ప్రభుత్వ పనులు ఆగిపోయాయి.. కారణమేమంటే..?

by  |
ప్రభుత్వ పనులు ఆగిపోయాయి.. కారణమేమంటే..?
X

దిశ‌, ఖ‌మ్మం: లాక్‌డౌన్ అమ‌లుతో ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో నిర్మాణ రంగం కుదేలైంది. గడిచిన రెండు నెలల కాలంలో భ‌వ‌న నిర్మాణాలు దాదాపు నిలిచిపోయాయి. ప్ర‌భుత్వ అభివృద్ధి ప‌నుల్లో భాగంగా నిర్మిస్తున్న రోడ్లు, భ‌వ‌నాలు, వంతెనల నిర్మాణంలో కూడా ఆగిపోతున్నాయి. ప‌నులు నిర్వ‌హిస్తున్న కాంట్రాక్ట‌ర్ల‌కు కూలీల‌ను స‌మ‌కూర్చుకోవ‌డం త‌ల‌కు మించిన భారంగా మారింది. ఒక్కో కూలికి రూ.500 ఇస్తామన్నా ప‌నికి రావ‌డం లేద‌ని కాంట్రాక్ట‌ర్లు చెబుతున్నారు. వాస్త‌వానికి ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో 50 వేల మందికి పైగా వ‌ల‌స కూలీలు, కార్మికులు ఉన్నారు. ఛత్తీస్‌గ‌ఢ్, బీహార్‌, రాజ‌స్థాన్‌, జార్ఖండ్‌, మ‌హారాష్ట్ర‌, ఒడిషా, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన కూలీలు ఉండేవారు. ఇందులో ఎక్కువ మంది వ్య‌వ‌సాయం, పారిశ్రామిక రంగంలోని, గ్రానైట్‌, మిల్లులు, త‌యారీ రంగాల్లో ప‌నిచేస్తుంటారు. ఆ త‌ర్వాత వేలాదిమంది వ‌ల‌స కార్మికులు నిర్మాణ రంగంలో ప‌నిచేస్తూ ఉండేవారు.

పారిశ్రామికంగా ప్ర‌గ‌తిప‌థంలో దూసుకెళ్తున్న ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా నిర్మాణ రంగం నిత్యం క‌ళ‌క‌ళ‌లాడుతూ ఉంటుంది. ఈ రంగంలో ప‌నిచేసే కార్మికులు ఇక్క‌డ బాగా డిమాండ్ ఉంటుంది. ఇక నైపుణ్య క‌లిగిన‌ కార్మికులకు జీతాలు 25 నుంచి 30వేల వ‌ర‌కు పొందుతుండ‌టం గ‌మ‌నార్హం. ప్ర‌భుత్వం నిర్మిస్తున్న‌ దుమ్ముగూడెం, సీతారామ ప్రాజెక్టులు, బీటీపీఎస్‌ (భ‌ద్రాచ‌లం థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ స్టేష‌న్‌), కేటీపీఎస్ నిర్మాణాల్లోనూ వ‌ల‌స కూలీలే ఎక్కువ‌గా ప‌ని చేస్తుండ‌టం విశేషం. అయితే దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కారణంగా వ‌ల‌స కార్మికులు జిల్లా నుంచి క్ర‌మంగా స్వ‌స్థ‌లాల‌కు వెళ్లిపోయారు. దీంతో జిల్లాలో నిర్మాణ రంగం అవ‌స్థ‌లు ప‌డుతోంది.

ప్ర‌భుత్వం త‌ల‌పెట్టిన రోడ్లు, వంత‌న‌లు, డ్రైనేజీ, అండ‌ర్ డ్రైనేజీ నిర్మాణాల ప‌రిస్థితి ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. గ‌తంలో కంటే అధికంగా కూలీ చెల్లిస్తామ‌ని చెప్పినా కూలీలు రావ‌డం లేద‌ని కాంట్రాక్ట‌ర్లు వాపోతున్నారు. నిర్మాణ ప‌నుల్లో ప‌ని చేసేందుకు కూలీలు ముందుకు రాక‌పోవ‌డానికి ఎండాకాలం కావ‌డం కూడా ఒక కార‌ణ‌మ‌ని చెబుతున్నారు. వ‌ల‌స కార్మికులు స్వ‌స్థ‌లాల‌కు వెళ్లిపోవ‌డంతో పెద్ద నిర్మాణ సంస్థ‌ల‌కే ఎక్కువ‌గా న‌ష్టం వాటిల్లుతోంది. వ‌ల‌స కార్మికులు కొర‌త‌ను ఎలా భ‌ర్తీ చేసుకోవాలో అర్థం కాక కాంట్రాక్ట‌ర్లు త‌ల‌లు పట్టుకుంటున్నారు. ఇక చిన్న‌చిన్న కాంట్రాక్టులు నిర్వ‌హిస్తున్న వారైతే తాము ఈ ప‌నులు చేయ‌లేమ‌ని చేతులేత్తుస్తుండ‌టం గ‌మ‌నార్హం.



Next Story

Most Viewed