పీఎం కాన్ఫరెన్స్‌లో ఏ సీఎం.. ఏమన్నారు?

by  |

న్యూఢిల్లీ : కరోనా కట్టడి కోసం విధించిన 21 రోజుల లాక్‌డౌన్ ఈ నెల 14న ముగుస్తుండగా.. సీఎంలతో పీఎం మోడీ నిర్వహించి శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని మోడీకి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఏ ముఖ్యమంత్రి ఏం మాట్లాడారో.. పీఎంకు ఏ సూచనలు చేశారో ఓ సారి చూద్దాం..

ఈ నెల చివరి వరకు లాక్‌డౌన్ పొడిగించండి : కేసీఆర్

శనివారంనాడు ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న తెలంగాణ సీఎం కేసీఆర్.. లాక్‌డౌన్‌ను ఈ నెల చివరి వరకు పొడిగించాలని సూచించారు. అలాగే, ఆ లాక్‌డౌన్ ఆంక్షల నుంచి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను మినహాయించాలని కోరారు. రెండు వారాలపాటు లాక్‌డౌన్ పొడిగించాలని కేంద్రాన్ని కోరుతామని ఆయన ఇది వరకు చెప్పినట్టే శనివారం ఆ విజ్ఞప్తిని ప్రధాని ముందుంచారు. అలాగే, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ సేవలు కొనసాగితే.. రైతులకు ఉపయోగకరంగా ఉండటమే కాదు.. ప్రజలకు అత్యవసర సరుకుల పంపిణీ సులువవుతుందని చెప్పారు. ఈ పరిశ్రమలో భాగంగా రైస్ మిళ్లులు, ఆయిల్ మిళ్లులు, ఇతర అనుబంధ పరిశ్రమలు నిర్వహణలో ఉండాలని తెలిపారు. రైతులకు అండగా ఉండేందుకు కనీసం రెండు నెలలు వంద రోజుల పనిని వ్యవసాయానికి లింక్ చేయాలని సూచించారు.

లాక్‌డౌన్ రెడ్‌జోన్‌లకే పరిమితం చేయాలి : జగన్

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ పీఎంతో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. లాక్‌డౌన్ పొడిగింపును సమర్థించారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నట్టు వివరించారు. లాక్‌డౌన్‌ను రెడ్‌జోన్‌లకే పరిమితం చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, ప్రజా రవాణా, పాఠశాలలు, మాల్స్, సినిమా హాళ్లపైనే లాక్‌డౌన్ అమలు చేయాలని కోరారు.

రాష్ట్రాలు కాదు.. కేంద్రమే ఆ నిర్ణయం తీసుకోవాలి : కేజ్రీవాల్

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించి చాలా మంచి పనిచేసిందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. కొవిడ్ 19 మహమ్మారిపై వేగంగా స్పందిస్తూ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ముప్పును చాలా రెట్లు తగ్గించుకున్నామని చెప్పారు. అలాగే, ఆయన ప్రధానికిమూడు సూచనలు చేశారు. ఈ లాక్‌డౌన్‌ను నెలాంతం వరకు కొనసాగించాలని కోరారు. ఈ నిర్ణయాన్ని జాతీయంగా తీసుకోవాలని, రాష్ట్రాల వారీగా తీసుకుంటే ఇన్నాళ్లు మనం పాటించిన జాగ్రత్తలు నీరుగారిపోయే ప్రమాదమున్నదని తెలిపారు. అందుకే లాక్‌డౌన్ నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని వివరించారు. మూడో సూచనగా.. లాక్‌డౌన్ కాలంలో ఏవైనా మినహాయింపులు ఇవ్వదలిస్తే.. రైల్వే, రోడ్డు రవాణా లాంటి రాకపోకలను మాత్రం తప్పకుండా నిలిపేయాలని కోరారు.

ఈ సంక్షోభ సమయంలో ఆర్థిక సాయం అవసరం.. : మమతా బెనర్జీ

లాక్‌డౌన్‌తో జీడీపీ పడిపోవడంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంక్షోభ సమయంలో కేంద్ర ప్రభుత్వం తప్పకుండా ఆర్థిక సహాయాన్ని అందించాలన్నారు. లాక్‌డౌన్ పొడిగించాలని చెప్పిన దీదీ.. ఆ వ్యవహారాన్ని ప్రక్టికల్‌గా ఆలోచించి.. మానవతా దృక్పథంతో నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. అలాగే, కొవిడ్ 19 హాట్‌స్పాట్‌లను వెంటనే గుర్తించి సీల్ చేయాలని కోరారు.

రైతుకు అండగా ఉండాలి : రాజస్తాన్ సీఎం

ఈ నెల 14వ తేదీ తర్వాత కూడా లాక్‌డౌన్ పొడిగించాలని రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న రాజస్తానీ వలసకార్మికులపై ఆయన ఆందోళన చెందారు. వీరి బాగోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఓ వ్యూహాన్ని రూపొందించుకోవాలని చెప్పారు. అలాగే, రబీ పంట నేపథ్యంలో రైతులకు అండగా ముఖ్యమంత్రులందరూ ప్రణాళిక రచించాలని సూచించారు.

లాక్‌డౌన్ పొడిగింపు అవసరం లేదు : ఎంపీ సీఎం

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అందరు సీఎంలు లాక్‌డౌన్ పొడిగించాలని అభ్యర్థించగా.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాత్రం వారితో విభేదించారు. అయితే, రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులపై పీఎంకు సమాచారమందించారని చెప్పారు. అలాగే, వ్యక్తిగత రక్షణ పరికరాలు, టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచడం, కొవిడ్ 19 పేషెంట్ల కోసం 23 ఆస్పత్రులను సిద్ధం చేసిన విషయాలను విన్నవించినట్టటు తెలిపారు.

కేంద్రానికి పూర్తి మద్దతు : ఛత్తీస్‌గడ్

ఛత్తీస్‌గడ్ కోర్బా రీజియన్‌లో ఎనిమిది కరోనా కేసులు కన్ఫామ్ కావడంతో ఆ ఏరియా మొత్తంగా లాక్‌డౌన్ విధించినట్టు రాష్ట్ర సీఎం భుపేశ్ భగేల్ అన్నారు. కరోనాపై పోరులో ఛత్తీస్‌గడ్ కేంద్రానికి పూర్తి మద్దతుగా ఉంటుందని తెలిపారు.

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్‌లు కూడా లాక్‌డౌన్ పొడిగించాలని ప్రధానిని కోరారు.

Tags: modi, pm, video conference, cm’s, states, lockdown, extension

Next Story

Most Viewed