రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబ పాలన.. కేసీఆర్ పెద్ద మోసగాడు!

by  |
vivek-and-prabakar 1
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ రాజకీయాల్లో తన కుటుంబం ఉండదని చెప్పి మాటతప్పారని, ఇప్పుడు కుటుంబ పాలనను సాగిస్తూ యావత్ తెలంగాణను మోసం చేశారని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి తీవ్ర విమర్శలు చేశారు. గన్ పార్క్ వద్ద శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రాన్ని ప్రజాస్వామ్యిక తెలంగాణగా తీర్చిదిద్దుతానని చెప్పి మాట తప్పారని ఆయన ఆరోపణలు చేశారు. ఉద్యమకారులందరినీ అవసరానికి వాడుకొని నమ్మించి గొంతు కోశారని విమర్శించారు. తనను, ప్రొఫెసర్ కోదండరాం, ఈటల రాజేందర్ ను ఘోరంగా మోసం చేశారన్నారు. అలాగే తెలంగాణలో పార్టీ పెట్టి పోరాటం చేసిన ఆలె నరేందర్, విజయ శాంతిని తన పార్టీలోకి విలీనం చేసుకుని బలిపశువుని చేశారన్నారు. తెలంగాణ బిల్లు కోసం పోరాడింది తాను, విజయశాంతి అని, ఆ సమయంలో కేసీఆర్ పార్లమెంట్ లో లేడని గుర్తుచేశారు. కేసీఆర్ తర్వాతి స్థానంలో తన కొడుకు కేటీఆర్ ను నిలపాలని కేసీఆర్ చూస్తున్నారని అన్నారు.

ఉద్యమకారులు ఏకమవ్వాలి : మాజీ ఎమ్మెల్యే ఎన్ వీఎస్ఎస్ ప్రభాకర్

తెలంగాణలో ఉద్యమకారులంతా ఏకమై సీఎంకు బుద్ధి చెప్పాలని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఎన్ వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కల్తీ విత్తనాల అమ్మకం తెలంగాణలో పతాక స్థాయిలో ఉందన్నారు. ఈ ఏడేళ్లలో కనీసం ఏడుగురిపై కూడా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ కి భిన్నంగా 13 లింక్ రోడ్ల నిర్మాణం జరుగుతోందని, అయితే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల భూముల ధరలు పెంచేందుకు మార్పులు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. హెచ్ఎండీఏ పరిధిలోని ప్రతి ల్యాండ్ కు సంబంధించిన ట్రాన్సాక్షన్ వెనుకు కేటీఆర్ మిత్ర బృందం ఉందని ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వ భూములపై కేసీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

అలాగే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలన్నారు. ఈ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని ఆయన తెలిపారు. మధ్యంతర ఎన్నికలకు వెళ్లే ధైర్యం కేసీఆర్కు ఉందా అంటూ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ సవాల్ విసిరారు. ఈటల రాజేందర్ రాజీనామాను స్పీకర్ ఆమోదించారని ఆయన స్పష్టం చేశారు. పార్టీ మారిన నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ ఈటల రాజీనామా చేశారని, అలా కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి పార్టీ మారిన నేతలు కూడా రాజీనామా చేయాలని లేదా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వారితో రాజీనామా చేయించి నైతిక విలువలు కలిగి ఉన్న వ్యక్తిగా నిరూపించుకోవాలని సూచించారు.



Next Story

Most Viewed