బ్లాంక్ జీవోలపై చర్యలు తీసుకోండి.. గవర్నర్‌కు టీడీపీ నేతల ఫిర్యాదు

by  |
బ్లాంక్ జీవోలపై చర్యలు తీసుకోండి.. గవర్నర్‌కు టీడీపీ నేతల ఫిర్యాదు
X

దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ నేతలు రాజ్‌భవన్‌లో గవర్నర్ బీబీ హరిచందన్‌తో భేటీ అయ్యారు. ప్రభుత్వం విడుదల చేసే జీవోలను ఆన్‌లైన్‌లో ఉంచరాదన్న జగన్ సర్కార్ నిర్ణయంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. తక్షణమే గవర్నర్ జోక్యం చేసుకుని జీవోలను పబ్లిక్ డొమైన్‌లో ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గవర్నర్ బీబీ హరిచందన్‌కు ఫిర్యాదు చేసిన అనంతరం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, బోండా ఉమాలు మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం జీవోల విడుదల వ్యవహారంలో దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

రాత్రికి రాత్రే జీవోలను విడుదల చేస్తున్నారని…ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో న్యాయ స్థానాలను ఆశ్రయిస్తామని వర్ల రామయ్య హెచ్చరించారు. గతంలో బ్లాంక్ జీవోలను విడుదల చేశారని దీనిపై టీడీపీ పోరాటం చేయడంతో ప్రభుత్వం జీవోలను ఆన్‌లైన్‌లో కాకుండా ఆఫ్‌లైన్‌లో పెట్టాని నిర్ణయించిందని ఆరోపించారు. ఈ నిర్ణయం ప్రజా స్వామ్యానికి విరుద్ధమని బోండా ఉమా విమర్శించారు. జీవోలలో ఎలాంటి తప్పులు లేనప్పుడు పబ్లిక్ డొమైన్‌లో ఉంచేందుకు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. అంటే ప్రభుత్వం ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు భయపడుతుందా అని బోండా ఉమా ప్రశ్నించారు. గవర్నర్‌ను కలిసిన వారిలో బచ్చుల అర్జునుడు కూడా ఉన్నారు.



Next Story

Most Viewed