మూడు గంటల ముందే ప్రధాని రాక

by  |
మూడు గంటల ముందే ప్రధాని రాక
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ టూర్ మూడు గంటలు ముందుకు జరిగింది. తొలుత వచ్చిన షెడ్యూలు ప్రకారం శనివారం సాయంత్రం నాలుగు గంటలకు (3.45 గంటలకు) హైదరాబాద్ రావాల్సి ఉంది. రెండు గంటల పాటు ఇక్కడే ఉండి సాయంత్రం ఆరు గంటల (5.40 గంటలు)కల్లా తిరిగి ఢిల్లీ వెళ్ళిపోవాల్సి ఉంది. కానీ ఆ షెడ్యూలులో ఎస్‌పీజీ అధికారులు మార్పులు చేశారు. కొత్తగా మారిన షెడ్యూలు ప్రకారం మధ్యాహ్నం ఒంటిగంటకల్లా హైదరాబాద్ చేరుకుని మళ్ళీ మూడు గంటలకల్లా తిరుగుప్రయాణం కానున్నారు.

తొలుత షెడ్యూలు ప్రకారం పూణె నగరం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చి ఆ తర్వాత నేరుగా ఢిల్లీకి వెళ్ళాల్సి ఉంది. తొలి షెడ్యూలుకు అనుగుణంగా ఎస్‌పీజీ (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు) పోలీసులు కూడా హకీంపేట విమానాశ్రయానికి చేరుకుని భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అయితే ఇక్కడి నుంచి ఎలాంటి నివేదిక ప్రధాని కార్యాలయానికి వెళ్ళిందోగానీ షెడ్యూలులో మార్పులు జరిగాయి. మధ్యాహ్నంకల్లా హైదరాబాద్ చేరుకుంటున్నారు. పూణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్ వెళ్ళాల్సిన కార్యక్రమం పూర్తిగా రద్దయినట్లు పోలీసుల సమాచారం.

కేవలం రెండు గంటల పాటు మాత్రమే హైదరాబాద్ నగరంలో ఉండనున్నారు. ఎయిర్‌ఫోర్స్ ఆధీనంలో ఉండే హకీంపేట విమానాశ్రయానికి చేరుకునే మోడీ సమీపంలో ఉన్న షామీర్‌పేటలోని భారత్ బయోటెక్ లాబ్‌ను సందర్శించి అక్కడి శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులతో చర్చించనున్నారు. అయితే అదే సమయానికి నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో బహిరంగసభ లాంటి కార్యక్రమాలు కూడా ఉన్నందున వీటిని దృష్టిలో పెట్టుకుని షెడ్యూలులో మార్పులు చేసినట్లు సమాచారం.

Next Story

Most Viewed