ఇప్పుడక్కడ అందరిలో ఇదే ఆందోళన..?

by  |
ఇప్పుడక్కడ అందరిలో ఇదే ఆందోళన..?
X

దిశ‌, ఖమ్మం: కొత్తగూడెం టీఆర్‌ఎస్‌లో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంటోంది. మాజీ ఎమ్మెల్యే జ‌లగం వెంక‌ట‌రావు.. ప్రస్తుత ఎమ్మెల్యే వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర్లు మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ రెండుగా చీలిపోయి.. స్వ‌ప‌క్షంలోనే విప‌క్షం త‌యారైంది. ఈ వాడి వేడీ రాజ‌కీయం గ‌త రెండు నెల‌లుగా మ‌రింత పెరిగింద‌నే చెప్పొచ్చు. నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయంపై ప‌ట్టు త‌ప్ప‌కుండా ఒక‌రు.. ప‌ట్టుకోసం మ‌రొక‌రు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌ల‌గం వెంక‌ట్రావ్ విజ‌యం సాధించారు. అప్పటి నుంచి కార్య‌క‌ర్త‌ల‌కు, నాయ‌కుల‌కు కాస్తంత దూరం పాటించార‌నే అభిప్రాయం శ్రేణుల్లో ఉంది. ఫ‌లితంగా 2019 ఎన్నిక‌ల్లో గులాబీ టికెట్ ద‌క్కించుకున్నా.. వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర్లు చేతిలో స్వ‌ల్ప మెజార్టీతో ఓట‌మిపాల‌య్యారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచిన వ‌న‌మా ఆ త‌ర్వాత గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.

వ్యూహాత్మకంగా జలగం

భ‌విష్య‌త్ రాజ‌కీయ అవ‌కాశాల‌పై ఇప్ప‌టి నుంచే జ‌లగం వెంక‌ట్రావ్‌ వ్యూహాత్మ‌క అడుగులు వేస్తున్నట్లు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీ క్యాడ‌ర్‌ను జ‌ల‌గం వైపు తిప్పేందుకు య‌త్నిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అదే స‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి నిలిచిపోయింద‌ని ప్ర‌చారం చేస్తున్న‌ట్లు వ‌న‌మా వ‌ర్గీయులు చెబుతున్నారు. ఇటీవ‌ల సుజాత‌న‌గ‌ర్‌లో డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల‌కు అర్హుల‌కు ఎంపిక స‌మ‌యంలో కొంత‌మంది త‌మ‌కు కేటాయించాల‌ని ఆందోళ‌న‌కు దిగారు. అయితే ఈ ఆందోళ‌న‌ల వెనుక కూడా జ‌ల‌గం వ‌ర్గీయులే ఉన్నార‌ని వ‌న‌మా వ‌ర్గీయులు పేర్కొంటున్నారు.

ఎమ్మెల్యే ఆరోపణలు!

వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర్లు కొడుకు రాఘ‌వ‌ త‌న‌ను లోబ‌ర్చుకోవ‌డానికి య‌త్నించాడ‌ని, లొంగ‌క‌పోవ‌డంతో త‌న అనుచ‌రుల‌తో దాడి చేయించాడ‌ని పాత‌ పాల్వంచ ప్రాంతానికి చెందిన ఓ మ‌హిళ గిరిజ‌న సంక్షేమ‌శాఖ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్‌కు ఫిర్యాదు చేసింది. ఈ సంఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. అయితే స‌ద‌రు మ‌హిళ ఫిర్యాదులో వాస్త‌వం లేద‌ని, కేవ‌లం వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర్లు కుటుంబాన్ని రాజ‌కీయంగా దెబ్బ‌కొట్ట‌డానికే చేసింద‌ని మంత్రి స‌త్య‌వ‌తి స్వ‌యంగా వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. ఎన్నిక‌ల‌కు ఇంకా మూడున్న‌రేళ్ల స‌మ‌యం ఉండ‌గానే కొత్త‌గూడెంలో రాజ‌కీయ సెగ‌లు ఈ స్థాయిలో ఉంటే పోను పోను ఈ హీట్ ఏ స్థాయికి చేరుకుంటుందో చూడాలి.



Next Story