వసూల్ రాజాలు.. ఫీజు కడితేనే హాల్‌టికెట్..!

by  |
వసూల్ రాజాలు.. ఫీజు కడితేనే హాల్‌టికెట్..!
X

కరోనా కాలంలో కార్పొరేట్​విద్యాసంస్థలు కాసుల వేట ప్రారంభించాయి. అందినకాడికి దండుకునేందుకు విశ్వప్రత్నాలు చేస్తున్నాయి. ఇటీవల విద్యాసంస్థలు ఓపెన్​కావడంతోనే ఫీజుల వసూళ్లపై దృష్టిపెట్టాయి. మొత్తం ఫీజు చెల్లిస్తేనే క్లాసులు, హాస్టల్ కు అనుమతి అంటూ విద్యార్థులను వేధించుకుతున్నాయి. కేవలం నెలరోజులు మాత్రమే కొనసాగడం, మళ్లీ విద్యాసంస్థలు తాత్కాలికంగా మూసివేయడం, ఇదే నెలలో ఇంటర్మీడియట్​ విద్యార్థులకు ఎథిక్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ ప‌రీక్ష ఉండడంతో హాల్​టికెట్​పేరిట మొత్తం ఫీజులు వసూలు చేస్తున్నాయి. హ‌న్మకొండ‌లోని పలు కాలేజీలు రూ.40వేల వరకు వసూలు చేస్తుండగా, కార్పొరేట్ కాలేజీలు రూ.ల‌క్షకుపైగా వసూలు చేస్తున్నాయి. విద్యార్థులకు ఒక నెల క్లాసులు, హాస్టల్​ వసతి కల్పించి ఏడాది మొత్తానికి ఫీజులు చెల్లించాలనడం ఎంతవరకు సబబని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : వ‌రంగ‌ల్ అర్బన్ జిల్లాలో‌ ప్రైవేట్​జూనియ‌ర్‌ క‌ళాశాల‌లు దోపిడీకి నిల‌యాలుగా మారాయి. ఫీజులు చెల్లించాలంటూ విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌ను జ‌ల‌గ‌ల్లా ప‌ట్టిపీడిస్తున్నాయి. క‌రోనా, లాక్‌డౌన్ పుణ్యమాని నెల‌రోజులు కూడా కొన‌సాగ‌లేదు. అయితే క‌ళాశాల‌ల యాజ‌మాన్యాలు మాత్రం మొత్తం ఫీజు వ‌సూలు చేసుకునే ప‌నిలో ఉండడం గ‌మ‌నార్హం. వ‌న్ టైంలోనే మొత్తం ఫీజు చెల్లిస్తేనే క్లాస్​కి అనుమ‌తిస్తామ‌ని కొన్ని క‌ళాశాల‌లు ఇబ్బంది పెట్టడంతో చాలా మంది స‌గం వ‌ర‌కైనా చెల్లించి విద్యార్థుల‌ను కాలేజీల్లో వ‌దిలివెళ్లారు. హాస్టల్‌లో ఉండ‌ని నెల‌ల‌కు కూడా ఫీజులు వ‌సూలు చేయ‌డంపై త‌ల్లిదండ్రులు మండిప‌డుతున్నారు. ఇదే విష‌యంపై భీమారం ప్రాంతంలో నిర్వహిస్తున్న ఓ కార్పొరేట్ క‌ళాశాల యాజ‌మాన్యంపై త‌ల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయ‌కులు తిర‌గ‌బ‌డ్డారు. క‌ళాశాల‌లోని ఫ‌ర్నిచ‌ర్‌, సామ‌గ్రిని ధ్వంసం చేశారు. క‌ళాశాల యాజ‌మాన్యం ఫిర్యాదుతో కొంత‌మంది విద్యార్థి నేత‌ల‌ను అదుపులోకి తీసుకోవ‌డం కొద్దిరోజుల క్రితం చ‌ర్చనీయాంశంగా మారింది.

ఫీజు చెల్లించి హాల్ టికెట్ తీసుకెళ్లండి..

