మత ఘర్షణలను సహించం.. సీఎం కేసీఆర్ వార్నింగ్

by  |
cm-kcr-sad-photos1
X

దిశ, తెలంగాణ బ్యూరో: గంగా-జమునా తహజీబ్ స్ఫూర్తితో ఉన్న తెలంగాణలో మతపరమైన ఘర్షణలకు పాల్పడితే సహించే ప్రస్తకే లేదని, మతం పేరుతో దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే శక్తుల పట్ల కఠినంగానే వ్యవహరిస్తామన్నారు. రాష్ట్రంలో ఏ మతంవారికైనా రక్షణ ఉంటుందన్నారు. ఏ మతమూ దాడులకు పాల్పడాలనిగానీ, ఘర్షణలు పెట్టుకోవాలనిగానీ చెప్పదని, ఒకరినొకరు గౌరవించుకోవాలనే ప్రబోధిస్తాయన్నారు. అన్ని మతాల్లోని సారాంశం ఇదే అయినా మానవత్వాన్ని మించిన మతం లేదన్నారు. నగరంలోని ఎల్బీ స్టేడియంలో మంగళవారం సాయంత్రం ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు హాజరైన కేసీఆర్.. పై వ్యాఖ్యలు చేశారు.

ముస్లిం రాజులు హిందూ దేవాలయాలను ధ్వంసం చేశారని, ఇంకొంతమంది రాజులు ఇంకొన్ని మతాల ప్రార్థనాలయాలను కూలగొట్టారని, ఎవరు ఏం చేసినా చివరకు సాధించిందేంటని ప్రశ్నించారు. ఇతర మతాన్ని దూషించడం లేదా ఆ మతానికి చెందిన ఆలయాలను ధ్వంసం చేయడం గొప్పతనం కాదని, ప్రేమించడమే గొప్ప అని అన్నారు. మతం, విశ్వాసాలు పిచ్చి స్థాయికి చేరుకుంటేనే, ఉన్మాదం స్థాయికి వెళ్తేనే ప్రమాదమన్నారు. ఇతర దేశాలకు లేని గొప్పదనం భారతదేశానికి ఉన్నదని, చాలా మతాలవారు వారివారి పండుగలను సంతోషంగా, సంతృప్తిగా జరుపుకునే చరిత్ర ఉన్నదని గుర్తుచేశారు.



Next Story

Most Viewed