ఈటల ‘బీసీ’ మంత్రి అందుకే ఈ కక్ష.. కేసీఆర్‌పై కాంగ్రెస్, బీజేపీ ఫైర్

by  |
Congress, BJP, Minister Etela Rajender
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణా ఆరోగ్యశాఖామంత్రి ఈటల రాజేందర్ భారీ భూ ఆక్రమణలకు పాల్పడ్డారని ఆరోపణలు వస్తున్నాయి. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచంపేట్ అలాగే, హకీంపేట్ గ్రామాలకు చెందిన కొందరు బలహీన వర్గాల ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్‌‌కు ఒక లేఖ రాశారు. కొన్ని రోజులుగా ఈటల రాజేందర్ తమను బెదిరిస్తున్నారని చెప్పారు. దీంతో ఈటల రాజేందర్ వ్యవహారంపై కాంగ్రెస్, బీజేపీ నేతలు స్పందించారు. రాష్ట్రంలో అవినీతి ఆరోపణలు వచ్చిన మంత్రులు, ఎమ్మె్ల్యేలపైనా విచారణ జరుపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. అవినీతి ఆరోపణలపై చర్యలు తీసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ నిజాయితీ నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. ఈటల వ్యవహారంపై సిట్టింగ్ జడ్జిచే విచారణ జరుపాలని తెలిపారు.

ఈటల రాజేందర్ బీసీ నాయకుడు కాబట్టి, ఆయన పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కక్షగట్టారని కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు ఆరోపించారు. టీఆర్ఎస్‌లో ఎంతోమంది నేతలు భూ కబ్జాలకు పాల్పడ్డారని గుర్తుచేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులందరిపై ప్రభుత్వం విచారణ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ స్పందిస్తూ.. ఈటల రాజేందర్ భూ కబ్జాలకు పాల్పడితే శిక్షార్హుడే అన్నారు. ఇప్పటికే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు మల్లారెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్‌ కుమార్‌లపై ఎందుకు చర్యలు తీసుకోలేదని శ్రవణ్ ప్రశ్నించారు. ఈటల బీసీ నేత కాబట్టే చర్యలు తీసుకుంటున్నాయని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆస్తులపైనా విచారణ జరుపాలని బీజేపీ మహిళా నేత విజయశాంతి డిమాండ్ చేశారు.

Next Story