బాండ్ పేపర్ రాసిచ్చి కూడా మాటమీద నిలబడలేదు : కృష్ణారావు

by  |
congress
X

దిశ, కోరుట్ల: వరిధాన్యం కొనుగోలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడు దొంగలై రైతులను మోసం చేస్తున్నారని పీసీసీ రాష్ట్ర నాయకులు జవ్వాడి కృష్ణారావు మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడం, స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేంద్రాన్ని విమర్శించడం ద్వారా రైతులు మోస పోతున్నారని అన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అర్వింద్ రైతులకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని విమర్శించారు. తనను ఎంపీగా గెలిపిస్తే, కేవలం ఐదు రోజుల్లోనే పసుపు బోర్డు తీసుకొస్తానని బాండ్ పేపర్ రాసిచ్చాడని, కానీ నేటికీ తీసుకురాలేదని ఎద్దేవా చేశారు.

నిజామాబాద్‌లో మూతపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ నడిపిస్తామని, ఒకవేళ ప్రభుత్వం నడపలేమంటే తాను సొంత నిధులతో నడిపిస్తానని హామీ ఇచ్చి ఎందుకు విస్మరిస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ గత 60 ఏళ్ల కాలంలో ఏ రోజుకూడా రైతులకు ధాన్యంతో పాటు ఇతర పంటల కొనుగోలు విషయంలో రాజకీయం చేయలేదని అన్నారు. దేశంలోని కాంగ్రెస్ పాలిత రాష్టాల్లో మాదిరిగా రైతులు పండించిన అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులకు బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed