కరోనా కాటు.. తల్లిప్రేమకు దూరమైన 8 రోజుల శిశువు

by  |
mother died
X

దిశ, నార్కట్ పల్లి: నవమాసాలు మోసింది. పురిటినొప్పులను ఓర్చి౦ది. పండండి బిడ్డకు జన్మనిచ్చింది. కొడుకును చూసి సంబుర పడింది. కానీ ఆ కన్నతల్లి ప్రేమ ఎంతో సేపు నిలవలేకపోయింది. కోరలు చాచుక్కూర్చున్న కరోనా ‘‘అమ్మప్రేమ’’పై కన్నెర్ర చేసింది. పేగు బందాన్ని దూరం చేసింది. ఎనిమిది రోజుల శిశువు నుంచి కన్నతల్లిని కానరాని లోకాలకు వెల్లగొట్టింది. పసిబిడ్డును అనాథను చేసింది. కరోనా విధ్వంసానికి ఈ ఘటన సజీవ సాక్షంగా నిలిచింది. రాతి గుండెలను సైతం కరిగిస్తున్న ఈ హృదయ విధార ఘటన నల్గొండ జిల్లాలోని చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

వెలిమినేడు గ్రామానికి చెందిన బద్దుల శేఖర్ బాటసింగారం గ్రామానికి చెందిన తన మేనమామ కూతురైన అనన్య(24) ను 2019 డిసెంబర్31న వివాహం చేసుకున్నాడు. అనన్య డెలివరీ కోసం ఈ నెల 3న వనస్థలిపురంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యుల తప్పిదంతో అనన్యకు కరోనా పాజిటివ్ పేషంట్ పక్కన బెడ్ కేటాయించారు. దీంతో ఆమెకు కరోనా సోకింది. ఆపరేషన్‌కు ముందురోజు ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమె పరిస్థితి విషమించడంతో ఈ నెల 7న హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌కి తరలించారు. మరుసటి రోజు 8వ తేదీన సిజేరియన్ ఆపరేషన్ చేసి బాబును బయటకు తీశారు. మగబిడ్డ పుట్టాడని అనన్యను చెప్పడంతో తల్లి సంబురపడిపోయంది. అనంతరం ఈనెల 11న ఆమెకు మళ్లీ కోవిడ్ పరీక్ష నిర్వహించగా నెగెటివ్ అని తేలింది. దీంతో అదేరోజు డిశ్చార్జ్ చేశారు.

అంతలోనే క్షిణించిన తల్లి ఆరోగ్యం

బిడ్డను తీసుకొని ఇంటికెళ్లిన కొద్దిరోజులకే ఆమెకు మళ్లీ దగ్గు, ఆయాసం మొదలైంది. దీంతో అనుమానం వచ్చిన భర్త శేఖర్ వెంటనే కుటుంబ సభ్యులు అందరూ ఉప్పల్‌లోని ప్రైవేట్ ల్యాబ్‌లో కరోనా టెస్టులు చేయించుకున్నారు. అనన్యకు పాజిటివ్ రాగా, మిగిలిన వారికి నెగెటివ్ వచ్చింది. ఈ నెల 17న అనన్యకు కడుపులో నొప్పి రావడంతో ఆమెను చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. అక్కడ 3రోజులు చికిత్స పొందినప్పటికీ ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో వైద్యులు వేరే ఆస్పత్రికి తరలించాలని సూచించారు. వెంటనే 19 తేదీన ఆమెను ఎల్బీనగర్‌లోని కామినేని ఆసుపత్రిలో లక్ష రూపాయలు అడ్వాన్స్ కట్టి అడ్మిట్ చేశారు. అప్పటికే అనన్యకు లంగ్స్ ఇన్ ఫెక్షన్ సోకడంతో పరిస్థితి విషమించింది. చికిత్స పొందుతూ ఈనెల 20న రాత్రి మృతి చెందింది.

తల్లి కోసం తల్లడిల్లుతున్న పసిహృదయం

అప్పటి దాకా అమ్మ ఒడిలో హాయిగా నిద్రపోతున్నాడు. అంతలోనే అమ్మ స్పర్శ లేదు. అమ్మ శాశ్వత నిద్రలోకి వెళ్లిందనే విషయం తెలియదు. ఆమె ప్రేమకు, లాలనకు దూరమయ్యాననే విషయం తెలియక అమ్మపాల కోసం వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. అమ్మ లేదనీ, ఇక రాదనే చేదు నిజం తెలుసుకోలేని, ఈ పసి మనసు ముక్కలై పోయింది. కరోనా ఈ బిడ్డ కన్నతల్లిని పొట్టన పెట్టుకుంది. చివరకు ఈ చిట్టి తండ్రికి అమ్మ ప్రేమానురాగాలకు దూరం చేసింది. ప్రస్తుతం చంటి బిడ్డ ఆలనా పాలనా బంధువులే చూస్తున్నారు. అమ్మ లేని లోటును తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. కరోనా ఎన్నో కుటుంబాలను నాశనం చేయడమే కాకుండా.. ఇలాంటి పసి పాపలను తల్లిప్రేమకు దూరం చేస్తోంది.



Next Story

Most Viewed