తెలంగాణ కాంగ్రెస్‌లో విషాదం.. రవీందర్ రెడ్డి మృతి

by  |
తెలంగాణ కాంగ్రెస్‌లో విషాదం.. రవీందర్ రెడ్డి మృతి
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో తన ఇంటి వద్ద ఓ వ్యక్తి దాడి చేసిన సంఘటనలో తీవ్రంగా గాయపడిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు, నారాయణపేట జిల్లా కాంగ్రెస్ నేత అయిన రవీందర్ రెడ్డి(48) గురువారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. కోయిలకొండ మండలం సంగ నోనీపల్లి గ్రామానికి చెందిన రవీందర్ రెడ్డి మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల పాత్ర పోషిస్తూ వచ్చారు. దివంగత కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి అనుచరుడుగా ముద్ర పడిన రవీందర్ రెడ్డి మొదట్లో గ్రామ సర్పంచ్ గా ఎంపికయ్యాడు. అనంతరం 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైయస్ జగన్‌తో ఉన్న అనుబంధంతో ఉమ్మడి పాలమూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ఎంపికయ్యాడు. 2007 నవంబర్ నుండి 2010 నవంబర్ వరకు మూడు సంవత్సరాల పాటు ఆయన గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా పనిచేశాడు.

వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జగన్ స్థాపించిన వైయస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. సంవత్సరన్నర కాలంపాటు ఆ పార్టీలో కొనసాగిన రవీందర్ రెడ్డి పరిస్థితులు అనుకూలించకపోవడంతో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలని పలుమార్లు ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. వచ్చే ఎన్నికలలో ఎలాగైనా పోటీ చేయాలనే ఉద్దేశంతో ఉన్న రవీందర్ రెడ్డి హైదరాబాద్‌లో ఉండి రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో రాణిస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే అనేక భూములు, వ్యాపార లావాదేవీలకు సంబంధించి పలువురితో విభేదాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే తన సమీప బంధువైన మోహన్ రెడ్డి అనే వ్యక్తి‌తో లావాదేవీల విషయంలో ఏర్పడ గొడవలు రవీందర్ రెడ్డి ప్రాణాలకు ముప్పు తెచ్చాయి. బుధవారం ఉదయం వేట కొడవలితో రవీందర్ రెడ్డి ఇంటికి వచ్చిన మోహన్ రెడ్డి అనే వ్యక్తి కారులో ఉన్న తన ఫోను తీసుకుంటుండగా నరికివేసిన సంఘటనలో రవీందర్ రెడ్డి తీవ్రంగా గాయపడిన విషయం పాఠకులకు విదితమే.. హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు ధ్రువీకరించాయి. రవీందర్ రెడ్డి మరణించాడని తెలిసిన వెంటనే ఆయన అనుచర వర్గం హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. కాగా రవీందర్ రెడ్డి‌కి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. అంత్యక్రియలు గురువారం మధ్యాహ్నం తర్వాత అతని స్వగ్రామం సంగ‌నోనీ పల్లి‌లో జరగనున్నాయి.



Next Story

Most Viewed