జేసీ దివాకర్‌ రెడ్డికి దమ్ముంటే నిరూపించుకోవాలి: వీహెచ్

by  |
జేసీ దివాకర్‌ రెడ్డికి దమ్ముంటే నిరూపించుకోవాలి: వీహెచ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : జేసీ వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన కేసీఆర్ కోవర్ట్ అని అర్థమవుతున్నదని, కాంగ్రెస్ అధినేత్రి సోనియా, రాహుల్‌పై జేసీ అనుచిత వ్యాఖ్యలు చేయడం హేయమైన చర్య అని మాజీ రాజ్యసభ సభ్యడు వి.హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్‌పై ఏపీ టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. బుధవారం వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ ‘తెలంగాణ ఇచ్చి సోనియా గాంధీ పెద్ద తప్పు చేసింది. ఇక కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లింది’ అని జేసీ అనడం హాస్యాస్పదంగా ఉందని, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెప్పారు. సాగర్‌ ఉప ఎన్నికల్లో జానారెడ్డి ఓడిపోతాడని చెప్పడానికి జేసీ ఎవరని, వెంటనే జేసీ జ్యోతిష్యాలు చెప్పడం మానుకోవాలని, లేకపోతే ఆయనపై కార్యకర్తలు తిరగబడడం ఖాయమని హెచ్చరించారు.

జేసీ దమ్మున్న లీడర్ అయితే అనంతపూర్‌లో లేదంటే రాయలసీమలో తన బలాన్ని నిరూపించుకోవాలి కానీ, తెలంగాణలో కాదన్నారు. సీఎల్పీలో కూర్చుని కాంగ్రెస్ అధినేత్రి సోనియా, రాహుల్‌పై జేసీ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సీఎల్పీ నేత భట్టి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి‌పై అధిష్ఠానానికి ఫిర్యాదు చేశాయి. సోనియా, రాహుల్‌ను జేసీ తిట్టినా వారు ఎందుకు అడ్డుకోలేదో స్పష్టం చేయాలని పలువురు పార్టీ నేతలు డిమాండ్ చేశారు. జానారెడ్డి ఓడిపోతాడని జేసీ చెప్పినా కనీసం స్పందించరా అని వారు ప్రశ్నించారు.



Next Story