కేరళలో సడలింపులపై గందరగోళం..!

by  |
కేరళలో సడలింపులపై గందరగోళం..!
X

తిరువనంతపురం: లాక్‌డౌన్ సడలింపులు, కొత్త హాట్‌స్పాట్‌ల విషయమై కేరళలో సోమవారం గందరగోళం ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల్లో క్లారిటీ మిస్ అవడంతో.. ప్రజలు రెడ్ ‌జోన్‌లలోకీ ప్రయాణం కట్టారు. వారిని తిరిగి పంపించడానికి పోలీసు సిబ్బంది తంటాలు పడాల్సి వచ్చింది. చివరికి కేంద్ర హోం శాఖ ఆగ్రహిస్తూ లేఖ రాసేవరకు పరిస్థితులు వెళ్లాయి. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 20వ తేదీ నుంచి లాక్‌డౌన్ నిబంధనలు సడలించిన విషయం తెలిసిందే. కానీ, ఆ మినహాయింపుల అమలు ఆయా రాష్ట్రాల అభీష్టానికే లోబడి ఉన్నాయి. కేసుల ఎక్కువగా నమోదవుతున్నాయని మినహాయింపులను పూర్తిగా అమలు చేయకపోవడం లేదా మరిన్ని కఠిన నిబంధనలూ అమలు చేసే స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నది. ఈ నేపథ్యంలో కేరళలో లాక్‌డౌన్ నిబంధనల సడలింపులు, కొత్త హాట్‌స్పాట్‌ల పరిధుల్లో మార్పులు.. వాటి ప్రకటనలలో స్పష్టత లోపించడంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది.

కేరళ ప్రభుత్వం.. రాష్ట్రంలోని 14 జిల్లాలను కరోనా కేసుల సంఖ్యను బట్టి నాలుగు విభాగాలు.. రెడ్, ఆరెంజ్ ఏ, ఆరెంజ్ బీ, గ్రీన్ జోన్‌లుగా గతవారం ప్రకటించింది. ఉత్తర జిల్లాలు కాసర్‌గోడ్, కన్నూర్, మలప్పురం, కోజికోడ్‌లను రెడ్ జోన్‌లుగా గుర్తించింది. ఈ జిల్లాల్లో మే 3వ తేదీ వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమలవుతుంది. అలాగే, ఆరెంజ్ ఏ కేటగిరీలోని జిల్లాల్లో ఈ నెల 24 నుంచి మినహాయింపులు అమల్లోకి రానుండగా, ఆరెంజ్ బీ కేటగిరీ జిల్లాల్లో ఈ రోజు(సోమవారం) నుంచి సడలింపులు అమలయ్యాయి. కాగా, కొట్టాయం, ఇదుక్కిలాంటి జిల్లాలు గ్రీన్ జోన్‌లో ఉన్నాయి. వీటిలో మరిన్ని మినహాయింపులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ కన్ఫ్యూజన్ ఇలా ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం ఆదివారంనాటి ప్రకటన దీనికి అదనంగా మరింత గందరగోళాన్ని చేర్చింది. జిల్లాల్లోని కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీలు, పంచాయత్‌లుగా విభజించి 88 కొత్త హాట్‌స్పాట్‌లను ప్రకటించింది. ఉదాహరణకు తిరువనంతపురం జిల్లా ఆరెంజ్‌ బీ కేటగిరీలో ఉండగా.. మినహాయింపులు సోమవారం నుంచి అమల్లోకి రావాలి. అయితే, ఇక్కడ తిరువనంతపురం జిల్లాలో ఈ మినహాయింపులున్నాయి గానీ, తిరువనంతపురం కార్పొరేషన్, వర్కాలా మున్సిపాలిటీ, మలయంకీజ్ పంచాయత్‌లలో సడలింపుల్లేవు. ఇదే తీరులో ఇదుక్కిలో కరోనా కేసులు లేవు. కానీ, ఆ జిల్లా పరిధిలోని ఐదు పంచాయత్‌లు, ఒక మున్సిపాలిటీని రెడ్ జోన్‌గా ప్రభుత్వం ప్రకటించింది. తిరువనంతపురం జిల్లాలో మినహాయింపులనగానే.. ప్రజలు సోమవారం గ్రామీణ ప్రాంతాల నుంచి ఆ జిల్లాకు బయల్దేరారు. కానీ, తిరువనంతపురం కార్పొరేషన్‌లో కఠిన లాక్‌డౌన్ అమల్లో ఉంది. దీంతో ప్రజలను వెనక్కి పంపలేక పోలీసు సిబ్బంది నానా తంటాలు పడ్డారు. తిరువనంతపురం సహా రాష్ట్రంలోని పలు చోట్లా సోమవారం ఈ పరిస్థితులే తలెత్తాయి.

కాగా, లాక్‌డౌన్‌ నిబంధనలు అమలు చేయడంలేదని కేంద్ర హోం శాఖ.. రాష్ట్ర ప్రభుత్వానికి సీరియస్‌గా ఒక లేఖ రాసింది. దీంతో సీఎం పినరయి విజయన్ ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్ణయించి పలు సవరింపులు చేశారు. కొట్టాయం, ఇదుక్కి లాంటి గ్రీన్ జోన్ జిల్లాల్లో రెస్టారెంట్‌లకు ఇచ్చిన అనుమతులను రద్దు చేసి కేవలం డెలివరీల వరకే అవకాశమిచ్చింది. టూ వీలర్‌పై ఇద్దరికి అనుమతుల్లేవు. అయితే, సామాజిక దూరాన్ని పాటించే అన్ని నిబంధనలను అన్ని జోన్‌‌లలో కఠినంగా అమలు చేస్తున్నది.

Tags: kerala, lockdown, confusion, relaxation, red zone, free, centre, pinarayi vijayan



Next Story

Most Viewed