ఇంట‌ర్మీడియ‌ట్ విద్యార్థుల‌కు ఎథిక్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ ప‌రీక్షను ఆన్‌‌లైన్‌లో ఇంటి వ‌ద్దనే రాసుకునే అవ‌కాశాన్ని బోర్డు క‌ల్పించింది. ఈ నెల‌లోనే ప‌రీక్ష ఉంది. అయితే దానికి హాల్ టికెట్ త‌ప్పనిస‌రి కావ‌డంతో ఫీజుల వ‌సూలుకు యాజ‌మాన్యాలు అవ‌కాశంగా మ‌ల్చుకుంటున్నాయి. సాధార‌ణ ప్రైవేటు క‌ళాశాల‌లో అయితే హ‌న్మకొండ‌లో కాలేజీ అండ్ రెసిడెన్సీ పేరిట రూ.30వేలు చేస్తుండ‌గా, దోబీ, స్టడీ మెటీరియ‌ల్‌, ఇంట‌ర్నల్ ఎగ్జామ్‌, ఎగ్జామ్‌ ఫీజు పేరిట దాదాపు మ‌రో రూ.10వేల వ‌ర‌కు వ‌సూలు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. కార్పొరేట్ కళాశాల‌లైతే కాలేజీ మ‌రియు రెసిడెన్సీ ఫీజు క‌లిపి రూ.ల‌క్ష వ‌ర‌కు వ‌సూలు చేస్తున్నాయి. రూ.ల‌క్ష మించి ఫీజులు వ‌సూలు చేస్తున్న జూనియ‌ర్ క‌ళాశాల‌లు త్రిన‌గ‌రిలో 12వ‌ర‌కు ఉన్నాయి. ఈ క‌ళాశాల‌ల్లో ఎంసెట్‌, ఐఐటీ, జేఈఈ, మెయిన్ జేఈఈ, ఏఐఈఈఈ కాంపిటీటీవ్ ఎగ్జామ్స్‌కు అనుబంధంగా కోర్సులు కొన‌సాగిస్తామ‌ని చెబుతూ భారీగా ఫీజులు దండుకుంటున్నాయి. పిల్లల భ‌విష్యత్‌కు మించిదేదీ లేద‌ని భావిస్తున్న త‌ల్లిదండ్రులు ఈ క‌ళాశాల‌ల‌కు రూ.ల‌క్షల్లో ముట్టజెబుతున్నారు. ఈ యేడు అలాంటి క‌ళాశాల‌ల్లో విద్యార్థుల‌ను జాయిన్ చేసిన త‌ల్లిదండ్రులు తీవ్ర మ‌నోవేద‌న‌కు గుర‌వుతున్నారు. లాక్‌డౌన్‌, క‌రోనా భ‌యంతో కేవ‌లం నెల‌రోజులు మాత్రమే క‌ళాశాల‌లు తెరుచుకున్నాయి. ఆన్‌లైన్ పేరిట గాలి చ‌దువులు కొన‌సాగాయ‌ని ఆవేద‌న చెందుతున్నారు. పిల్లల‌కు స‌రైన విద్య అంద‌క‌పోగా, వేలాది రూపాయాలు క‌ళాశాల‌ల‌కు పుణ్యానికి ముట్టజెప్పాల్సి వ‌స్తోంద‌ని బాధ‌ప‌డుతున్నారు.

బ్లాక్ మెయిల్ క‌ళాశాల‌ల‌పై చ‌ర్యల‌కు డిమాండ్‌..

చాలామంది విద్యార్థుల త‌ల్లిదండ్రుల నుంచి ఇప్పటికే 70శాతం నుంచి100శాతం ఫీజును రాబ‌ట్టుకున్నట్లు తెలుస్తోంది. డబ్బు సంపాదనే ప‌ర‌మావ‌ధిగా సాగుతున్న విద్యా వ్యాపారులు త‌ల్లిదండ్రుల‌ను బ్లాక్ మెయిల్‌ చేసి మ‌రీ వ‌సూలు చేసేందుకు య‌త్నిస్తున్నారు. మొత్తం ఫీజు చెల్లిస్తేనే హాల్ టికెట్ ఇస్తామంటూ చెబుతుండ‌డంపై వారు మండిప‌డుతున్నారు. ఇంట‌ర్ బోర్డు అధికారులు క‌ళాశాల‌ల యాజ‌మాన్యాల‌పై చ‌ర్యలు తీసుకోవాల‌ని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్​ చేస్తున్నారు.



Next Story

Most Viewed