కరోనా కట్టడిలో చాలా సీరియస్ !

by  |
కరోనా కట్టడిలో చాలా సీరియస్ !
X

• భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి
• రెడ్ జోన్‌లో మూడు జిల్లాలు మాత్రమే
• తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్

దిశ, న్యూస్ బ్యూరో :
కరోనా కట్టడి కోసం తమ ప్రభుత్వం చాలా సీరియస్‌గా పనిచేస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కేబినేట్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చాలా శ్రమ తర్వాత రాష్ట్రంలో పరిస్థితి మెరుగుపడిందని, ఇదే విధంగా ఇంకొన్ని రోజులు ఉండాలని ప్రజలను కోరారు. ప్రభుత్వం ప్రకటించిన నిబంధనలను ప్రజలు కచ్చితంగా పాటించాలని లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,096 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని.. వీరిలో చికిత్స అనంతరం 628 మంది ఇండ్లకు వెళ్లారని తెలిపారు. మంగళవారం ఒక్కరోజే 43 మంది డిశ్చార్జి అయ్యారని, కొత్తగా 11 మందికి పాజిటివ్ వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 439 పాజిటివ్ కేసులు ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు.

దేశంతో పోలిస్తే మన బాగా పనిచేస్తున్నాం..

ఇంతకుముందు దేశంలోనే కంటైన్‌మెంట్ గురించి ఎవరికీ తెలియదని ముఖ్యమంత్రి అన్నారు. మన రాష్ర్టంలో చాలా కఠినంగా, పకడ్బందీ వ్యూహాన్ని అనుసరించామని వివరించారు. కరీంనగర్‌లో ఒక్కరు కూడా మృతి చెందకుండా కట్టుదిట్టంగా వ్యవహరించగలిగాం. అక్కడ నుంచి నేర్చుకుని అన్నిచోట్లా అమలు చేశామన్నారు. కరీంనగర్‌లో ఇండోనేషియాకు చెందిన 11 మందికి పాజిటివ్ రావడంతో కేంద్రాన్ని కూడా మనమే హెచ్చరించామని కేసీఆర్ తెలిపారు. దేశ గణంకాలతో పోలిస్తే మన రాష్ట్రంలో కరోనాపై వ్యూహాత్మకంగా వ్యహరించడం వల్లే నష్టశాతం తక్కువగా ఉందన్నారు. దేశంలో కరోనా మరణాల రేటు 3.34% ఉండగా, మన రాష్ట్రంలో 2.64% మాత్రమేనని.. యాక్టివ్ కేసుల్లోనూ దేశ సగటు 69.12% ఉంటే, మన దగ్గర 42.3%కు పరిమితమైందన్నారు. రికవరీ విషయంలోనూ దేశంలో 27.40 శాతం ఉంటే, మన తెలంగాణలో అధికంగా 57.3% ఉందన్నారు.

ఆగస్టు, సెప్టెంబర్ నాటికి వ్యాక్సిన్..

కరోనా వైరస్ విస్తరణలో వివిధ దశలు ఉన్నాయన్న సీఎం.. తెలంగాణలో కర్వ్ ఫ్లాటెనింగ్ స్టేజీలో ఉందన్నారు. మన దగ్గరి జీనోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్, శాంతా బయోటెక్‌ తదితర సంస్థల ప్రతినిధులతో మాట్లాడామని.. కరోనా వ్యాక్సిన్ కోసం తీవ్రంగా పరిశోధనలు జరుగుతున్నట్టు వారు చెప్పారన్నారు. అనుకున్నట్టుగా జరిగితే ఆగస్టులోనే మొదటి వ్యాక్సిన్, సెప్టెంబర్‌లో రెండో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందన్న నమ్మకాన్ని ఆయా కంపెనీలు వ్యక్తం చేశాయన్నారు. మన తెలంగాణ నుంచే ఆవిష్కరణ జరిగితే ప్రపంచానికే మార్గం చూపినవారమవుతామని, వ్యాక్సిన్ తొందరగా రావాలని అందరం కోరుకోవాలన్నారు. వ్యక్తిగత, దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నవారికి మూడు నెలలకు సరిపడా మందులు ఒకేసారి ఇవ్వనున్నట్టు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ విధంగా చికిత్స పొందుతున్నవారు సుమారు 50 లక్షల మంది ఉన్నారని వారికి ప్రభుత్వమే ఉచితంగా మాస్క్‌లు అందిస్తుందని వివరించారు.

రెడ్ జోన్‌లో మూడు జిల్లాలు..

‘కేంద్ర ప్రభుత్వ మార్గనిర్దేశకాల ప్రకారం కరోనా తీవ్రతను బట్టి దేశాన్ని జోన్లుగా విభజించింది. రెడ్‌జోన్‌లో సూర్యాపేట, వరంగల్ అర్బన్, వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉన్నాయి. సూర్యాపేటలో 14 రోజుల నుంచి కొత్త కేసులు లేవు. వరంగల్ అర్బన్, వికారాబాద్, సూర్యాపేట ఆరెంజ్ జోన్‌లోకి పోతున్నాయి. ఇక మిగిలిన హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు మాత్రమే రెడ్ జోన్‌లో ఉంటాయి. రాష్ట్రంలో నమోదైన మొత్తం 1,096 కేసుల్లో 726 (66%) ఈ మూడు జిల్లాల్లోనే ఉన్నాయి. కరోనా మరణాలు 29 సంభవించగా.. 26 (86%) ఇక్కడ నుంచే ఉన్నాయి. రాష్ట్రంలో 35 కంటైన్‌మెంట్ జోన్లు ఉండగా.. 19 జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదైనట్టు’ సీఎం వివరించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో 11 మాత్రమే కంటైన్‌మెంట్ జోన్లుండగా.. వీటిని కూడా డీనోటిఫై చేస్తామని కేసీఆర్ తెలిపారు. కొత్త కేసులన్నీ జీహెచ్ఎంసీ నుంచే వస్తున్నాయన్న సీఎం.. ఈ ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కేంద్ర నిర్ణయాలను అతిక్రమించడానికి మనకు అధికారాలు లేవని, తప్పకుండా నిబంధనలను పాటించాల్సిందేనని సూచించారు. వచ్చే 11 రోజుల్లో 18 జిల్లాలు గ్రీన్‌ జోన్‌లోకి పోతాయని సీఎం తెలిపారు.

Tags: KCR, press meet, corona, lockdown, wine, red zones, ghmc

Next Story

Most Viewed