డబ్బా తీసెయ్.. లేకపోతే కేసు పెడతాం: ఆర్టీసీ అధికారులు

by  |
RTC-Officers12
X

దిశ, శాయంపేట: హన్మకొండ జిల్లా శాయంపేట మండలంలోని ఆర్టీసీ బస్టాండ్ పక్కనే గత 35 సంవత్సరాలుగా అరికిల్ల దేవయ్య చర్మకార వృత్తి చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఆర్టీసీ అధికారులు డబ్బా తొలగించాలని లేకపోతే కేసు పెడతామని బెదిరించడంతో స్థానిక ప్రజలు ఆర్టీసీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఆర్టీసీ అధికారులు చర్మకారుని డబ్బా తొలగిస్తే జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉందని, ఇక్కడ డబ్బా ఉండడం వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేవని ఆర్టీసీ అధికారులకు చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. అయితే ఆర్టీసీ అధికారులు మాత్రం ఓ పత్రిక విలేఖరి ఫోన్ చేసి జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేయడంతో మేము చర్మకారునికి చెందిన డబ్బా తొలగిస్తామని చెప్పినట్లు ఆర్టీసీ కంట్రోలర్ జి.ఆర్ రెడ్డి తెలిపారు. చెప్పులు కుట్టుకొని జీవనం కొనసాగించే వారిపై ఓ పత్రిక విలేఖరి కుట్రపూరిత చర్యలకు పాల్పడడం సరైందికాదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బస్టాండ్ నిర్మించిన నాటినుంచి నేటి వరకు బస్సు వచ్చి ఆగిన దాఖలాలు లేవని, అసలు ఈ మండలానికి బస్సు సర్వీసులు లేవంటూ స్థానికులు ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. జనం సమస్యలపైన వార్తలు రాయాల్సిన విలేకరులు చర్మకారులపై కక్ష కట్టి జీవనోపాధిపై దెబ్బతీసే కుట్రలు చేయడం దారుణమన్నారు. బస్టాండ్ లో ఉన్న షల్టర్ లో టీ కొట్టు ఉండేదని ఓ విలేకరి కారణంగా టెండర్ గడువు ముగియకముందే టీ కొట్టు ఎత్తి వేశాడని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విలేకరి సాకుతో చిన్న చిన్న కొట్టులు ఏర్పాటు చేసుకునేవారిపై కక్షగట్టి కుట్రలు చేయడం మంచిది కాదని హితవు పలికారు. పూర్తిస్థాయిలో వివరాలు తెలుసుకున్న ఆర్టీసీ అధికారులు మాత్రం శాయంపేట మండల కేంద్రానికి బస్సు వస్తుందా… రాదా.. అనే అంశంపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం అక్కడున్నవారిని ఆశ్చర్యానికి గురి చేసింది. శాయంపేట మండల కేంద్రానికి గత మూడేళ్లుగా ఆర్టీసీ బస్సు సర్వీస్ లేకపోవడంతో మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

Next Story

Most Viewed