డిండి భూ నిర్వాసితులకు నష్టపరిహారం కోసం కాంగ్రెస్ పాదయాత్ర.. 

by  |
డిండి భూ నిర్వాసితులకు నష్టపరిహారం కోసం కాంగ్రెస్ పాదయాత్ర.. 
X

దిశ, కల్వకుర్తి: డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన వేలాది మంది రైతులకు ప్రభుత్వం చెల్లించే నష్టపరిహారం అందడం లేదని నాగర్ కర్నూలు జిల్లా డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కాలువ కొరకై భూములు కోల్పోయిన రైతుల కొరకు గురువారం డిండి చింతపల్లి నుంచి వంగూరు మండలం వరకు 12 కిలోమీటర్ల పాదయాత్రను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌కు నిజంగా పేద ప్రజలపై ప్రేమ ఉంటే తక్షణమే స్పందించి మార్కెట్ ధరలకు అనుగుణంగా భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. వ్యవసాయ భూమిని కోల్పోయి, మానసిక క్షోభకు గురై చనిపోతున్నా.. ప్రభుత్వం పట్టించుకోక పోవడం హేయమైన చర్య అన్నారు.

భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందే వరకు తమ పోరాటం కొనసాగిస్తామన్నారు. ఐదు సంవత్సరాలు గడిచిన ఇంకా నష్టపరిహారం పై జాప్యం మెందుకని మండిపడ్డారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ప్రకటించిన 6 నెలల్లోపు ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. నేటి వరకు పూర్తి స్థాయిలో ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్న ఈ తరుణంలో రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం, అధికారులు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరించడం సరికాదన్నారు. రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించని యెడల ఆమరణ నిరాహార దీక్ష చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వంగూర్ జడ్పీటీసీ కెవిఎన్ రెడ్డి, కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాయితి విజయ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Next Story

Most Viewed