వీఆర్వోల కులాల లెక్కలు తీస్తున్న సర్కారు

by  |
VROs caste details
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా పంపిన విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ల నివేదికల్లో తేడాలొచ్చాయి.. ఆ డేటాను పరిశీలించి తుది రిపోర్టును పంపాలంటూ కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. గతేడాది డిసెంబరులో పంపిన నివేదికలో జిల్లాల వారీగా వీఆర్వోల లెక్క ఉంది. అయితే కులం, విద్యార్హతలు, అపాయింట్​మెంట్ ​తారీఖు అప్డేట్​ చేయలేదని భూ పరిపాలనాధికారి భావించారు. మూడు పట్టికల ద్వారా మళ్లీ వీఆర్వోల పూర్తి వివరాలను పంపాలని ఆదేశించారు. మొదటి దాంట్లో 18 కాలమ్స్​తో జిల్లాల్లో పని చేస్తోన్న వీఆర్వోల వివరాలను అడిగారు. రెండో ప్రొఫార్మాలో సస్పెన్షన్లు, ఏసీబీ కేసులు, అనుమతి లేకుండా గైర్హాజరైన అంశం, దీర్ఘ కాలిక సెలవులు వంటి వివరాలను పొందుపరిచారు. మూడో దాంట్లో మాత్రం కులాలు, విద్యార్హతలు, అపాయింట్మెంట్ తీరును నమోదు చేసి మళ్లీ పంపాలంటూ కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.

జిల్లాల వారీగా ఏయే కులాల వారు ఎంత మంది ఉన్నారని లెక్కలు తీస్తున్నారు. అనెక్జర్ 3 లో మంజూరైన క్యాడర్​ స్ట్రెంథ్, ప్రస్తుతం పని చేస్తోన్న వీఆర్వోల సంఖ్యను అడిగారు. దాంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఓసీలు, క్రిస్టియన్లు ఎంత మంది ఉన్నారో నమోదు చేయాలని సూచించారు. ఈ విషయం తెలుసుకున్న ఉద్యోగ వర్గాలు ప్రభుత్వ నిర్ణయం పట్ల మండిపడుతున్నాయి. ఏ జిల్లాలో ఏ కులానికి చెందిన వీఆర్వోలు ఎంత మంది ఉన్నారన్న అంశానికి ప్రాధాన్యం కల్పించడం దేనికి సూచిక అని ప్రశ్నిస్తున్నారు. ఏ రాష్ట్రంలోనూ ఇలా డేటా సేకరణ చేపట్టడం లేదని.. దీని వెనుక ఆంతర్యమేమిటని ఉద్యోగ సంఘాల్లో చర్చ నడుస్తోంది. ఖచ్చితంగా ఇది సీఎం కేసీఆర్ నిర్ణయం కాదని, ఉన్నతాధికారుల సొంత నిర్ణయమై ఉంటుందని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.

డేటా ఉన్నా మళ్లీ సేకరణ

రాష్ట్ర వ్యాప్తంగా క్యాడర్ స్ట్రెంథ్ ప్రకారం వీఆర్వోల సంఖ్య 7300, వీఆర్ఏల సంఖ్య 24 వేలు, విధుల్లో మాత్రం 5,485 మంది వీఆర్వోలు, 21 వేల మంది వీఆర్ఏలు ఉన్నారు. అయితే వీఆర్వోలను ఏయే శాఖల్లో సర్దుబాటు చేస్తారన్న విషయం ఇప్పటికీ సందిగ్ధమే. వీరందరి నియామకం తర్వాత శిక్షణ మాత్రం రెవెన్యూ శాఖలో పని చేసేందుకు అవసరమైన అంశాలపైనే ఇచ్చారు. ఇక్కడేమో శిక్షణకు భిన్నంగా ఇతర శాఖల్లో విలీనానికి శ్రీకారం చుట్టారు. తమతో చర్చించకుండా ఇతర శాఖల్లోకి పంపాలని ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం అన్యాయమంటున్నారు. కులాల వారీగా, మతాల వారీగా వీఆర్వోల లెక్కలు ఎందుకు అడుగుతున్నారో అర్ధం కావడం లేదని తెలంగాణ వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు గోల్కొండ సతీష్​, పల్లెపాటి నరేష్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ డేటాతో ఉద్యోగుల్లో విభజన ఎందుకు చేస్తున్నారన్నారు. ఈ రకమైన సమాచారం ఎందుకోసం పనికొస్తుందన్నారు. చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ప్రభుత్వం చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రత్యామ్నాయం లేకుండానే..

ప్రధానంగా రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, యాదాద్రి, నల్లగొండ, సంగారెడ్డి, మెదక్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో ప్రభుత్వ భూముల పరిరక్షణకు వీఆర్వో వ్యవస్థ రద్దు తర్వాత ప్రత్యామ్నాయ వ్యవస్థ లేకుండా పోతుంది. ప్రతి రోజూ కబ్జాలతో వార్తల్లోకి ఎక్కే గండిపేట, శేరిలింగంపల్లి, శంషాబాద్, కూకట్ పల్లి, పటాన్ చెరు, కుత్బుల్లాపూర్, మేడ్చల్, కీసర, మహేశ్వరం, బాలాపూర్, ఘట్ కేసర్, శామీర్ పేట, మూడుచింతలపల్లి, కందుకూరు, ఇబ్రహింపట్నం, అబ్దుల్లాపూర్ మెట్ మండలాల్లోని రెవెన్యూ కార్యాలయాల్లో వీఆర్వోలు వెళ్లిపోతే ఎంత మంది సిబ్బంది ఉంటారో లెక్క తీస్తే ఐదారుగురికి మించరు. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ భూముల సంరక్షణ ఎలా సాధ్యమన్న ప్రశ్నకు రెవెన్యూ అధికారుల దగ్గర సమాధానమే లేదు. ప్రభుత్వ భూములను వేరే సర్వే నంబర్లతో కబ్జాకు యత్నిస్తూనే ఉంటారు. ఫిర్యాదులు అందగానే వీఆర్వోలను పంపేవారు. కూల్చివేసి బోర్డులు పాతేవాళ్లు. కబ్జాకు యత్నించిన వారిపై కేసులు పెట్టడం విధుల్లో భాగంగా సాగేది. ఇప్పుడా వీఆర్వోలకు ప్రత్యామ్నాయ వ్యవస్థనే లేకుండా పోయింది.

Next Story

Most Viewed