చిత్తూరులో ముగిసిన సీఎం జగన్ పర్యటన.. వారికి జగన్ సన్మానం

by  |
చిత్తూరులో ముగిసిన సీఎం జగన్ పర్యటన.. వారికి జగన్ సన్మానం
X

దిశ, రాయలసీమ: చిత్తూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటిస్తున్నారు. తిరుపతిలోని కృష్ణానగర్‌ను సీఎం పరిశీలించి వరద బాధితులను పరామర్శించారు. వరదలకు దెబ్బతిన్న ఇళ్లను ఆయన పరిశీలించడం జరిగింది. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని జగన్ భరోసా ఇచ్చారు. వరద నష్టాలపై ఫోటో గ్యాలరీని సీఎం తిలకించారు. చంద్రగిరి, తిరుపతి రూరల్ మండలాలతో పాటు చంద్రగిరి నియోజకవర్గంలో రహదారులు భవనాలు, వ్యవసాయ, ఉద్యానవన, గృహనిర్మాణం, విద్యుత్ శాఖలకు సంబంధించి వరద నష్టంపై అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను సీఎం పరిశీలించారు.

పాడిపేట బ్రిడ్జి పరిశీలన

తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు-పాడీపేట వద్ద స్వర్ణముఖి నది పై వరద ఉధృతికి కొట్టుకుపోయిన బ్రిడ్జిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాణాలకు తెగించి వరద సహాయక చర్యల్లో పాల్గొన్న పలువురుని సీఎం జగన్ సన్మానించారు. నవంబర్ 18 గురువారం రాత్రి స్వర్ణ ముఖి నది పొంగి ప్రవహించడంతో పాడిపేట వద్ద వరదలో కొట్టుకుపోతున్న ప్రజలను పోలీస్ కానిస్టేబుల్‌ ప్రసాద్, ప్రాజెక్టు మేనేజర్ రంగస్వామి, రామకృష్ణారెడ్డి కాలనీకి చెందిన ఎస్.శ్రీనివాసులు రెడ్డి, ఎ రెడ్డప్ప, టీ మధులను సీఎం జగన్ అభినందించారు.

వీరందరినీ అభినందిస్తూ మెమెంటోలు అందజేశారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి 30 మందిని కాపాడటంపై సీఎం జగన్ అభినందనలతో ముంచెత్తారు. సీఎం జగన్ వెంట డిప్యూటీ సీఎం కే నారాయణస్వామి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు..ఉన్నతాధికారులు ఉన్నారు.



Next Story

Most Viewed