పంట నష్టాన్ని వీలైనంత త్వరగా పంపాలి

by  |
పంట నష్టాన్ని వీలైనంత త్వరగా పంపాలి
X

దిశ, ఏపీ బ్యూరో: చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల ప్రజలకు నివర్​ తుఫాన్ తీవ్ర నష్టాలను మిగిల్చింది. మానవతా దృక్పథంతో ప్రజలను ఇతోధికంగా ఆదుకోవాలని అధికారులను సీఎం జగన్​ ఆదేశించారు. మూడు జిల్లాల్లో శనివారం ఉదయం ఏరియల్ ​సర్వేను సీఎం నిర్వహించారు. అనంతరం రేణిగుంట ఎయిర్​పోర్టులో ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులతో నష్టం అంచనాలపై సమీక్షించారు. చిత్తూరు జిల్లాలో ఆరుగురు, కడప జిల్లాలో ఇద్దరు మృతిచెందారు.

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారాన్ని వెంటనే అందించాలని అధికారులను ఆదేశించారు. పంట నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు ఇవ్వాలన్నారు. డిసెంబర్‌ 15లోపు పంట నష్టంపై నివేదిక ఇవ్వాలని కోరారు. డిసెంబర్‌ 31లోపు రైతులకు నష్టపరిహారం చెల్లించేట్లు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్‌ను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని చెప్పారు. దెబ్బతిన్న రోడ్లు, ప్రాజెక్టులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని నిర్దేశించారు.

అన్నమయ్య డ్యామ్‌ సామర్థ్యాన్ని 10 టీఎంసీలకు పెంచుతామని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. తొలుత సీఎం ఉదయం తొమ్మిదిన్నరకు గన్నవరం నుంచి బయల్దేరారు. రేణిగుంట విమానాశ్రయంలో ఉప ముఖ్యమంత్రులు నారాయణస్వామి, అంజాద్​బాషా, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ చీఫ్​ విప్​ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్​ ఆర్కే రోజా, ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి సీఎంకు స్వాగతం పలికారు. ఎయిర్​పోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని సందర్శించారు.



Next Story