రేవంత్​రెడ్డి పాదయాత్ర.. ‘హస్తం’లో అయోమయం

by  |
Congress party, Rewanth Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్​ పార్టీలో విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. టీపీసీసీ చీఫ్​ అంశం తేలకపోవడంతో కొద్ది రోజులు అందరూ నిశబ్ధంగా ఉన్నారు. పాదయాత్రలతో తిరిగి లొల్లి మొదలైంది. నేతలు ఎవరికి వారుగానే ఉంటున్నారు. టీపీసీసీకి పూర్తిస్థాయి అధ్యక్షుడు లేకపోవడం, రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్కం ఠాగూర్​ కూడా పట్టించుకోకపోవడంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఎంపీ రేవంత్​రెడ్డి పాదయాత్ర నేతల మధ్య చిచ్చు పెట్టింది. వాస్తవంగా రైత భరోసా దీక్ష చేపట్టిన రేవంత్​ అనూహ్యంగా పాదయాత్ర చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీనికి ఎవరి అనుమతి లేదంటూ నేతలు ముందుగా వ్యతిరేకించారు. అయినా పాదయాత్ర సాగింది. మంగళవారం ముగియనుంది, ముగింపు సభను రావిరాలలో నిర్వహిస్తున్నారు. దీనికి పార్టీ నేతలు ఎవరూ వెళ్లవద్దంటూ ఉత్తమ్​ ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఎవరు ఎటు?

ఒకో నేత ఒక్కో వర్గంగా మారిపోయినట్లుగా మారిపోయింది పరిస్థితి. టీపీసీసీ చీఫ్​ అంశంలోనే ఎంపీ రేవంత్​రెడ్డిని సీనియర్లంతా వ్యతిరేకించారు. కొంతమంది కోమటిరెడ్డి వెంకట్​రెడ్డిని వద్దంటే… మరికొందరు మరో నేతను వద్దంటూ అధిష్టానానికి లేఖలు రాశారు. చివరకు జీవన్​రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. సాగర్​ ఉప ఎన్నిక వరకూ ఎంపిక వాయిదా పడింది. ఈ అంశంలో ఏ నేత ఎవరికి సపోర్టు చేస్తున్నారనేది సందేహంగానే మారింది. ఈ క్రమంలోనే నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో రైతు భరోసా దీక్ష చేయాలని రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దీక్షకు కాంగ్రెస్ నేతలతో పాటు కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. దీక్ష ముగించే సమయంలో ఆయన దీనిని పాదయాత్రగా మార్చుకున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆదిలాబాద్ నుంచి రైతు భరోసా యాత్ర చేస్తున్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి కూడా ఈ నెల 20 నుంచి పాదయాత్ర చేయనున్నారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా పాదయాత్రకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా చర్చించుకోకుండా నేరుగా పాదయాత్రకు దిగుతున్న ప్రకటనలు చేస్తున్నారు. ఈ యాత్రల సమాచారం అధిష్టానానికి లేకుండా పోయింది. సీఎం వైఎస్​ రాజశేఖరరెడ్డి మరణానంతరం జగన్​ చేపట్టిన ఓదార్పు యాత్రకు అధిష్టానం అనుమతి ఇవ్వలేదు. చివరకు పార్టీ నుంచే బహిష్కరించింది. ఇలాంటి పరిస్థితులే ఇప్పుడు జరుగుతుండటంతో ఎవరిపైనా వేటు పడుతుందా అని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.

రేవంత్​ సభకు వెళ్దామా వద్దా…

రేవంత్​రెడ్డి పాదయాత్ర ముగింపు సందర్భంగా మంగళవారం రావిరాలలో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. రణభేరికి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త రావాలని, మోదీ, కేసీఆర్ కుమ్మక్కును ఛేదించాలని సోషల్​ మీడియా వేదికగా రేవంత్​ కోరారు. ఈ పాదయాత్రపై రాష్ట్రంలోని సీనియర్​ నేతలతో ఎంపీ ఉత్తమ్​ సోమవారం సమావేశమైనట్లు చెబుతున్నారు. రేవంత్​ పాదయాత్రను నేతలు వ్యతిరేకించారని అంటున్నారు. ముగింపు సభకు వెళ్లొద్దని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రేవంత్ పాదయాత్రకు హైకమాండ్ అనుమతి లేదని, నేతలు వారి వారి నియోజకవర్గాల పరిధిలో మాత్రమే పాదయాత్ర చేసుకోమని అధిష్ఠానం చెప్పిందని, రేవంత్‌రెడ్డి తన పార్లమెంట్ పరిధి కాకుండా… ఇతరుల నియోజకవర్గాల్లో ఎలా పాదయాత్ర చేస్తారని ఇప్పటికే సీనియర్ల ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. పాదయాత్ర ముగింపు సభకు ఠాగూర్​ను రేవంత్​ ఆహ్వానించారని, ఆయన కూడా వచ్చేందుకు అంగీకరించారని తెలుస్తోంది. సీనియర్​ నేతలు మాత్రం రావద్దంటూ ఠాగూర్‌పై ఒత్తిడి తెస్తున్నారని సమాచారం.



Next Story