టాయిలెట్‌లో టైమర్లు.. టైంపాస్‌కు చెక్

by  |
టాయిలెట్‌లో టైమర్లు.. టైంపాస్‌కు చెక్
X

దిశ, వెబ్‌డెస్క్ : సాధారణంగా ఏ కంపెనీలో చూసుకున్నా.. ఉద్యోగులకు 8 గంటల పని వేళలే ఉంటాయి. కానీ టీ బ్రేక్, లంచ్ బ్రేక్, స్నాక్ టైమ్ అంటూ.. ఎంప్లాయిస్ క్యాంటిన్‌లోనే ఎక్కువగా గడుపుతారని యాజమాన్యాలు భావిస్తుంటాయి. అంతేకాదు, ఉద్యోగులు టాయిలెట్లలోనూ టైంపాస్ చేస్తున్నారని చాలా సంస్థలు కంప్లయింట్ చేస్తుంటాయి. అయితే టాయిలెట్‌లో ఈ తరహా టైమ్ వేస్ట్ కార్యక్రమానికి ఓ చైనా కంపెనీ వినూత్న ఆలోచనతో చెక్ పెట్టింది

కొన్ని సంస్థలు.. టీ బ్రేక్ 10 నిమిషాలు మాత్రమే అని, 20 నిమిషాల్లో లంచ్ పూర్తిచేయాలని రూల్స్ పెడుతుంటాయి. ఇంకొన్ని సంస్థల్లో అయితే.. పని చేసే ప్రదేశాల్లో ‘మొబైల్ ఫోన్ నాట్ అలోడ్’ అని బోర్డు పెట్టేస్తారు. ఈ క్రమంలోనే.. చైనాకు చెందిన కుయిషౌ అనే టెక్ సంస్థ టాయిలెట్లలో టైమర్లు ఏర్పాటు చేసింది. కాగా ఆ కంపెనీ ఉద్యోగులు.. టాయిలెట్‌లో ఎంత టైమ్ స్పెండ్ చేయాలో కూడా కంపెనీయే నిర్ణయించడం సబబు కాదని నెటిజన్లు మండిపోతున్నారు. టాయిలెట్‌లో టైమర్ల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కంపెనీపై సర్వత్రా విమర్శలు వెల్తువెత్తుతున్నాయి. ‘టాయిలెట్ వెళ్లేందుకు కూడా టైమింగ్ ఉంటుందా? ఆ మాత్రం స్వేచ్ఛ కూడా ఉద్యోగులకు ఉండదా? ఇది మానవ హక్కుల ఉల్లంఘనే అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

నెటిజన్లు, చైనా ప్రజల నుంచి విమర్శలు రావడంతో ‘వీబో’ అనే వెబ్‌సైట్‌లో కుయిషౌ దీనిపై వివరణ ఇచ్చింది. ‘ఆ కార్యాలయంలో చాలా తక్కువ టాయిలెట్లు ఉన్నాయి. దీంతో ఉద్యోగులు టాయిలెట్ల ముందు క్యూ కడుతున్నారు. టాయిలెట్ల సంఖ్య పెంచాలని చూసినా.. ఆ భవనంలో కొత్త నిర్మాణాలు చేయడం చాలా కష్టం. టాయిలెట్ సమయాన్ని కొలిచేందుకు మాత్రమే ఆ టైమర్లు ఏర్పాటు చేశాం. వాటి ద్వారా ఉద్యోగులకు అదనంగా ఎన్ని టాయిలెట్లు అవసరమవుతాయో తెలుసుకుంటాం. దాంతో ఎన్ని పోర్టబుల్ టాయిలెట్లు అవసరమవుతాయో ఇన్‌స్టాల్ చేస్తాం’ అని ఆ పోస్టులో పేర్కొంది.

Next Story