ఉద్యోగులకు 'పెయిడ్ లీవ్స్' ఇస్తున్న కార్పొరేట్ కంపెనీలు!

by  |
ఉద్యోగులకు పెయిడ్ లీవ్స్ ఇస్తున్న కార్పొరేట్ కంపెనీలు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా భారీగా పెరుగుతున్న కొవిడ్ సెకెండ్ వేవ్ కారణంగా తీవ్రమైన శారీరక, మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న ఉద్యోగులకు పలు వెసులుబాట్లు కల్పించాలని కార్పొరేట్ కంపెనీలు భావిస్తున్నాయి. ఇటీవల పరిణామాల మధ్య ఉద్యోగుల్లో పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు వేతనంతో కూడిన సెలవులు, విశ్రాంతి దినాలను కంపెనీలు అందిస్తున్నాయి. ఈ విధమైన నిర్ణయాలతో హిందూస్తాన్ యూనిలీవర్, డెలాయిట్, పీడబ్ల్యూసీ, గోద్రేజ్‌తో పాటు పలు కంపెనీలు తమ ఉద్యోగులకు ప్రతి వారం, నెలవారీగా సెలవులను ఇస్తున్నాయి. దీనిద్వారా వారిపై ఉన్న పని ఒత్తిడిని తగ్గించి మెరుగ్గా పనిచేసే అవకాశం ఉంటుందని కంపెనీలు అభిప్రాయపడుతున్నాయి.

మరికొన్ని కంపెనీలు ఉద్యోగుల్లోనే తమ వాటా సెలవులను అత్యవసరంగా సెలవులు తీసుకునే వారికి బదలాయించే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఉదాహరణకు, డెలాయిట్ ఇండియా ‘హాలిడే పూల్’ విధానాన్ని అమలు చేస్తోంది. దీని ద్వారా ఉద్యోగులు కేటాయించిన దానికంటే ఎక్కువ రోజులు సెలవులను పొందే వెసులుబాటు ఉంటుంది. నాన్-కొవిడ్ మెడికల్ ఎమర్జెన్సీ కోసం ‘షేర్డ్ లీవ్ బ్యాంక్’ విధానం ఉద్యోగులకు ఎంతో సహాయంగా ఉందని డెలాయిట్ ఇండియా చీఫ్ టాలెంట్ ఆఫీసర్ ఎస్వి నాథన్ చెప్పారు. ఇందులో ఒక ఉద్యోగి కేటాయించిన కంటే ఎక్కువ సెలవులను సహ ఉద్యోగుల నుంచి తీసుకోవచ్చు. దీనివల్ల ఉద్యోగుల్లో ఒకరి అవసరాలకు మరొకరు సహాయంగా ఉంటారని ఆయన తెలిపారు.

వేతనంతో కూడా సెలవులిస్తున్న పీడబ్ల్యూసీ..

ఇదే బాటలో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ తన ఉద్యోగుల కోసం పనిదినాలను వారంలో నాలుగు రోజులుగా మార్పులు చేసింది. అనేక పట్టణాల్లో పాక్షిక లాక్‌డౌన్ మధ్య ఉద్యోగుల ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది. ఇటీవల కొవిడ్ కేసులు మరింత పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మే నెలలో ఉద్యోగులందరికీ 4 రోజుల పని దినాలను తగ్గిస్తున్నామని కంపెనీ వివరించింది. మరో కంపెనీ పీడబ్ల్యూసీ కూడా తన ఉద్యోగులకు ‘హాలిడే పూల్’ను అమలు చేస్తూ మే నెలలో అందరికీ మూడు రోజుల వేతనంతో కూడిన సెలవులను ఇస్తున్నట్టు ప్రకటించింది.



Next Story

Most Viewed