సోనియా గాంధీకి ఘాటు లేఖ

by  |
సోనియా గాంధీకి ఘాటు లేఖ
X

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ దిగ్గజ నాయకులు పార్టీలో సంస్కరణలకు గళాలెత్తారు. టాప్ టు బాటమ్ సమూల మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. పార్టీకి ఫుల్ టైమ్ లీడ‌ర్‌షిప్‌ కావాలని, యాక్టివ్‌గా, ఎప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడుండాలని సూచించారు. పార్టీ అంతర్గత ఎన్నికలు పారదర్శకంగా, ప్రజాస్వామికంగా జరగాలని, పార్టీ రాజ్యాంగం ప్రకారమే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సభ్యుల ఎన్నిక ఉండాలని… 23 మంది నేతలు ప్రస్తుత అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఘాటు లేఖ రాశారు. పార్టీ పునరుజ్జీవనానికి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలిస్తూ మార్గనిర్దేశనం వహించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని, బీజేపీని ఎదుర్కోవడానికి భావసారూప్యం గల పార్టీలతో దేశవ్యాప్తంగా కూటములు ఏర్పాటుచేసుకోవాలని పేర్కొన్నారు.

ఆరేళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ అంతకంతకూ దిగజారిపోతున్నది. యువత పార్టీ నుంచి దూరమవుతున్నారు. సరైన గైడెన్స్ లేక పార్టీవర్గాలు నిరుత్సాహంలో మునిగిపోయాయని ఐదుగురు మాజీ సీఎంలు, సీడబ్ల్యూసీ సభ్యులు, సిట్టింగ్ ఎంపీలు, మాజీ కేంద్ర మంత్రులు సోనియా గాంధీకి సంస్కరణలే ఎజెండాగా లేఖ రాశారు. 15 రోజుల కింద రాసిన ఈ లేఖలో దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టారు. బీజేపీ ఎదుగుదలను గుర్తిస్తూ కాంగ్రెస్ కొంతకాలంగా క్రమంగా క్షీణిస్తూనే ఉన్నదని పేర్కొన్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో పరాజయం పాలైనప్పటి నుంచి నిజాయితీగా ఆత్మవిమర్శన చేసుకోలేదని పేర్కొన్నారు. పార్టీ మళ్లీ విజయపథంలో నడపడాలనికి, ప్రజల విశ్వాసాన్ని చూరగొనడానికి సంస్కరణలు కీలకమని అభిప్రాయపడ్డారు. అధికార వికేంద్రీకరణ, రాష్ట్ర యూనిట్లకు సాధికారత, బ్లాక్ స్థాయి నుంచి సీడబ్ల్యూసీ వరకు పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ, సెంట్రల్ పార్లమెంటరీ బోర్డు ఏర్పాటు ముఖ్యమని సూచించారు. ఫుల్‌టైమ్ నాయకత్వలేమితో పార్టీలో నైతికస్థైర్యం సడలుతోందని, పార్టీనీ బలహీనపరుస్తోందని తెలిపారు.

బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని మలచడంలో సీడబ్ల్యూసీ ప్రతిభావంతంగా లేదని అభిప్రాయపడ్డారు. తూతూమంత్రంగా సీడబ్ల్యూసీ భేటీలు సాగుతున్నాయని, పార్టీలకు సరైన మార్గనిర్దేశనం చేయలేకపోతున్నదని పేర్కొన్నారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపై కలెక్టివ్‌గా సమాలోచనలు జరపడానికి సెంట్రల్ పార్లమెంటరీ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సోనియా గాంధీ అందించిన నాయకత్వాన్ని, పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయాలను ప్రశంసించారు. ఫుల్‌టైం లీడ‌ర్‌షిప్‌‌కు డిమాండ్ చేసిన దిగ్గజ నేతలు.. పార్టీ కలెక్టివ్ లీడ‌ర్‌షిప్‌‌లో నెహ్రూ గాంధీ కుటుంబీకులు ఎప్పటికీ అంతర్భాగంగా కొనసాగుతారని పేర్కొనడం గమనార్హం.

లేఖపై సంతకం పెట్టిన నేతలు

రాజ్యసభ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, ఎంపీలు, మాజీ మంత్రులు ఆనంద్ శర్మ, కపిల్ సిబాల్, మనీష్ తివారీ, శశి థరూర్, ఎంపీ వివేక్ టంకా, ఏఐసీసీ ఆఫీస్ బేరర్‌లు, సీడబ్ల్యూసీ సభ్యులు ముకుల్ వాస్నిక్, జితిన్ ప్రసాదా, మాజీ సీఎంలు, కేంద్ర మాజీ మంత్రులు భూపిందర్ సింగ్ హుడా, రాజేందర్ కౌల్ భట్టాల్, ఎం వీరప్పమొయిలీ, పృథ్వీరాజ్ చౌహాన్, పీకే కురియన్, అజయ్ సింగ్, రేణుకా చౌదరి, మిలిండ్ డియోరా, పీసీసీ మాజీ చీఫ్‌లు రాజ్ బబ్బార్(యూపీ), అరవిందర్ సింగ్ లవ్లీ(ఢిల్లీ), కౌల్ సింగ్ ఠాకూర్(హిమాచల్), ప్రస్తుత బిహార్ క్యాంపెయిన్ చీఫ్ అఖిలేష్ ప్రసాద్ సింగ్, హర్యానా మాజీ స్పీకర్ కుల్దీప్ శర్మ, ఢిల్లీ మాజీ స్పీకర్ యోగానంద్ శాస్త్రి, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్‌లు ఉన్నారు.



Next Story

Most Viewed