ఆకలి బాధ తెలిసిన ట్రాఫిక్ పోలీస్..

by  |
ఆకలి బాధ తెలిసిన ట్రాఫిక్ పోలీస్..
X

దిశ, వెబ్‌డెస్క్: దేవుడెక్కడో లేడు.. వేరే కొత్తగా రాడు.. మంచి మనుషులలో గొప్ప మనసు తానై ఉంటాడు అని ఓ సినీ కవి.. మనిషిలోనే దేవుడు ఉంటాడని ఎంతో అద్భుతంగా చెప్పాడు. ఈ పదాలకు నిలువెత్తు నిదర్శనంగా కనిపించాడు ఓ ట్రాఫిక్ పోలీస్. ఎప్పుడూ పోలీసులంటే డబ్బులు తీసుకొంటారు.. అమాయక ప్రజలను టార్చర్ పెడుతుంటారు అంటూ వారి గురించి ఎన్నో మాటలు వింటూనే ఉంటాం.. కానీ వారి వలనే దేశంలోని ప్రజలు ధైర్యంగా నిద్రపోతున్నారు. ఇక కరోనా కష్టసమయంలో పోలీసులు చేస్తోన్న సేవకు ఎన్నిసార్లు సెల్యూట్ చేసినా తక్కువే.. ఇంట్లో భార్యాపిల్లలను వదిలేసి.. కరోనాపై పోరాడుతూ వారి వృత్తికి న్యాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే లాక్‌డౌన్‌ సమయంలో రోడ్డుపై ఆకలితో అలమటిస్తున్న అభాగ్యుల ఆకలి తీరుస్తూ శభాష్‌ అనిపించుకుంటున్నాడు ఓ ట్రాఫిక్ పోలీస్…

పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మహేశ్‌ లాక్ డౌన్ సమయంలో సోమాజిగూడలోని వీధుల్లో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే రోడ్డుపై ఇద్దరు చిన్నారులు ఆకలితో అలమటిస్తూ, బిక్కుబిక్కుమంటూ ఏడుస్తూ కనిపించారు. లాక్ డౌన్ కి ముందు రోడ్డుపై ఎవరో ఒకరు వారికి పొట్టనింపుకోవడానికి డబ్బులు దానం చేసేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు.. దీంతో ఆ చిన్నారులు ఆకలితో అలమటిస్తున్నారు. వారిని ఆ స్థితిలో చూసిన మహేశ్ మనసు చలించిపోయింది. ఇక వారి దీన పరిస్థితికి స్పందించిన మహేశ్ వెంటనే తన వెంట తెచ్చుకున్న భోజనం క్యారియర్ ని తీసి వారిద్దరికి దగ్గరుండి మరి వడ్డించాడు. అన్నం తిని ఎన్ని రోజులవుతుందో.. పాపం ఆ చిన్నారులు ఆవురావురమంటూ తినేశారు. కడుపునిండాక వారి కళ్లలోని ఆనందం, మహేశ్ ని ఆ చిన్నారులు చూసిన చూపులు వర్ణనాతీతం. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. నిజంగా దేవుడు స్వామీ .. నువ్వు .. హ్యాట్సాఫ్ అంటూ ట్రాఫిక్ పోలీస్ మహేశ్ ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Next Story

Most Viewed