‘ఓయూ భూముల జోలికొస్తే ఊరుకునేది లేదు’

by  |
‘ఓయూ భూముల జోలికొస్తే ఊరుకునేది లేదు’
X

దిశ, నిజామాబాద్: వందేండ్ల చరిత్ర గల ఉస్మానియా విశ్వవిద్యాలయ భూములను ఆక్రమించాలని చూస్తే ఊరుకునేది లేదని ఎన్‌ఎస్‌యూఐ నాయకులు హెచ్చరించారు. సోమవారం వరంగల్ నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదురుగా ఓయూ భూములను కబ్జా చేసిన విశ్రాంత న్యాయమూర్తి నరసింహరెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం సంఘం జిల్లా అధ్యక్షులు వేణురాజ్ మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పాత్ర మరువలేనిదని, అనేక ప్రజా ఉద్యమాలకు కేంద్రమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం భూములు కబ్జాకు గురవుతుంటే ప్రభుత్వం కనీసం స్పందించకుండా, భూములను పరిశీలించడానికి వెళ్లిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకోవడం అమానుషం అన్నారు. ఈ భూ కబ్జా అంశంపై వివిధ విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు పలుమార్లు పోలీసులకు, ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని విమర్శించారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించి ఉస్మానియా విశ్వవిద్యాలయ భూములను పరిరక్షించేందుకు చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో తెలంగాణ విద్యార్థి లోకం ఏకమై టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపుతాం అని ఆయన హెచ్చరించారు.



Next Story

Most Viewed