423మీటర్లు చొచ్చుకొచ్చిన డ్రాగన్!

by  |
423మీటర్లు చొచ్చుకొచ్చిన డ్రాగన్!
X

న్యూఢిల్లీ: మిలిటరీ, దౌత్య చర్చల్లో ఏకీభవించిన నిర్ణయాలను డ్రాగన్ దేశం బేఖాతరు చేస్తున్నది. తొలి రౌండ్ మిలిటరీ చర్చలోనే సైన్యం ఏప్రిల్ నాటి పొజిషన్‌లోకి వెళ్లేందుకు అంగీకరించింది. కానీ, ఇప్పటివరకు ఆ దేశ సైనికులు వెనక్కి తగ్గనేలేదు. అంతేకాదు, మరింత ముందుకు చొచ్చుకొస్తున్నారు. ఎంతగానంటే 1960లో స్వయానా ఆ దేశమే గీసుకున్న, వాదించిన సరిహద్దును దాటి వచ్చింది. శాటిలైట్ చిత్రాల ప్రకారం, జూన్ 25నాటికి ‘డ్రాగన్’ సైన్యం సుమారు 423 కిలోమీటర్లు భారత భూభాగంలోకి చొరబడి టెంట్లు, టార్పాలీన్ గుడారాలను ఏర్పాటు చేసుకుంది.

భారత్, చైనా మధ్య జరిగిన చర్చలకు సంబంధించిన ప్రశ్నోత్తరాల వివరాలను విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 1960-61లో ‘రిపోర్ట్ ఆఫ్ ద అఫీషియల్స్ ఆఫ్ ద గవర్నమెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ ద పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఆన్ ద బౌండరీ కొశ్చన్’ అనే రిపోర్టును పబ్లిష్ చేసింది. ఈ రిపోర్టులో చైనా వాదనలతో శాటిలైట్ చిత్రాలను పోల్చిచూస్తే ఆ దేశ సైన్యం మరింత ముందుకొచ్చిందని తెలుస్తోంది. స్వయంగా ఆ దేశం వాదించుకున్న భౌగోళిక సరిహద్దులను దాటి ఇప్పుడు చైనా సైన్యం భారత భూభాగంలోకి వచ్చినట్టు అవగతమవుతున్నది. చైనా వాదించిన సరిహద్దుకు ఉత్తరాన గాల్వాన్ లోయ గుండా 423 మీటర్ల మేర భారత భూభాగంలోకి చైనీస్ ఆర్మీ వచ్చినట్టు ఆ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. 1962 యుద్ధ సమయంలో ఆ దేశ సైన్యం 1960లో వాదించుకున్న సరిహద్దుకు చేరుకున్నాయి. అయితే, యుద్ధానంతర ఒప్పందాల మేరకు చైనా సైన్యం మళ్లీ వెనక్కి మళ్లింది. కాగా, ఇప్పుడు శాంతి చర్చల్లో వెనక్కి మళ్లుతామని అంగీకరిస్తూనే ఎన్నడూ లేనంత ముందుకు భారత భూభాగంలోకి చొరబడుతున్నది.

మిలిటరీ అధికారుల మూడో రౌండ్ చర్చలు:

భారత్, చైనాలకు చెందిన మిలిటరీ అధికారులు మరోసారి శాంతి చర్చలు జరపనున్నారు. తూర్పు లడాఖ్‌లో నెలకొన్న ఉద్రిక్తతలను తొలగించడానికి, బలగాల ఉపసంహరణపై లెఫ్టినెంట్ జనరల్ స్థాయి చర్చలు మంగళవారం ఉదయం 10.30 గంటలకు మొదలకాబోతున్నట్టు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. ఇది వరకు జూన్ 6, 22వ తేదీల్లో చైనా వైపున మోల్డో ఏరియాలో మిలిటరీ శాంతి చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా, భారత భూభాగంలో చుషుల్ సెక్టార్‌లో ఈ సమావేశం జరగనుంది. ఇండియా నుంచి 14 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్, చైనా నుంచి టిబెట్ మిలిటరీ డిస్ట్రిక్ట్ కమాండర్ నేతృత్వంలో ఈ చర్చలు జరగనున్నట్టు సమాచారం. రెండో దశ మిలిటరీ చర్చల్లో సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గడానికి, బలగాల ఉపసంహరణకు ఇరుదేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. జూన్ 6న కుదిరిన అంగీకారాల అమలుపైనా ఈ చర్చలు జరగనున్నట్టు తెలిసింది.

జపాన్ నేవీతో కలిసి…

లడాఖ్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలోనే భారత నేవీ, జపాన్‌ నేవీతో కలిసి సంయుక్తంగా శిక్షణా కార్యక్రమం నిర్వహించింది. ఇండియన్ నేవీ, జపనీస్ మేరీటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సెస్‌తో కలిసి హిందూ మహాసముద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమం శనివారంతో ముగిసింది. జపాన్ రక్షణ మంత్రి తారో కోనో, చైనా సైన్యం సామర్థ్యంపైనే కాదు, ఇండో పసిఫిక్ సముద్రజలాల రీజియన్‌పైనా ఆ దేశ దృష్టిపడటంపై ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ రెండు దేశాల సముద్ర రక్షణ బలగాలు ఈ శిక్షణలు జరుపుకున్నాయి. ఆసియాలో చైనా ఆధిపత్య ప్రదర్శన చూపిస్తున్న ఇటీవలి కాలంలో తొలిసారిగా జపాన్ కాస్త కటువుగా మాట్లాడటం గమనార్హం. దక్షిణ చైనా సముద్ర జలాల్లో నెలకొన్న వివాదాలను అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించుకోవాలని 10 ఆగ్నేయాసియా దేశాలు ఇదే కాలంలో ఓ స్టేట్‌మెంట్ విడుదల చేయడం గమనార్హం. పొరుగుదేశాలతో ఆధిపత్య ధోరణి అనుసరిస్తున్న చైనాకు సంకేతమివ్వడంతోపాటు జపాన్‌తో రక్షణ సంబంధాలను మరింత విస్తృతం చేసుకోవడానికి ఈ ట్రైనింగ్ ఎక్సర్‌సైజులు పనికొస్తాయని దౌత్యవర్గాలు తెలిపాయి.

Next Story

Most Viewed