సీఎం కేసీఆర్ అబద్దాలలో రికార్డు.. ఏడేళ్ల పాలనపై బండి సంజయ్​ కామెంట్స్

by  |
Bandi Sanjay
X

దిశ, తెలంగాణ బ్యూరో : “ స్వరాష్ట్రం సిద్ధిస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు. కానీ 20 వేల మంది కాంట్రాక్ట్​ ఉద్యోగులను రోడ్డున పడేశారు. ఉద్యోగాల కోసం చూసీ చూసీ వయస్సు కూడా దాటిపోయింది. తెలంగాణ వచ్చాక కేసీఆర్​ ఫాంహౌస్​కు నీళ్లు వచ్చాయి. ఆయన అనుచరులకు నిధులు అందాయి. కేసీఆర్​ కుటుంబానికి నియామకాలు వెళ్లాయి.. ఇంకేం మిగిలింది. అవి ఇస్తాం.. ఇవి ఇస్తాం… మాట తప్పితే తల నరుక్కుంటాం… అంటూ చెప్పి ఒక్క హామీ కూడా ఇవ్వకుండ అబద్ధాల రికార్డు సాధించుకున్నారు..” అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్​ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన ‘దిశ’ ఇంటర్వ్యూలో పలు అంశాలు వెల్లడించారు.

రాష్ట్రంలో ఏడేళ్ల పాటు పాలించిన టీఆర్ఎస్‌పై మీ అభిప్రాయం..?

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన ఏడేండ్ల కాలంలో కేసీఆర్ ఎన్ని అబద్దాలు ఆడారో తెలుసుకునేందుకు వీడియోలన్నింటినీ ఫాంహౌస్‌లో ప్రొజెక్టర్‌లో చూసుకోవాలి. ఆయన ఆడిన అబద్దాలను చూసి వైఖరిలో మార్పు వస్తుందో మరిన్ని అబద్దాలు ఆడే అవకాశం దొరుకుతుందో కేసీఆర్​ డిసైడ్ చేసుకోవాలన్నారు. అబద్దపు హామీలపై పాలన సాగిస్తున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చేది లేదు. వాటిని మరిపించేందుకు మరో కొత్త అంశాన్ని ఎత్తుకుని ముందుకు సాగడం తప్ప రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదు. తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ అన్ని విషయాల్లోనూ ప్రజలను మోసగిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల వారిని మోసం చేసిన రికార్డును టీఆర్ఎస్​ నుంచి బహుశా ఏ పార్టీ కూడా బ్రేక్ చేయలేదేమో.

కరోనా కష్ట కాలంలో ప్రైవేటు టీచర్లను ఆదుకుంటోంది కదా?

ప్రైవేట్​ టీచర్ల వ్యవహరంలో అదంతా ఓ డ్రామా. కరోనా కష్ట కాలంలో సంక్షేమాన్ని విస్మరించిన ఘనత టీఆర్ఎస్ కే దక్కుతుంది. నిరుద్యోగ భృతి అంశంపై దృష్టి మరల్చేందుకే ప్రైవేటు టీచర్లకు భృతి ఇచ్చే అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. 2018 నుండి నిరుద్యోగ భృతి ఎందుకు అమలు చేయడం లేదు. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదం తీసుకొచ్చిన టీఆర్ఎస్ మూడు అంశాలను కూడా విస్మరించింది. ఉద్యోగాల నోటిఫికేషన్లు వేయడం, కోర్టులను ఆశ్రయించి ఉద్యోగాలు కల్పించకుండా చేయడం టీఆర్ఎస్ ప్రభుత్వానికే చెల్లింది. సాంకేతింగా ఇబ్బందులు రాకుండా నోటిఫికేషన్లు జారీ చేయవచ్చు కదా. కానీ కేవలం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నాల్లో ఉన్నామన్న భ్రమలు కల్పించడం తప్ప ఖాళీలు భర్తీ చేసే యోచన ప్రభుత్వానికి ఏ మాత్రం లేదు.

ప్రభుత్వం ఎన్నో హామీలను నెరవేర్చినట్టుగా చెప్తోంది కదా.?

సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలేమిటీ, అమలు చేసినవి ఏమిటో గుర్తుకు ఉన్నాయా? ఆయన చెప్పిన అబద్దపు హామీలకు సంబందించిన వీడియోలను ఫాంహౌస్​లో ప్రొజెక్టర్ వేసుకుని చూసుకోవాలి. ఆ తరువాత వాటిని నెరవేరుస్తారా లేక మరిన్ని అబద్దాలు ఆడుతారో సీఎం డిసైడ్ చేసుకోవాలి. చిలువలు పలువలు చేస్తూ భారీగా ప్రచారం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు తప్ప ప్రజా సంక్షేమంపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ఇది. ముఖ్యమంత్రి తాను చెప్పిన మాటను అమలు చేయకపోతే తలను నరుక్కుంటానని ప్రకటించేవారు. గతంలో ఇచ్చిన హామీల వీడియోలను చూసి తలను ఎన్నిసార్లు నరక్కుంటారో ఆయనకే తెలియాలి.

ఆలయాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది కదా..?

రాష్ట్రంలో యాదాద్రి తప్ప వేరే క్షేత్రాన్ని అభివృద్ధి చేశారా. నిధులు కేటాయిస్తున్నట్టు ప్రకటించడంతోనే సరిపెట్టారు కానీ అక్కడ ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారా?. రియల్ ఎస్టేట్ లో ఆదాయం గడించే అవకాశం ఉన్న ఆలయాలను మాత్రమే డెవలప్ చేస్తున్నారు. అత్యంత చారిత్రాత్మకమైన భద్రాద్రి విషయంలో ఎందుకు చొరవ చూపడం లేదు. అక్కడ భూములు అధికారపార్టీ నాయకుల చేతుల్లోకి వచ్చిన తరువాతే భద్రాద్రిని బాగుపర్చేందుకు ముందుకు వస్తారేమో. వేములవాడ, కాళేశ్వరం ఆలయాల పరిస్థితి కూడా ఇదే. ప్రభుత్వం ఏదైనా కార్యక్రమం చేసేందుకు తలపెట్టిందంటే అక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు భూములను కొనుగోలు చేసినట్టే లెక్క. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగానే అధికారపార్టీ నాయకుల చేతుల్లోకి వచ్చిన భూముల ధరలు పెరిగిపోతాయి. ఈ పరిస్థితి రాష్ట్రంలోని అన్ని చోట్ల కనిపిస్తోంది.

కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని ప్రభుత్వం అంటోంది కదా?

కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడం రాష్ట్ర ప్రభుత్వానికి రివాజుగా మారింది. కేంద్రం నుండి వచ్చిన నిధులను సద్వినియోగం చేయడంలో విఫలమై ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తోంది. కొన్ని నిధులకు యూసీలను కూడా సమర్పించని పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది. ముందుగా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడటం అలవర్చుకోవాలి. బాధ్యతగా మెదలాల్సిన ప్రభుత్వం ఆరోపణలు చేస్తూ కాలం వెల్లదీసే ప్రయత్నం చేస్తోంది తప్ప మరోటి కాదు.

Next Story

Most Viewed