20న సిద్దిపేటకు కేసీఆర్.. కలెక్టరేట్, కమిషనరేట్ల ప్రారంభం

by  |
20న సిద్దిపేటకు కేసీఆర్.. కలెక్టరేట్, కమిషనరేట్ల ప్రారంభం
X

దిశ ప్రతినిధి, మెదక్ : ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట పర్యటన ఖరారైంది. ఈ నెల 20 న సిద్దిపేట జిల్లాలో రాజీవ్ రహదారి రాంపల్లి గ్రామ శివారులో నిర్మించిన నూతన జిల్లా కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్ కార్యాలయాలను ప్రారంభించనున్నారు. సిద్దిపేట జిల్లాలో నూతనంగా నిర్మిస్తున్న కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్ కార్యాలయాలు పూర్తయ్యాయి. ఇరు భవనాల్లో ఆయా ప్రభుత్వ శాఖలకు గదులను కేటాయించారు. ప్రస్తుతం ఫర్నీచర్, ఫైళ్ల తరలింపు కార్యక్రమం కొనసాగుతుంది. నేటి సాయంత్రం లోగా తరలింపు ప్రక్రియ పూర్తికానుంది. కాగా సీఎం పర్యటన ఏర్పాట్లును బుధవారం రాష్ట్ర ఆర్ధిక మంత్రి తన్నీరు హరీశ్ రావు, జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, సీపీ జోయల్ డేవితో కలిసి పరిశీలించారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.

ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి..

నూతన రాష్ట్రం ఏర్పడిన రెండేళ్ల తర్వాత నూతన జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. 2016 సంవత్సరం దసరా పండుగ రోజున సిద్దిపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేశారు. సరిగ్గా ఏడాదికి తిరిగి సీఎం కేసీఆర్ నూతన కలెక్టరేట్, సీపీ కార్యాలయాల భవనాలకు శంకుస్థాపన చేశారు. సిద్దిపేట రాజీవ్ రహదారి కొండపాక మండలం రాంపూర్ గ్రామ శివారులో కలెక్టర్ కార్యాలయం, అధికారుల నివాసాలకు 12.15 ఎకరాలు, మొత్తం 48.15 ఎకరాల్లో కలెక్టరేట్ కార్యాలయాన్ని నిర్మించారు. ఇందుకోసం మొత్తం రూ .62.60 కోట్లు నిధులను ప్రభుత్వం కేటాయించింది. అదే విధంగా అత్యాధునిక సౌకర్యాలతో నూతన పోలీస్ కమిషనరేట్ భవనాన్ని రూ.19 కోట్లతో నిర్మించారు. ఈ నెల 20 లోపు అన్ని పనులు పూర్తి చేసుకొని సమీకృత కలెక్టరేట్ తో పాటు సీపీ భవనాన్ని సైతం సీఎం చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుంది.

కలెక్టరేట్‌లో 105 గదులు..

రాష్ట్రానికే మోడల్‌గా నిర్మించిన కలెక్టరేట్లో అన్ని శాఖలు ఒకేచోట ఉండేలా ప్రణాళిక రచించారు. ఇందుకోసం జీప్లస్ టూ తరహాలో 105 గదులు కేటాయించారు. గ్రౌండ్ ఫ్లోర్ లో 43, ఫస్ట్ ఫ్లోర్ లో 29, సెకండ్ ఫ్లోర్ లో 34 గదులున్నాయి. అన్ని శాఖల కార్యాలయాలతో పాటు సమావేశ మందిరం, వీడియో కాన్ఫరెన్స్ కోసం ప్రత్యేక గది, క్యాంటిన్, బ్యాంకు ఏటీఎం, మీసేవ, రికార్డుల గదులతో పాటు మంత్రికి ప్రత్యేక ఛాంబర్‌కు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్లో హెలిప్యాడను సైతం ఏర్పాటు చేశారు. నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి జిల్లా కలెక్టర్ 12 మంది అధికారులను కేటాయించారు. ఇప్పటికే ఫర్నీచర్ తరలింపు ప్రక్రియ పూర్తయ్యింది. నేటి సాయంత్రంలోగా పూర్తిస్థాయిలో తరలింపు ముగుస్తుందని జిల్లా అధికారులు తెలిపారు.

అత్యాధునిక హంగులతో కమిషనరేట్..

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ అన్ని హంగులతో నిర్మించారు. వీటి నిర్మాణ పనులను సీపీ జోయల్‌ డేవిస్ దగ్గరుండి పర్యవేక్షించారు. సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా రాష్ట్ర డీజీపీ మహేందర్‌ రెడ్డి కార్యాలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. సీపీ కార్యాలయంలో సీపీ చాంబర్, పబ్లిక్ గ్రీవెన్స్ రూం, గార్డు రూం, పీసీ రూం, ఇద్దరు అడషనల్ డీసీపీల గదులు, పీఆర్వో, ఏసీపీ, కమ్యూనికేషన్ రూమ్, క్రైడ్ రికార్డు గదులు, ఐటీ సెల్, సైబర్ ల్యాబ్, కమాండ్ కంట్రోల్ రూమ్, డిజిటల్ ట్రైనింగ్ రూమ్, కానరైన్స్ హాల్, మీడియా, క్రైమ్ మీటింగ్ హాల్, ఫింగర్ ప్రింట్లకు ప్రత్యేక గదులు కేటాయించారు.

20న సీఎం చేతుల మీదుగా ప్రారంభం ..

సిద్దిపేట జిల్లాలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్ కార్యాలయాలు గతేడాది క్రితమే పూర్తయినప్పటికి పలు కారణాల వల్లపర్యటన వాయిదా పడుతూ వచ్చింది. ఈ నెల 10 న కూడా కలెక్టరేట్, సీపీ భవనాల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేసినప్పటికి అనివార్యకారణాల వల్ల కార్యక్రమం వాయిదా పడింది. ఈ నెల 20 న సీఎం పర్యటన ఖరారు కావడంతో జిల్లా కలెక్టర్, వారి అధికార బృందం, సీపీ జోయల్‌ డేవిస్, ఏసీపీలు, డీసీపీలు ప్రారంభోత్సవ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. బుధవారం రోజున రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్ రావు సైతం ఏర్పాట్లను పరిశీలించి ఎలాంటి అసౌకర్యాలు కల్లకుండా చూడాలని అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతి కార్యాలయానికి శాఖల వారీగా సైనేజ్ బోర్డులు పెట్టాలని సూచించారు.

Next Story

Most Viewed