వారంలో శుభకార్యం.. ఆ ఇంట్లో ఇద్దరు మృతి.. బోరున విలపించిన పెళ్లికూతురు

by  |
వారంలో శుభకార్యం.. ఆ ఇంట్లో ఇద్దరు మృతి.. బోరున విలపించిన పెళ్లికూతురు
X

దిశ, మక్తల్ : వారంలో కూతురి పెళ్లి జరగాల్సి ఉండగా, ఎదురుగా వస్తున్న బైకును ఢీకొని ప్రమాదవశాత్తు బస్సు కింద పడిపోవడంతో సుదర్శన్ (48) అనే వ్యక్తి తీవ్ర గాయాలపాలై మక్తల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ప్రమాదంలో భార్య రాజేశ్వరికి (45 ) భుజానికి గాయమైన ఘటన పట్టణ కేంద్రంలోని బస్టాండ్ ఎదుట గురువారం చోటుచేసుకుంది. అయితే, పదిరోజుల కిందనే సుదర్శన్ తల్లి చనిపోగా అన్ని కార్యక్రమాలు నిర్వహించారు. పది రోజుల వ్యవధిలో సుదర్శన్ కూతురు స్వాతికి పెళ్లి జరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఆమె అత్త వారింటి దగ్గర కొత్త బట్టలు పెట్టించుకుని రావాలిని బయలుదేరిన సుదర్శన్ దంపతులు అనుకోకుండా ప్రమాదానికి గురయ్యారు.

కుటుంబ సభ్యులు రజనీకాంత్ కథనం ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణ మండల కేంద్రానికి చెందిన సుదర్శన్ తల్లి 11 రోజుల కిందట చనిపోవడంతో కర్మకాండలు పూర్తిచేశారు. పది రోజుల తర్వాత బిడ్డ పెళ్లి ఉండటంతో దానికి ముందు అత్తారింటి దగ్గర కొత్త బట్టలు పెట్టించుకుని రావాలన్న ఆనవాయితీతో గురువారం ఉదయం భార్యతో కలిసి స్వాగ్రామం క్రిష్ణా నుండి బైక్‌పై బయలుదేరాడు. మక్తల్ బస్ స్టాండ్ నుండి బయటికి వస్తున్న క్రమంలో నారాయణ పేటకు బయలుదేరిన అదే డిపో బస్సును తప్పించబోయి ఎదురుగా వస్తున్న మోటార్ బైక్ ఢీకొన్నాడు. ఈ క్రమంలోనే కింద పడిపోయిన సుదర్శన్ మీద నుంచి అదే బస్సు ముందు టైర్ వెళ్లింది. దీంతో తీవ్ర గాయాలపాలైన అతన్ని మక్తల్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడితో పాటే ఆయన భార్య మహేశ్వరి కూడా తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇదిలాఉండగా త్వరలో పెళ్లి పీటలెక్కనున్న మృతుడి కూతురు స్వాతి తండ్రి శవం వద్ద బోరున విలపించడం పలువురిని కలిచి వేసింది. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మక్తల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Next Story

Most Viewed