ఏం చేద్దాం.. కేంద్రం గెజిట్‌పై సీఎం కేసీఆర్ గరం గరం

by  |
cm-kcr-krishna-board
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ, తెలంగాణ మధ్య నది జలాల వివాదంలో కృష్ణా బోర్డు జోక్యం చేసుకోవడంపై రాష్ట్ర సర్కార్ భగ్గుమంది. రాత్రికే రాత్రికే రెండు తెలుగు రాష్ట్రాలకు గోదావరి, కృష్ణా బోర్డు పరిధిలను నిర్ణయిస్తూ కేంద్రం అర్ధరాత్రి గెజిట్ విడుదల చేయడంపై కేసీఆర్ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ విషయాన్ని వచ్చే పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తి, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సుప్రీంకోర్టుకు కూడా వెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ విషయంపై చర్చించేందుకు మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంటరీ స్థాయి సమావేశం జరగనుంది. కేంద్రం ఏకపక్ష నిర్ణయంపై గరంగరంగా ఉన్న కేసీఆర్.. సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు న్యాయ నిపుణులతో చర్చించి సలహాలు తీసుకోనున్నారు.

అయితే, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులో వెంటనే విద్యుత్ ఉత్పత్తి ఆపేయాలని ఇటు తెలంగాణకు.. రాజోలిబండ కుడి కాలువ పనులు ఆపేయాలని అటు ఏపీకి కేఆర్ఎంబీ లేఖ రాసింది. అంతేకాకుండా, సీడ్ మనీ కింద రెండు రాష్ట్రాలు రూ.200 కోట్లను బోర్డుల వద్ద డిపాజిట్ చేయాలని కేంద్రం ఆదేశించింది.అందుకోసం 60రోజుల గడువు తేదీని ఇచ్చారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఇన్నేళ్లకు కేంద్రం గోదావరి, కృష్ణా బోర్డులకు పరిధిలను కేటాయించింది. గెజిట్ నోటిఫికేషన్ ఆదేశాలు ఆక్టోబర్ 14 నుంచి అమల్లోకి రానున్నాయి. దీనికి సంబంధించిన ముసాయిదాను ఇప్పటికే ఇరు రాష్ట్రాలకు పంపించారు. దీని ఆధారంగానే ఫైనల్ నోటిఫికేషన్ వెలువడనున్నట్లు సమాచారం. కృష్ణాబోర్డు పరిధిలోకి బచావత్ ట్రైబ్యునల్ కేటాయింపులు ఉన్న ప్రాజెక్టులు రానున్నాయి.

రెండు బోర్డుల పరిధిలోకి కృష్ణానదిపై 36, గోదావరిపై 71 ప్రాజెక్టులు రానుండగా.. కొత్తగా నిర్మించే వాటికి బోర్డుల అనుమతులు లేకపోతే ప్రాజెక్టులు నిలిపివేయాల్సిందేనని స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నవాటికి ఆరునెలల్లో అనుమతులు తెచ్చుకోవాలని కేంద్రం తెలిపింది. అన్ని ప్రాజెక్టుల నిర్వహణ కూడా బోర్డు పరిధిలోనే ఉంటాయని కేంద్రం పేర్కొంది. ఇకపై గోదావరి, కృష్ణా బోర్డులకు స్థానికులు కాకుండా ఇతరరాష్ట్రాలకు చెందిన వారే చైర్మన్లుగా వ్యవహరించనున్నారు. బోర్డుల నిర్వహణ వ్యయం కూడా రెండు రాష్ట్రాలు సమానంగా భరించాలి. అడిగిన 15 రోజుల్లోనే నిర్వహణ ఖర్చులు జమచేయాలి. ప్రాజెక్టుల నీళ్లు, విద్యుదుత్పత్తి పర్యవేక్షణ అధికారం ఇకపై బోర్డులకే వర్తించనుంది. ఉమ్మడి ప్రాజెక్టుల వద్ద గొడవలకు చాన్స్ లేకుండా ఇకపై CISF కేంద్ర బలగాలు పహారా కాయనున్నాయి.



Next Story

Most Viewed