రాములో.. రాములా.. నీకు హ్యాండ్ ఇచ్చారా..!

242

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : న‌ల్గొండ‌, వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ వెనుక‌బ‌డిన‌ట్లు క‌నిపిస్తోంది. రాములునాయ‌క్‌ను అభ్యర్థిగా ప్రకటించడంలోనే ఆల‌స్యం చేసిన ఆ పార్టీ అధిష్టానం ఆ త‌ర్వాత ప్రచారంలోనూ అంతే స్లోగా ముందుకు వెళ్తోంది. రాములునాయక్ ప‌రిచ‌య కార్యక్రమం పేరిట టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి వ‌రంగ‌ల్‌లో మూడు నాలుగు రోజులు రాజ‌కీయ సంద‌డి చేశారు.

ఆ త‌ర్వాత నుంచి కాంగ్రెస్ క్యాంపెయిన్‌లో అంతగా జోష్ క‌నిపించ‌డం లేదు. కార్యకర్తలు కూడా చప్పగా ముందుకు సాగుతున్నారు. బాగా ఊద‌ర‌గొట్టిన.. బెద‌ర‌గొట్టిన వ్యాఖ్యలు కూడా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. మిగతా పార్టీల కంటే భిన్నమైన రాజ‌కీయ విధానాన్ని అనుస‌రిస్తున్నారు. మూడు నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో సాగిన ప్రచార కార్యక్రమాలకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ హాజ‌రైన ఆ త‌ర్వాత త‌న బిజిలో తాను ప‌డిపోయారు. ఇప్పుడు రాములునాయ‌క్ త‌న వెంట రాష్ట్ర స్థాయి నేత‌లు లేకుండానే ఒంట‌రిగా ముందుకు సాగుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

క‌ల‌వ‌ని స‌మీక‌ర‌ణాలు..

రాములునాయ‌క్ ప్రచారానికి ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య స‌మీక‌ర‌ణాలు కుద‌ర‌క త‌మ ప్రాంతాల‌కే కొంత‌మంది ప‌రిమిత‌మ‌వుతుండ‌గా… మ‌రికొంత‌మంది నేత‌లు.. త‌మ ప్రాంతంలో ప్రచారం నిర్వహిస్తున్నా.. పట్టనట్లుగా ఉంటున్నార‌న్న చ‌ర్చ జరుగుతోంది. ములుగు నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన ప్రచార కార్యక్రమానికి ఉత్తమ్ గైర్హాజ‌ర‌వ‌డాన్ని గుర్తు చేస్తున్నారు. సీత‌క్క.. రేవంత్ వ‌ర్గం కనుక.. ఉత్తమ్ కుమార్ రెడ్డి ములుగులో రాములుతో క‌ల‌సి ప్రచారానికి రాలేద‌ని గుర్తు చేస్తున్నారు. జిల్లా స్థాయి నేత‌లు కూడా ఏదో ప్రచారంలో పాల్గొన్నామా.. అనే విధంగా ముందుకు సాగుతుండటం విశేషం.

పోరాటానికి ముందే చేతులెత్తేస్తున్నారా..?

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పెద్దగా లాభం చేకూర‌ద‌ని కాంగ్రెస్ శ్రేణులే బ‌లంగా విశ్వసిస్తున్నారన్న అభిప్రాయం రాజ‌కీయ వ‌ర్గాల్లో వ్యక్తమవుతోంది. ఆ అభిప్రాయంతోనే నామమాత్రపు పోటీగా బ‌రిలో కొన‌సాగుతోంద‌న్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇందుకు ప్రచారంలో కనిపించకపోవడమే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..