వెనక్కి తగ్గని చైనా.. మరోసారి చర్చలు

by  |
వెనక్కి తగ్గని చైనా.. మరోసారి చర్చలు
X

న్యూఢిల్లీ: ఎల్ఏసీ(వాస్తవాధీన రేఖ) సరిహద్దులో ఘర్షణాత్మకంగా మారిన నాలుగు పాయింట్లలో రెండింటి నుంచి చైనా సైన్యం వెనక్కి తగ్గడం లేదు. ప్యాంగాంగ్ సో, గోగ్రాలోని పెట్రోలింగ్ పాయింట్ 17ఏ నుంచి నిర్దేశించుకున్నమేరకు ఉపసంహరణ చేపట్టడం లేదు. దీంతో మరోసారి మిలిటరీ, దౌత్య మార్గాల్లో శాంతి చర్చలు జరగనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. ముఖ్యంగా ప్యాంగాంగ్ సో ఏరియాలో ఉపసంహరణ దాదాపు నిలిచిపోయిందని, ఆ దేశ ప్రకటనలకు క్షేత్రస్థాయిలోని కార్యకలాపాలకు పొంతనలేదని వివరించాయి. సరిహద్దు ఘర్షణకు సంబంధించి మరోసారి చర్చలకు షెడ్యూల్ ఖరారు కానున్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ గురువారం వెల్లడించిన సంగతి తెలిసిందే.

జూన్ 15న హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్న గాల్వన్ లోయలోని పెట్రోల్ పాయింట్ 14 నుంచి చైనా ట్రూపులు వారివైపున ఎల్‌ఏసీ వరకు వెనక్కివెళ్లాయి. కాగా, హాట్‌స్ప్రింగ్స్‌ సెక్టార్ పీపీ 15 నుంచి ఎలాంటి షరతుల్లేకుండానే ఉపసంహరణకు పూనుకుంటామని చైనా సూచనప్రాయంగా తెలిపిందని, గురువారం నుంచే ఈ ప్రక్రియ మొదలైనట్టు సమాచారం. పీపీ 14 దగ్గర ఇరుదేశాల ఆర్మీ మధ్య నాలుగు కిలోమీటర్లు, పీపీ 15 దగ్గర పది కిలోమీటర్ల దూరం ఉన్నట్టు తెలిసింది. సరిహద్దులో శాంతి కోసం భారత్, చైనా 1993 నుంచి ఎన్నో ఒప్పందాలు చేసుకున్నదని, వాటి ప్రకారం నడుచుకోవడానికి ఇరుదేశాలు అంగీకరించాయని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. బార్డర్‌లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలను సహించబోమని హెచ్చరించారు.

Next Story

Most Viewed