తీవ్రస్థాయిలో పోలీసుల వేధింపులు.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

by  |
తీవ్రస్థాయిలో పోలీసుల వేధింపులు.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో పోలీస్ ప్రతిష్ట రోజురోజుకూ దిగజారుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. చట్టానికి లోబడి పోలీసులు విధులు నిర్వహించాలి. కానీ వైసీపీ నేతల రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు పోలీసులు పనిచేస్తున్నారు. దీంతో పోలీసులపై ప్రజలు పెట్టుకున్న విశ్వాసం అగాధంలోకి వెళ్లిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రకాశం జిల్లా లింగసముద్రం పోలీసులు వైసీపీ నేతల ఆదేశాలతో మొగిలిచర్లకు చెందిన ఆరుగురు టీడీపీ కార్యకర్తలను స్టేషన్‌కు పిలిపించి వేధిస్తుండటం దుర్మార్గమన్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో 6, 10 ఏళ్ల చిన్నారులు కూడా ఉండటం విచారకరమన్నారు. పి.రత్తయ్య, ఎం.శ్రీకాంత్ అనే కార్యకర్తలను పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు. టీడీపీని వీడాలని చిత్రహింసలకు గురిచేసి అర్థరాత్రి 2 గంటలకు వదలిపెట్టారని.. ఉదయాన్నే మళ్లీ 6.30 గంటలకు లింగసముద్రం ఎస్ఐ ఫోన్ చేసి పోలీస్ స్టేషన్‌కు రావాలని బెదిరించారని చెప్పుకొచ్చారు.

పోలీసుల బెదిరింపులు తట్టుకోలేక రత్తయ్య, శ్రీకాంత్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తర్వాత మిగిలిన వారిని హడావుడిగా స్టేషన్ నుంచి పంపించారు. ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వలేదు. ఈ సంఘటనతో రాష్ట్రంలో పోలీసుల వేధింపులు ఏస్థాయిలో ఉన్నాయో అర్థమవుతోందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు డీజీపీ గౌతంసవాంగ్‌కు చంద్రబాబు లేఖ రాశారు. పోలీసుల తీరుపైనా..పోలీస్ వ్యవస్థపైనా అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కొంతమంది పోలీసులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ.. టీడీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. వైసీపీ నేతల రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసులు పనిచేస్తున్నారనడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. రెండేళ్లలో పోలీసుల బెదిరింపులు తారాస్థాయికి చేరుకున్నాయని చంద్రబాబు ధ్వజమెత్తారు. లింగసముద్రం ఘటనపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పక్షపాతం లేకుండా పోలీసులు విధులు నిర్వహించేలా ఆదేశించాలని లేఖలో డీజీపీ గౌతం సవాంగ్‌ను చంద్రబాబు సూచించారు.



Next Story

Most Viewed