కాళేశ్వరం ప్రాజెక్ట్: అద్భుత ఘట్టం ఆవిష్కరణ

by  |
కాళేశ్వరం ప్రాజెక్ట్: అద్భుత ఘట్టం ఆవిష్కరణ
X

దిశ, మెదక్: కాళేశ్వరం ప్రాజెక్టులో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. మర్కూక్ పంప్ హౌస్ మోటార్లను సీఎం కేసీఆర్, చినజీయర్‌ స్వామితో కలిసి ప్రారంభించారు. 34 మెగావాట్ల సామర్థ్యంతో 6 మోటార్లను ఏర్పాటు చేయగా, ఇందులో ఒక మోటార్‌ను స్విచ్చాన్ చేసి.. కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి కాళేశ్వరం జలాల ఎత్తిపోతను ప్రారంభించారు. ఉదయమే కొండపోచమ్మ ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ దంపతులు చండీహోమం పూర్ణాహుతిలో పాల్గొన్నారు. అనంతరం సీఎం కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి బయల్దేరి వెళ్లారు. ఉదయం 9:35 గంటలకు తన సొంత ఖర్చులతో నిర్మించనున్న ఎర్రవల్లి రైతు వేదికకు సీఎం భూమిపూజ చేశారు. అనంతరం 10 గంటలకు మర్కూక్ పంప్ హౌస్ వద్ద నిర్వహించిన సుదర్శనయాగం పూర్ణాహుతిలో కేసీఆర్ దంపతులు, త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి పాల్గొన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మర్కూక్ మండల కేంద్రంలోని వరదరాజస్వామి దేవాలయంలో సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 1:30 గంటలకు ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం సమావేశం నిర్వహించారు.

మర్కూక్ పంప్ హౌస్ నుంచి కొండపోచమ్మసాగర్‌లోకి నీటిని ఎత్తి పోసే మోటర్లను ప్రారంభించటంతో గోదావరి జలాలు కొండపోచమ్మ సాగర్‌లోకి చేరుకున్నాయి. అనంతరం కొండపోచమ్మ కట్టపై గోదావరి నీటికి సీఎం కేసీఆర్ జలహారతి ఇచ్చారు. సముద్ర మట్టానికి 530 మీటర్ల ఎత్తులో కొండపోచమ్మ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టారు. రెండు పంప్ హౌసులున్న ఏకైక రిజర్వాయర్‌గా కొండపోచమ్మ రికార్డ్ సృష్టించింది. రిజర్వాయర్ సామర్థ్యం 15 టీఎంసీలతో 2.85 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది.

Next Story

Most Viewed