని కట్టాలంటే మళ్లీ ఇబ్బందే. అసలే కరోనాతో గిరాకీలేదు. ప్రభుత్వం కరెంటు సబ్సిడీ ఇచ్చి ఆదుకోవాలి.

-జె. శ్రీనివాస్, లక్ష్మీసాయి ఇంజనీరింగ్ వర్స్క్, శోభనాకాలనీ, ఫతేనగర్

ఏఓ కార్యాలయం చుట్టూ తిరిగా..

గతేడాది లాక్ డౌన్ నేపథ్యంలో విద్యుత్‌శాఖ అధికారుల సూచన మేరకు విద్యుత్ బిల్లు చెల్లించా. అదనంగా రూ.6వేలకు పైగా చెల్లించాను. నాతో పాటు చాలా మంది అలాగే చెల్లించారు. డబ్బులు తిరిగి వచ్చే బిల్లలు యాడ్అవుతాయని అధికారులు చెప్పినా కాలేదు. దీంతో ఏఓ, పీఓ ఆఫీసుకు పోయి అడిగితే ఇస్తాం.. జమ అవుతాయని చెప్పారు.. పలుమార్లు తిరిగినా జమకాలేదు…దీంతో కంపెనీపై దృష్టిసారించకపోవడంతో నష్టం వస్తుందని భావించి ఆ డబ్బులను వదిలివేశాం.

-వెంకటక‌ృష్ణ, శ్రీదేవి ఇండస్ట్రీస్

మీటర్ రీడింగ్ ఎలా చూడాలో తెలియదు..

ఇంట్లోని మీటర్కు రీడింగ్ ఎలా చూడాలో తెలియదు. ఎప్పుడైనా విద్యుత్‌శాఖ అధికారులే వచ్చి తీసేది. గతేడాది మార్చి లో వచ్చిన బిల్లు కట్టమంటే కట్టా. ఇప్పడు వినియోగదారులే చూసి చెల్లించాలని అధికారులు అంటున్నారు. ఏం చేయాలో అర్ధం కావడం లేదు.

-గిరిగాని క్రాంతికుమార్, ఆదర్శనగర్, ఎల్బీనగర్



Next Story

Most Viewed